logo

లక్ష్యాన్ని మించి వసూళ్లు

లక్ష్మీపురానికి చెందిన అశోక్‌ జాతీయ రహదారిపై పరిమితికి మించి వేగంగా కారు నడిపారు.

Published : 07 Dec 2022 04:21 IST

తనిఖీలతో రవాణా శాఖకు రాబడి

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే

తనిఖీ చేస్తున్న రవాణా శాఖ అధికారులు

లక్ష్మీపురానికి చెందిన అశోక్‌ జాతీయ రహదారిపై పరిమితికి మించి వేగంగా కారు నడిపారు. అతి వేగంగా ప్రయాణించినందుకు రూ.1000 అపరధారుసుం చెల్లించాలని నేరుగా ఇంటికి పోస్టులో రవాణా శాఖ నుంచి ఉత్తరం వచ్చింది. దీనిని చూసి ఆయన నివ్వెరపోయారు. అంత వేగంగా ఎప్పుడు కారు నడిపానా.. అని ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. సరేలెమ్మని అపరాధరుసుం చెల్లించారు.

శ్యామలనగర్‌కు చెందిన దుర్గారావు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేసినందుకు రూ.1500 జరిమానా విధించారు. అపరాధరుసుం చెల్లించేందుకు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లారు. జరిమానా చెల్లించాక అసలు విషయం ఆయనకు బోధపడింది. రెండోసారి కూడా ఈ విధంగా చేస్తే రూ.10,000 అపరాధరుసుం చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ సిబ్బంది తెలియజేయడంతో అవాక్కయ్యారు. ఎందుకు వచ్చింది లెమ్మని అప్పటి నుంచి సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేయడం స్వస్తి పలికారు.

రాజేంద్రనగర్‌కు చెందిన ప్రవీణ్‌ కారు కొనుగోలు చేసి ప్యాన్సీ నెంబర్‌ కోసం ఎదురు చూసే క్రమంలో పనుల హడావుడిలో పడి రిజిస్ట్రేషన్‌ చేయించడం మరచిపోయారు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయడంతో వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేయించని విషయం గుర్తుకు వచ్చింది. ఫలితంగా రూ.2000 అపరాధరుసుం చెల్లించాల్సి వచ్చింది.

సీతమ్మ కాలనీకి చెందిన కోటయ్య ట్రాక్టర్‌లో పరిమితికి మించి ఇసుక తరలిస్తూ రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. పరిమితికి మించి సరకు ఓవర్‌లోడింగ్‌ చేసినందుకు టన్నుకు రూ.2000 అదనంగా చెల్లించారు. ఇలా.. రహదారి భద్రత నియమ, నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడపడం వల్ల అపరాధరుసుం చెల్లిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు.

నిబంధనలు పాటించడం ఉత్తమం...

రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తుండటంతో ఆ శాఖ లక్ష్యానికి మించి వసూళ్లు రాబడుతుంది. వరుసగా రెండు నెలలు 100 శాతం పైగానే రవాణా శాఖ లక్ష్యం సాధించింది. ముచ్చట పడి కొనుగోలు చేసిన వాహనాన్ని వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. తనిఖీల్లో పట్టుబడితే చేతి చమురు వదిలించుకోవాల్సిందే. లైసెన్స్‌ లేకుండా, సీటుబెల్టు, శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడిపినా జేబులు గుల్లే. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడపడం అధిక శాతం మంది చేస్తుంటారు. అలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగితే రెప్పపాటు కాలంలో ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. మద్యం తాగి వాహనాలు నడిపే కుర్రకారు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌కు ఇక కొదవే లేదు. పవర్‌బైక్‌లను వంకర్లు తిప్పుతూ స్నేక్‌ డ్రైవింగ్‌ అంటూ ఎదుటి వారిని బెంబేలెత్తిస్తున్నారు. ముఖ్యంగా మనం నడిపే వాహనానికి బీమా చేయాలి. వాహనం పాతబడే కొలదీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవన్నీ పక్కాగా పాటిస్తే రవాణా, పోలీస్‌ శాఖ అధికారులు నమోదు చేసే కేసుల నుంచి తప్పించుకోవచ్చు. అంతేగాదు వందలు, వేల రూపాయల్లో జరిమానాలు చెల్లించే అవసరం కూడా ఉండదు. కరోనా తర్వాత రోడ్లపై రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఎవరికి వారు సొంతంగా వాహనాలను సమకూర్చుకుంటున్నారు. నిబంధనలు మాత్రం అధిక శాతం మంది పాటించడం లేదు. పక్కాగా నిబంధనలు పాటించే వారు 40 శాతం కూడా ఉండరని రవాణా శాఖ అంచనా.

రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన

రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందులో భాగంగా వాహనదారులకు తరచూ అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు భద్రత నియమ, నిబంధనలపై కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు, అన్ని వాహనాల డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. లైసెన్స్‌ల మేళాలు నిర్వహించి లైసెన్స్‌లు జారీ చేస్తున్నాం. నిబంధనలు పాటించకపోతే మాత్రం తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి అపరాధరుసుం వసూలు చేస్తున్నాం.

షేక్‌ కరీం, గుంటూరు డీటీసీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని