logo

లావాదేవీలపై అప్రమత్తత తప్పనిసరి

ఖాతాదారులు మొబైల్‌ బ్యాంకింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని యూనియన్‌ బ్యాంక్‌ డీజీఎం కుందన్‌లాల్‌ అన్నారు.

Published : 30 Nov 2022 04:40 IST

యూనియన్‌ బ్యాంక్‌ డీజీఎం కుందన్‌లాల్‌

జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభిస్తున్న యూనియన్‌ బ్యాంక్‌ డీజీఎం కుందన్‌లాల్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఖాతాదారులు మొబైల్‌ బ్యాంకింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని యూనియన్‌ బ్యాంక్‌ డీజీఎం కుందన్‌లాల్‌ అన్నారు. జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో మంగళవారం ఖాతాదారుల హక్కులు, జాతీయ సమగ్ర అవగాహన, డిజిటల్‌ కరెన్సీ, సైబర్‌ నేరాల నియంత్రణపై లీడ్‌బ్యాంక్‌, చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. సదస్సుకు లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఈదర రాంబాబు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీజీఎం కుందన్‌ లాల్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరాలపై ఖాతాదారులను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. చరవాణికి వచ్చిన సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫోన్‌ ద్వారా ఓటీపీలను బ్యాంకు వారు అడగరని, వాటిని ఎవరికీ తెలియజేయకూడదన్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఛైర్మన్‌ కామేశ్వరరావు మాట్లాడుతూ సైబర్‌ నేరాల నుంచి ఖాతాదారులకు రక్షణ కల్పించాలన్నారు. బ్యాంకుల్లో సకాలంలో ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలన్నారు. నగదు రహిత చెల్లింపులు పెరిగేకొద్దీ సైబర్‌ నేరగాళ్లు ఖాతాదారులను మోసగిస్తున్నారన్నారు. ఖాతాదారులు లావాదేవీలు జరిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్‌ఎం పాండే మాట్లాడుతూ నగదు రహిత చెల్లింపులు పెరుగుతున్నాయన్నారు. ఖాతాదారులు వీటి నిర్వహణలో కాస్తంత జాగ్రత్తలు పాటిస్తే సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఎల్‌డీఎం ఈదర రాంబాబు మాట్లాడుతూ బ్యాంకుల్లో ఖాతాదారులకు సాంకేతిక సేవలు అందించేందుకు డిజిటల్‌ కరెన్సీ అమల్లోకి వచ్చిందన్నారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌, డిజిటల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లో సైబర్‌ నేరాలను అరికట్టడానికి ఖాతాదారుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో ఇండియన్‌ బ్యాంక్‌ జిల్లా సమన్వయకర్త జగదీశ్వరరావు, సీజీజీబీ జిల్లా సమన్వయకర్త సతీష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని