logo

Nadikudi Junction: దయచేసి వినండి.. నడికూడిలో రైళ్లు ఆగవండి

రాష్ట్రానికి సరిహద్దులోనున్న నడికూడి కీలకమైన రైల్వే జంక్షన్‌. విద్య, ఉపాధి, వ్యాపార అవసరాల నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.

Updated : 06 Dec 2022 10:25 IST

గురజాల, న్యూస్‌టుడే

రాష్ట్రానికి సరిహద్దులోనున్న నడికూడి కీలకమైన రైల్వే జంక్షన్‌. విద్య, ఉపాధి, వ్యాపార అవసరాల నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రైల్వే కూడలిగానున్న నడికూడిలో ప్రధానమైన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరి రైళ్లు నిలుపుదల చేయాలని ఏడాది కాలంగా ప్రజలు వినతులు చేసినా ప్రజాప్రతినిధులు చొరవచూపడం లేదు. రైల్వే ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

విశాఖ, చెన్నై, నారాయణాద్రి, నరసాపూర్‌, డెల్టా వంటి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడికూడి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి, గురజాల, రెంటచింతల, మాచర్ల, దుర్గి, కారంపూడి, మాచవరం, పిడుగురాళ్ల మండలాలకు చెందిన ప్రయాణికులతో సరిహద్దులోనున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రయాణిస్తుంటారు. గురజాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని రెండు నియోజకవర్గాల ప్రజలు 4 లక్షల మంది ఇక్కడ నుంచే రాకపోకలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రైళ్లన్ని  నడికూడి నుంచి వెళ్లే సమయంలో మాత్రం ఆగుతున్నాయి. అయితే తిరిగి వచ్చే సమయంలో మాత్రం ఒక్కటీ ఆగడం లేదు. కరోనాకు ముందు రైళ్లు నడికూడిలో నిలుపుదల చేశారు. కరోనా అనంతరం అన్ని రైళ్లను పునరుద్ధరించినా నడికూడి జంక్షన్‌ మీదుగా వెళ్లే ప్రధానమైన రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. గుంటూరు, మిర్యాలగూడ(150 కి.మి.) మధ్య ఒక్కస్టాప్‌ కూడా లేకపోవడంతో ప్రయాణికులకు ఈ రైళ్లు ఏమాత్రం ఉపయోగం పడటం లేదు. దూర ప్రాంతాల నుంచి నడికూడికి చేరుకొని అక్కడ నుంచి స్వస్ధలాలకు వెళ్లే సౌకర్యం పూర్తిగా ఆగిపోయింది. గుంటూరులో దిగి 100 నుంచి 150 కి.మి.దూరం బస్సుల్లో, కార్లలో ప్రయాణం చేసి గమ్యస్థానాలను చేరుకోవాల్సి వస్తుంది.

అదనపు ఖర్చులు.. సమయం వృథా

గతంలో నడికూడిలో దిగి 20 నుంచి 30 కి.మి.పరిధిలో ఇళ్లకు చేరుకోవడం ప్రయాణికులకు సులభంగా ఉండేది. ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండేది. రైళ్లన్నీ తిరిగి వచ్చే సమయం అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల నుంచి 4 గంటల నడుమ ఉంటుంది. గుంటూరులో దిగి 100 నుంచి 150 కి.మి. దూరం ప్రయాణించాల్సి వస్తుంది. రైలు వెళ్లే మార్గానికి సమాంతరంగా వాహనాలలో చేరాల్సి వస్తుంది. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదరకంగా మారుతున్న వేళ తెల్లవారే వరకు గుంటూరు రైల్వేస్టేషన్‌లో పడిగాపులు కాయాల్సి వస్తుంది. అద్దె కార్లు వినియోగించే వారు రూ.వేలు చెల్లించాల్సి వస్తుంది. నడికూడిలో దిగే ప్రతి ప్రయాణికుడు గుంటూరులో ఆగిపోవడం వల్ల కార్లను ఆశ్రయించాల్సి వస్తే రూ.3వేల వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎంతో సమయం కూడా వృథా అవుతోంది. బస్సుల్లో చేరుకునేవారు తెల్లవారే వరకు గుంటూరు బస్టాండ్‌లో వేచి ఉండి రూ.150 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. తిరుపతిలో స్వామివారిని దర్శించుకొని నారాయణాద్రిలో వచ్చే వారు గుంటూరులో దిగి రావడం కష్టంగా మారుతోంది. తడలో శ్రీ సిటీలో పనిచేసే మహిళలకు నారాయణాద్రి, చెన్నై రైళ్లు ఎంతో ఉపయోగంగా ఉండేవి. గుంటూరులో దిగి పల్నాడుకు రావాలంటే ఎంతో ఖర్చు, సమయం వృథా అవుతోంది.

రైల్వేశాఖ తీరుతో ప్రయాణికులకు అర్ధరాత్రి అగచాట్లు

నడికూడిలో రైళ్లు ఆగితే ప్రతి రోజు దిగే ప్రయాణికులు : 500 మంది వరకు
సమయం వృథా : 5 నుంచి 8 గంటల వరకు
బాడుగ కారు అయితే అదనపు ఖర్చు : గుంటూరు నుంచి రూ. 3వేలు
సొంత కారు అయితే : డీజిల్‌ కోసం: రూ.1500  
బస్సు ఛార్జీ : రూ.150

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు