logo

కర్షకుల్లో కలవరం!

తుపాను హెచ్చరికలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వరి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Published : 07 Dec 2022 04:21 IST

వర్షాల సమాచారంతో జోరుగా కోతలు

ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు

ఈనాడు, నరసరావుపేట, బాపట్ల

తుపాను హెచ్చరికలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వరి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట కోతలను హడావుడిగా చేపట్టి ధాన్యాన్ని విక్రయించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా ఊపందుకోకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్మేసుకుంటున్నారు. ఆలస్యం చేస్తే పంట పొలంలోనే పాడైపోతుందనే భావనతో ముందస్తు కోతలు చేపడుతున్నారు. యంత్రాలతో కోత కోసిన ధాన్యంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఆరబెట్టి తీసుకురావాలని రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) సిబ్బంది రైతులకు సూచిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టడానికి స్థలం, సమయం లేకపోవడంతో రైతులు పొలాల్లోనే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. బీపీటీకి మద్దతు ధరకు కొంత తక్కువ సొమ్ము లభిస్తున్నా సాధారణ రకాలకు బస్తాకు రూ.250 వరకు రైతులు నష్టపోతున్నారు.

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 1.96 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. ప్రస్తుతం కోతల సీజన్‌ మొదలైంది. రైతులు పండించే పంటను మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గుంటూరు జిల్లాలో వారం రోజుల కిందట ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది. బాపట్లలో మంగళవారం ప్రారంభం కాగా, పల్నాడులో ఇంకా ప్రారంభించలేదు. ప్రభుత్వం నిర్దేశించిన శాతం కంటే ధాన్యంలో ఎక్కువ తేమశాతం ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు ఇందుకు ఓ కారణమైతే గతేడాది ఎదురైన అనుభవాలు మరో కారణంగా రైతులు చెబుతున్నారు. డెల్టా ప్రాంతంలో రెండో పంట మొక్కజొన్న సాగు వెంటనే చేపట్టాల్సి ఉన్నందున పెట్టుబడుల కోసం ఎక్కువ మంది రైతులు ప్రైవేటుకు విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈనెల 9, 10 తేదీల్లో తీరప్రాంతంలో వర్షాలు పడే అవకాశముందన్న సమాచారంతో కర్షకులు కలవరపడుతున్నారు. ఇప్పుడు తుపాను బారినపడితే రైతులు తీవ్రంగా నష్టపోయి పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి వస్తుంది. కోతల సమయానికి మరికొద్ది రోజులు గడువు ఉన్నా హడావుడిగా చేపడుతున్నారు.

రైతుకు దక్కని మద్దతు : 75 కిలోల బస్తా ధాన్యానికి ప్రభుత్వం గ్రేడు-ఏ రకానికి రూ.1545, సాధారణ రకానికి రూ.1530 మద్దతు ధర ప్రకటించింది. బహిరంగ మార్కెట్‌లో బీపీటీ 75 కిలోల బస్తా రూ.1330 నుంచి రూ.1380 వరకు కొనుగోలు చేస్తున్నారు. 22 నుంచి 26 శాతం వరకు తేమ ఉన్నప్పటికీ వ్యాపారులు కొంటున్నారు. తరుగు రూపంలో 6 కిలోలు తగ్గినా ఆమేరకు కిలోకు రూ.20 చొప్పున ఆరు కిలోలకు రూ.120 వచ్చినట్టేనని భావిస్తున్న రైతులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈలెక్కన సగటున బస్తా రూ.1350లకు విక్రయిస్తే తేమరూపంలో కలిసొచ్చే రూ.120 కలిపితే బస్తాకు రూ.1470 వరకు ధర వచ్చినట్లు లెక్కకడుతున్నారు. మద్దతు ధరతో పోల్చితే బస్తాకు రూ.75 తగ్గినా రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. అదే సాధారణ రకాలు 75 కిలోల బస్తా రూ.1160 ధరకు కొనుగోలు చేస్తున్నారు. తేమ రూపంలో మరో రూ.120 కలిసినా బస్తాకు రూ.250 వరకు నష్టపోతున్నారు. సాధారణ రకాల రైతులకు మద్దతు ధరతో పోల్చితే భారీనష్టం వాటిల్లుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.


వానొస్తే తీరని నష్టం

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం వల్ల గురువారం నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు వణికిపోతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో వరి కోతలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లాల్లో ముమ్మరంగా కోతలు సాగుతుండగా బాపట్లలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభిస్తున్నారు. ఈనేపథ్యంలో వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాయుగుండం తీవ్రతతో గాలులు వీస్తే వరి పంట నేలకొరిగా నష్టం వాటిల్లుతుంది. గాలికి నేలవాలిన వరిపై ఒక మోస్తరు వర్షం పడినా ధాన్యం నాణ్యత దెబ్బతిని మొలకెత్తే ప్రమాదం ఉందని కర్షకులు వాపోతున్నారు. గతేడాది కూడా కోతల సమయంలో వచ్చిన నివర్‌ తుపాను తీవ్రనష్టం కలగజేసింది. ఈఏడాది వరి దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉండటంతో రైతులు పెట్టుబడులతోపాటు కొంత   మిగులు ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం వస్తే కోలుకోలేని దెబ్బపడుతుందని ఆందోళన చెందుతున్నారు. వర్షం వల్ల ఆరబెట్టిన ధాన్యంతోపాటు కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటకు నష్టం జరుగుతుంది. వరి పంట నేలవాలితే కోతకు యంత్రాలకు వెచ్చించే ఖర్చు పెరుగుతుంది.


ఆరబెట్టుకునే వెసులుబాటు లేక..

రైతులు యంత్రాలతో కోత కోసిన తర్వాత నాలుగు నుంచి ఐదు రోజులు ఆరబెట్టుకుని తీసుకు వస్తేనే తేమశాతం 17 ఉంటోంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో వారం రోజుల తర్వాత కోత కోయాల్సిన పంటను పొలంలో తడి ఉన్న వెంటనే కోత కోస్తున్నారు. దీంతో 28 నుంచి 30 శాతం తేమ ఉంటోంది. వాతావరణం చల్లగా ఉండటంతో ఆరబెట్టడానికి ఐదు రోజుల సమయం పడుతోంది. దీంతో ప్రైవేటు వ్యాపారులు తేమశాతంతో సంబంధం లేకుండా పొలాల వద్దే తూకం వేసి తీసుకెళ్తున్నారు. వారం రోజుల్లో నగదు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం పెట్టిన షరతులు మేరకు ధాన్యం తీసుకెళ్లాలంటే ఆరబెట్టడానికి సొమ్ము వెచ్చించడంతోపాటు స్థలం లేనందున అమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని