logo

ఆక్రమణల తొలగింపు మాటున రూ.కోట్లు కొల్లగొట్టడానికి కుట్ర

ఆక్రమణల తొలగింపు పేరుతో కోట్లాది రూపాయలు దండుకోవడానికి వైకాపా నాయకులు కుట్ర చేస్తున్నారని తుళ్లూరు మండలం వడ్డమాను చెరువుకట్ట వాసులు ఆరోపించారు.

Published : 20 Jan 2023 04:07 IST

వడ్డమాను వాసుల ఆరోపణ

వడ్డమానులో చెరువు కట్టపై అధికారులు తొలగించిన రేకుల షెడ్డు

గుంటూరు, న్యూస్‌టుడే: ఆక్రమణల తొలగింపు పేరుతో కోట్లాది రూపాయలు దండుకోవడానికి వైకాపా నాయకులు కుట్ర చేస్తున్నారని తుళ్లూరు మండలం వడ్డమాను చెరువుకట్ట వాసులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం చెరువుకట్టపై గృహాలు నిర్మించుకున్న ఆక్రమణదారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి రాజకీయనాయకుల ఒత్తిడితో బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఇళ్లను పంచాయతీ సిబ్బంది తొలగించడం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో కుమ్మక్కై గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయుకులు ఈ కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. గ్రామంలోని 123 సర్వే నెంబరులో చెరువుకట్టపై 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నామని వారు తెలిపారు. 17 ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు భూముల్లో నివాసముంటున్న వారి మధ్య విభేదాలు సృష్టించడానికి కావాలనే కొంతమందికి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. రాజకీయంగా కొందరిని దెబ్బతీయడానికి అధికారుల అండతో ఇళ్లు ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ గ్రావెల్‌ అమ్ముకోవడానికి కొందరు భూములు కొన్నారని, తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో వదిలేసి వెళ్లిపోయారని వెల్లడించారు. మళ్లీ ఇప్పుడు గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు తెచ్చుకొని, రూ.కోట్లు కొల్లగొట్టడానికి వైకాపా నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని చెరువుకట్ట వాసులు విమర్శించారు.

ఇది మా వాళ్ల పనే: వైకాపా నాయకులు

ఈ విషయంలో సొంత పార్టీ నేతల నుంచీ విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ అధికారులు చెరువు కట్టపై రెండు రోజుల తొలగించిన ఇంటిని వైకాపా జిల్లా ప్రచారకమిటీ అధ్యక్షుడు ఆళ్ళ పూర్ణచంద్రరావు గురువారం పరిశీలించి మాట్లాడుతూ ఇది గ్రావెల్‌ అమ్ముకోవడానికి తమ పార్టీ  నేతలు చేస్తున్న కుట్రేనని చెప్పారు. పేదలకు అండగా ఉండాల్సిన నాయకులు వారికి గూడు లేకుండా చేయడం దారుణమన్నారు. చెరువు కట్టపై దగ్గరుండి ఇళ్లు వేయించిన గ్రామంలోని కొంతమంది పార్టీ నాయకులే.. ఇప్పుడు అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి పడగొట్టిస్తున్నారని విమర్శించారు. పార్టీకి చెడ్డపేరు తీసుకు వస్తున్న నాయకులను వైకాపా నుంచి బహిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని