logo

అండగా ఉంటా.. అదుకుంటా..

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నూరులో ఆటోనగర్‌ ఏర్పాటుకు తగు చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

Updated : 10 Dec 2022 04:06 IST

ఘనంగా ముస్లింమైనార్టీ ఆత్మీయ సమావేశం

మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు. వేదికపై షరీఫ్‌, నరేంద్ర, కొమ్మాలపాటి,

శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌ అహ్మద్‌, మైనార్టీ నాయకులు

పొన్నూరు, న్యూస్‌టుడే: తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నూరులో ఆటోనగర్‌ ఏర్పాటుకు తగు చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం పొన్నూరు పట్టణం జీబీసీ రోడ్డులోని పరందయ్య కల్యాణమండపంలో ‘ముస్లిం మైనార్టీల ఆత్మీయ’ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల ఉపాధిని దెబ్బతీసిన ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. శాసన మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ తెదేపా అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహనరెడ్డి ముస్లింలను చేసింది ఏమి లేదన్నారు. ఈ వర్గాన్ని ప్రభుత్వం పూర్తిగా మోసగించిందన్నారు. విదేశీ విద్య వల్ల అనేక మంది పేద వర్గాలకు చెందిన యువత ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థానంలో నిలబడ్డారని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్య పథకానికి పైసా కేటాయించలేదని విమర్శించారు. అనంతరం ముస్లిం సోదరులతో చంద్రబాబు మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

అజ్మీర్‌ చాదర్‌ను చంద్రబాబు నుంచి తీసుకుంటూ..

తెదేపాలో పలువురి చేరిక.. పెదకాకాని మండలం వైసీపీ మైనార్టీసెల్‌ అధ్యక్షుడు షేక్‌ ఆలావుద్దీన్‌, పొన్నూరు మండలం జూపుడి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సజ్జా కృష్ణబాబు తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. 

పొన్నూరు మసీదులు వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్నాయి. ఆ మసీదు చుట్టుపక్కల ఉన్న మూడున్నర ఎకరాల వరకు ఆ బోర్డు పరిధిలోకి తీసుకువెళ్లారు. సొంత స్థల యజమానులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

చంద్రబాబు : తాము అధికారంలోకి రాగానే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూస్తాం.

పొన్నూరు పరిసర ప్రాంతాల్లో మసీదులకు సరైన డాక్యుమెంట్లు లేక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తారా? 

షేక్‌ నిజాముద్దీన్‌

చంద్రబాబు : మా ప్రభుత్వం రాగానే మసీదులకు కావాల్సిన డాక్యుమెంట్లు కల్పించేలా తగు చర్యలు తీసుకుంటాం.

ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి స్వర్ణవృత్తికారులు రావడంతో స్థానికంగా ఉన్న తమకు ఉపాధి లేకుండా పోయిందని తమను ఆదుకోవాలి

షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌

చంద్రబాబు : తెదేపా అధికారంలోకి రాగానే స్వర్ణవృత్తికారులకు ఉపాధి కల్పించేలా తగు చర్యలు చేపడతాం.

వక్ఫ్‌బోర్డు ఆస్తులను కబ్జా చేస్తున్నారు.ఆస్తులను పరిరక్షించడం లేదు. దీంతో ఆస్తులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది

షేక్‌ హుస్సేన్‌

చంద్రబాబు : వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి వాటిని రక్షించేలా తగు చర్యలు తీసుకుంటాం.

మూడేళ్లుగా దుల్హన్‌ పథకం అమలు చేయడం లేదు. ఇటీవల ఆ పథకాన్ని అమలు చేయడానికి ఉన్న నిబంధనల కారణంగా అనేక మంది అర్హత కోల్పోతున్నారు. కళ్యాణ మిత్రలకు 18 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు.

షేక్‌ మస్తాన్‌బీ.

చంద్రబాబు : మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలు సడలించి అర్హులైన ప్రతి ముస్లిం కుటుంబానికి దుల్హన్‌ పథకం అందేలా చూస్తాం.

‘వస్తున్నా-మీ కోసం’ చంద్రబాబు పాదయాత్ర, ‘ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా పర్యటనలో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ, వైసీపీ గుండాల ప్రయత్నాలను తిప్పికొడుతూ ఈ యాత్రను విజయవంతం చేయడంలో చంద్రదండు ప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో కీలక పాత్ర పోషించింది.

పొన్నూరులో చంద్రదండు దళ సభ్యులకు సూచనలు చేస్తున్న ప్రకాష్‌నాయుడు


ముగిసిన చంద్రబాబు పర్యటన..

‘ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తేదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పర్యటన నియోజకవర్గ పరిధిలోని చింతలపూడి, మాచవరం అడ్డరోడ్డు, ములుకుదురు గ్రామాల్లో జరిగిన రోడ్‌షో అనంతరం శుక్రవారం ముగిసింది. చింతలపూడిలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.వారు పూల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డిని ఇంటికి పంపేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని