logo

బోధనేతర విధుల్లో గురువులు

ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించొద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలు ఉన్నా, వాటిని బేఖాతర్‌ చేస్తూ పల్నాడు జిల్లాలో ఏకంగా 10 మంది ఉపాధ్యాయులను

Published : 30 Nov 2022 04:40 IST

ఓ ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో డిప్యూటేషన్లు
జిల్లా కేంద్రంలో తిష్ఠ వేసిన పది మంది

ఈనాడు-అమరావతి: ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించొద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ నుంచి ఆదేశాలు ఉన్నా, వాటిని బేఖాతర్‌ చేస్తూ పల్నాడు జిల్లాలో ఏకంగా 10 మంది ఉపాధ్యాయులను పాఠశాలల్లో జరిగే నాడు-నేడు పనుల పర్యవేక్షణకు డిప్యూటేషన్‌పై నియామకం చేయడం విమర్శలకు దారితీసింది. ఒకవైపు జిల్లాలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు మొదలుకుని లాంగ్వేజీలు బోధించే వారి వరకు కొరత ఉందని పర్యవసానంగా ఒక టీచర్‌ వేరే సబ్జెక్టు కూడా బోధిస్తూ పని భారంతో సతమతమవుతుంటే, అందుకు విరుద్ధంగా పిల్లలకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులను బోధనేతర విధులకు తీసుకోవడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల గురజాల మండలంలో పదో తరగతి విద్యార్థులు ఏకంగా తమకు పాఠాలు చెప్పే టీచర్లు లేరని రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఒకవైపు టీచర్ల కొరత ఇంత తీవ్రంగా ఉంటే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే సెకండరీ గ్రేడ్‌ టీచర్లను డిప్యూటేషన్‌పై అవసరమైతే హైస్కూళ్లకు పంపి బోధనకు ఆటంకం లేకుండా చూడాల్సింది పోయి నాడు-నేడు పనుల పర్యవేక్షణకు ఉపాధ్యాయులను తీసుకోవడం హేయమని సహచర ఉపాధ్యాయులు ధ్వజమెత్తుతున్నారు. అసలు ఒక ఎమ్మెల్యే లేఖతో అంతమంది ఉపాధ్యాయులను పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటకు తీసుకురావడం ఎలా సాధ్యం? నిజంగా ఆ ఎమ్మెల్యే వారినే సిఫార్సు చేశారా? ఒకరిద్దరిని సిఫార్సు చేస్తే అధికారులు మరికొంతమందిని ఏమైనా డిప్యూటేషన్‌పై వేసుకున్నారా అనేది కూడా విచారణ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రతి మండలంలో స్కూళ్లల్లో జరిగే నాడు-నేడు పనుల పర్యవేక్షణకు సీఆర్‌పీలు, మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు. వారి నుంచి పురోగతి నివేదికలు తీసుకొని పనుల వేగవంతానికి చర్యలు చేపట్టాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు అందుకు విరుద్ధంగా పాఠాలు బోధించే టీచర్లను వేస్తామంటే అందుకు జిల్లా ఉన్నతాధికారులు సైతం అమోదం తెలపడాన్ని సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. ఈ డిప్యూటేషన్లకు ఉన్నతాధికారుల ఆమోదం ఉందని చెప్పి వెంటనే వారిని వారు పని చేసే స్కూళ్ల నుంచి రిలీవ్‌ చేయించి ఆగమేఘాల మీద నరసరావుపేటకు రప్పించారు. వీరు పని చేసే స్కూళ్ల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చేయడంతో వారు బోధించే సబ్జెక్టులు ఎవరు చెబుతారు? అక్కడ పిల్లల పరిస్థితి ఏంటో ఉన్నతాధికారులే ప్రశ్నించుకోవాలి. వీరిలో కొందరు నాడు-నేడు పనులు జరిగే స్కూళ్ల నుంచి ఫొటోలు తెప్పించడం, వెబెక్స్‌ మీటింగ్‌ మినిట్స్‌ రాయడం, వాటి నివేదికలను ఉన్నతాధికారులకు నివేదించడం వంటి పనులు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. వెంటనే ఆ ఉపాధ్యాయులను వెనక్కు పంపాలని సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

బోధనేతర విధులకు తీసుకున్న ఉపాధ్యాయుల వివరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని