logo

హార్బరు పనుల్లో కదలిక

నిజాంపట్నం హార్బరు దశాబ్దాల క్రితం నిర్మించింది కావడంతో ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు.

Published : 07 Dec 2022 04:21 IST

విస్తరణ ఏప్రిల్‌ నాటికి పూర్తవుతుందంటున్న అధికారులు

నిజాంపట్నం, న్యూస్‌టుడే

ముమ్మరంగా జరుగుతున్న మొగ పనులు

నిజాంపట్నం హార్బరు దశాబ్దాల క్రితం నిర్మించింది కావడంతో ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. బోట్లు సంఖ్య పెరిగినా నిలుపుకొనేందుకు తగిన వసతి లేక మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా రూ.వందల కోట్ల మత్స్య సంపద ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఎగుమతులు పెరగని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో హార్బరును విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే నిధులు మంజూరైనా గాని పనులు చేయడంలో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు రెండోదశ అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. ప్రధానంగా మొగ సామర్థ్యం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే సముద్రపు పోటు, పాటుతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా మత్స్యకారుల బోట్లు సులువుగా సముద్రంలోకి వెళ్లి, వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. మిగిలిన పనులకు రూ.251 కోట్లు మంజూరు చేసింది. ఇది పూర్తయితే సుమారు వెయ్యి బోట్లు నిలుపుదల చేసేందుకు అనువుగా ఉంటుంది.

సిద్ధం చేసిన సిమెంటు రాళ్లు  

వంద ఎకరాలకు ప్రతిపాదన: గతంలో నిజాంపట్నం హార్బర్‌ రెండో దశ అభివృద్ధికి గతంలో హార్బర్‌కు అనుకొని ఉన్న ఐదు ఎకరాలను ప్రతిపాదించారు. దీనికి అనుమతులు వచ్చాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రస్తుతం మరో సుమారు వంద ఎకరాల వరకు ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన దస్త్రాలు పరిశీలనలో ఉన్నాయి. వాటి అనుమతులు వచ్చేలోపు జెట్టి నిర్మాణాలు పూర్తిచేయాలనే సంకల్పంతో అధికారులున్నారు. నిజాంపట్నం హార్బర్‌ రెండో దశ అభివృద్ధికి ప్రభుత్వం రూ.451 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులను 2020 నవంబరు 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వర్చూవల్‌ పద్ధతిలో పనులను ప్రారంభించారు. 2021, అక్టోబరు 5న హార్బర్‌ అభివృద్ధి పనుల్లో భాగంగా డ్రెడ్జింగ్‌ పనులకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు భూమిపూజ చేశారు. అప్పటి నుంచి సముద్ర ముఖ ద్వారం నుంచి మురుగు కాల్వ పూడికతీత పనులు చేపట్టారు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి.  

చేయాల్సిన  పనులివే..

అభివృద్ధి పనుల్లో భాగంగా సముద్ర ముఖద్వారం నుంచి కిలోమీటరుపైన కొండరాళ్లు అడ్డుపెట్టాలి.

ప్రస్తుతం 500 మీటర్ల మేర జెట్టి ఉంది. దీన్ని నిజాంపట్నంవైపు 500 మీటర్లు, లైట్‌హౌస్‌ పక్కన మరో 500 మీటర్లు జెట్టి నిర్మాణం చేపట్టాలి.

పరిపాలనా భవనం నిర్మాణం చేపట్టాలి. శీతల గిడ్డంగులు నిర్మించాలి. వలలు అల్లుకునేందుకు మత్స్యకారులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మాణాలు చేయాలి.

మౌలిక వసతుల కల్పనలో భాగంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పరచాలి. తాగునీటి వసతి సమకూర్చాలి. అవసరాలకనుగుణంగా విద్యుత్తు సౌకర్యాన్ని సమకూర్చాలి. మత్స్యకారులు సముద్రంలో వేటాడి తెచ్చిన మత్స్యసంపదలకు వేలం పాట నిర్వహించేందుకు తగిన వసతులు కల్పించాలి.

వచ్చే మే నెలలో  ప్రారంభిస్తాం

హార్బర్‌ అభివృద్ధిలో ప్రధాన పనులైన మొగ సామర్థ్యం పనులు వేగంగా జరుగుతున్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే ఆక్రమణలు తొలగించాం. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి మిగిలిన పనులు పూర్తిచేయాలని సంబంధిత గుత్తేదారులకు సూచించాం. అందుకనుగుణంగా వారు పనులు చేస్తున్నారు. మే నెలలో ప్రారంభించాలనే యోచనలో ఉన్నాం.

సురేష్‌, మత్స్యశాఖ జేడీ, బాపట్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని