logo

సూక్ష్మ సేద్యానికి ఏదీ మోక్షం?

సమపాళ్లలో నీరు, పోషకాలు అందించి తద్వారా నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చేపట్టి సుస్థిర వ్యవసాయానికి సూక్ష్మసేద్య పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

Updated : 02 Dec 2022 07:50 IST

నత్తనడకన బిందు, తుంపర పరికరాల  అమరిక

ఈనాడు, నరసరావుపేట, బాపట్ల: సమపాళ్లలో నీరు, పోషకాలు అందించి తద్వారా నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చేపట్టి సుస్థిర వ్యవసాయానికి సూక్ష్మసేద్య పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 15 నుంచి 40 శాతం ఎరువులు, 20 నుంచి 30 శాతం రసాయనాలు, 10 నుంచి 15 శాతం శ్రమ, 20 నుంచి 25 శాతం యాంత్రిక శక్తి ఖర్చులు తగ్గుతాయి. ఇంతటి కీలకమైన సూక్ష్మసేద్య పరికరాలు సాగుదారులకు అందడంలో జాప్యం జరుగుతోంది. రెండేళ్లుగా రాయితీపై సరఫరా చేయని ప్రభుత్వం ప్రస్తుత ఏడాది ఆగస్టు నుంచి రాయితీని అమలు చేస్తోంది. అయితే కంపెనీలు ఆసక్తి చూపకపోవడం, క్షేత్రస్థాయిలో సిబ్బంది తగినంత మంది లేకపోవడం పథకం అమలుకు అడ్డంకిగా మారింది. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సూక్ష్మ సేద్యపరికరాలు అమరిక జరగడం లేదు.


ఆసక్తి చూపని కంపెనీలు

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సుమారు 13 కంపెనీలు సూక్ష్మసేద్య పరికరాలు అమర్చడానికి ఒప్పందం చేసుకున్నాయి. అయితే గతంలో భారీస్థాయిలో పరికరాలు సరఫరా చేసిన పెద్ద కంపెనీలు కొన్ని ఈసారి        ప్రభుత్వంతో ఒప్పందానికి ముందుకు రాలేదు. ఒప్పందం చేసుకున్న కంపెనీలు కూడా పరికరాలు అమర్చడంలో ఆసక్తి చూపడం లేదు. రైతుల వాటాగా 10 శాతం సొమ్ము చెల్లిస్తే ప్రభుత్వం 90శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంది. తుంపర సేద్య పరికరాలకు రైతువాటా 45 శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంది. బిల్లులు త్వరగా రాకపోవడంతో వారు ఆచితూచి పరికరాలు సరఫరా చేస్తున్నారు. దీనికితోడు కంపెనీలకు చెల్లించే మొత్తం జీఎస్‌టీ 2 శాతం, ఆదాయపు పన్ను 2 శాతం కలిపి మొత్తం 4 శాతం సొమ్మును మినహాయించుకుని చెల్లింపులు చేస్తున్నారు. ముందస్తుగా పన్నులు మినహాయించుకోవడం ఈ ఏడాది నుంచి మొదలైంది. కంపెనీలు మండలాల వారీగా సిబ్బందిని ఏర్పాటుచేసుకుని రైతు దరఖాస్తు చేసిన వెంటనే సర్వే చేసి నివేదిక ఇచ్చి రోజుల వ్యవధిలోనే పరికరాలు అమర్చేవారు. ఇప్పుడు కంపెనీలు చొరవగా రైతులకు పరికరాలు సరఫరాకు ముందుకురావడం లేదు. ఆయా కంపెనీలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు కలిపి ఒకే సమన్వయకర్తను నియమించుకుని నడిపిస్తున్నాయి. దీంతో వారు సకాలంలో సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. రెండు నుంచి నాలుగు కంపెనీలు మాత్రమే ఆసక్తిగా సరఫరా చేస్తున్నాయి. ఇది పథకం అమలుకు అడ్డంకిగా మారింది. దీనికితోడు ఎక్కువ మంది కౌలుదారులు సాగు చేస్తుండటంతో సూక్ష్మసేద్య పరికరాలు అమర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.


లక్ష్యం సాధ్యమేనా?

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇచ్చిన లక్ష్యాల్లో 50 శాతం సాధించడం కూడా గగనమేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రైతులు అంతగా ఆసక్తి చూపకపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు. ఆగస్టు నెలాఖరులో పథకం మార్గదర్శకాలు రావడంతో అమలులో కొంత జాప్యం జరిగిందని, గతంలో పథకం అమలుతీరును ఆధారంగా చేసుకుని లక్ష్యాలు నిర్దేశించడంతో చేరుకోవడం కష్టమేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు సమయం ఉన్నందున కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మూడు జిల్లాల ఏపీఎంఐపీ పథక సంచాలకుడు తెలిపారు. సూక్ష్మసేద్య పరికరాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నందున రైతులు కూడా ముందుకురావాలని వారు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని