logo

చిలకలూరిపేటలో.. మరో సంకల్ప సిద్ధి

ప్రజల ఆశను ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి నమ్మిస్తున్నారు.

Published : 02 Dec 2022 06:25 IST

రూ.కోట్లలో వసూలు చేసి బోర్డు తిప్పేసిన వైనం
కీలక సూత్రధారులు వైకాపా ప్రజాప్రతినిధి, మరో ఇద్దరు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : ప్రజల ఆశను ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి నమ్మిస్తున్నారు. అధిక వడ్డీ పేరుతో ప్రజల నుంచి నగదు వసూలు చేసి తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ‘సంకల్పసిద్ధి’ గొలుసు కట్టు సంస్థ అక్రమాలపై అధికారులు దాడులు చేశారు. ఈ తరహాలోనే చిలకలూరిపేట మండలంలోని కట్టుబడివారిపాలెంలో వసూళ్లు చేశారు. గ్రామంలో ఏడాది క్రితం ఒక మాజీ ప్రజాప్రతినిధి పెద్ద ఇల్లు కట్టుకోవడం, భూములు కొనడం గ్రామస్థులు చూశారు. తమతో పాటే సాధారణంగా ఉండే అతన్ని చూసి అంత ఎలా సంపాదించాడంటూ ఊరంతా చర్చ జరిగింది. దీంతో అతను చెప్పిన మాట విన్నవారంతా ఆశ్చర్యపోయారు. కారణం రూ.లక్ష చెల్లిస్తే ప్రతి నెలా రూ.20 వేల చొప్పున 12 నెలల పాటు మొత్తం రూ.2.40 లక్షలు వచ్చాయని చెప్పాడు. ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ సంపాదించానని, ప్రస్తుత వైకాపా ప్రజాప్రతినిధితో కలసి గ్రామస్థులను నమ్మించాడు. మీరు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చని ఇద్దరూ నమ్మబలికారు. ఇదంతా నిజమే అనుకున్న చాలామంది గ్రామస్థులు పొలం, బంగారం తనఖా పెట్టి రూ.2 వడ్డీకి అందినకాడికి డబ్బులు తెచ్చుకుని సదరు వైకాపా ప్రజాప్రతినిధి చెప్పిన ఖాతాలో జమ చేశారు. విషయం ఊరంతా తెలియడంతో ఆశతో చాలామంది సదరు ప్రజాప్రతినిధికి నగదు అందజేశారు. గ్రామస్థులతో ముందుగానే ఖాళీ నోట్లు కూడా తీసుకున్న సదరు ప్రజాప్రతినిధి ప్రస్తుతం డబ్బులు ఇవ్వక పోవడంతో గ్రామస్థులు లబోదిబోమంటున్నారు.

బాధితులకు బెదిరింపులు

గ్రామంలో వైకాపా ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఇలాంటి వసూళ్లకు పాల్పడ్డారు. మొత్తం మీద గ్రామంలో రూ.10 కోట్లకుపైనే వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు ప్రజాప్రతినిధి ఈ సొమ్ముతో ఆస్తులు కూడా కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీసులు దృష్టి పెడితే మొత్తం బండారం బయటకు వస్తుందని గ్రామస్థులు అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటూ సదరు వైకాపా ప్రజాప్రతినిధి హెచ్చరిస్తుండటంతో గ్రామస్థులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. సదరు గ్రామ వైకాపా ప్రజాప్రతినిధికి పెద్దల అండదండలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతోనే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు