logo

సస్పెండైన మేనేజర్‌ను స్టేషన్‌లో అప్పగించిన ఉద్యోగులు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పత్రాలతో కోట్లలో రుణాలు పొందిన విషయం అందరికీ తెలిసిందే.

Published : 07 Dec 2022 04:21 IST

కలెక్టరేట్‌కు వచ్చిన సస్పెండైన సొసైటీ కార్యదర్శులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో నకిలీ పత్రాలతో కోట్లలో రుణాలు పొందిన విషయం అందరికీ తెలిసిందే. నకిలీ పత్రాలను తీసుకుని రుణాలు ఇచ్చిన ప్రత్తిపాడు బ్రాంచి మేనేజర్‌ రవిని అప్పట్లోనే బ్యాంకు పాలకవర్గం సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన తిరిగి ఉద్యోగం ఇప్పించాలంటూ బ్యాంకుకు రావడం చర్చకు దారి తీసింది. విషయం తెలియడంతో ఆయన హయాంలో బ్రాంచి పరిధిలో పని చేసి సస్పెన్షన్‌కు గురైన సొసైటీ కార్యదర్శులు ఆగమేఘాలపై బ్యాంకు వద్దకు వచ్చారు. అక్రమ రుణాల విషయంపై ఆయన్ని గట్టిగా నిలదీశారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి తీసుకెళ్లి కలెక్టర్‌ వద్ద జరిగిన తంతును వివరించారు. దీనిపై కలెక్టర్‌ ఆయనపై కేసు నమోదైనందున స్టేషన్‌లో అప్పజెప్పాలని సూచించినట్లుగా తెలిసింది. కోట్ల రూపాయల అక్రమ రుణాలు మంజూరు చేసి సస్పెండైన మేనేజర్‌ తిరిగి తనకు ఉద్యోగం ఇవ్వాలని పాలకవర్గాన్ని కోరడం ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులందరిలోనూ చర్చనీయాంశమైంది.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని బ్రాంచుల్లో నకిలీ ధ్రువపత్రాలతో అక్రమంగా రుణాలు పొందిన విషయం అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ప్రత్తిపాడు బ్రాంచిలో సుమారుగా రూ.5 కోట్ల వరకు రుణాలు ఇచ్చినట్లు బయటకు వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని బ్రాంచులు, సొసైటీలు ఇదే కోవలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించి, పలువురు సొసైటీ కార్యదర్శులు, బ్రాంచి మేనేజర్లను సస్పెండ్‌ చేశారు. అక్రమ రుణాలు వాస్తవమేనని తెలియడంతో ఆయనపై ప్రత్తిపాడులో కేసు నమోదు చేశారు. తర్వాత ఆయన ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు వదిలేశారు. విచారణలో ఆయనతోపాటు, ఆయా బ్రాంచి పరిధిలోని సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శుల ఆస్తులను సహకార శాఖ అటాచ్‌ చేసింది. ప్రస్తుతం రవి బ్యాంకుకు వచ్చి ఉద్యోగం ఇప్పించాలని కోరడంతో వారంతా కూడా ఆయన్ని పోలీస్టేషన్‌లో అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. తొలుత పాలకవర్గాన్ని ఆశ్రయించిన సస్పెండైన ఉద్యోగులు, సొసైటీల అధ్యక్షులు ఆ తర్వాత సహకార శాఖ అధికారిని, జిల్లా కలెక్టర్‌ను కలిసి విషయం వివరించారు. ప్రత్తిపాడు స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదు కావడంతో మేనేజర్‌ రవిని స్టేషన్‌లో అప్పజెప్పినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని