logo

ఇల్లే బృందావనం

ఆకుపచ్చని లోకంలో అందాల హరివిల్లులా ఇల్లు కళకళలాడుతూ ఉండాలని ఎవరు కోరుకోరు. కాంక్రీటు అడవుల్లాంటి అపార్ట్‌మెంట్లలో ఉంటున్నందున చుట్టూ ఎటు చూసినా గుప్పెడు మట్టి కూడా కనిపించదు.

Published : 22 Jan 2023 06:31 IST

అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌నూ అందంగా తీర్చిదిద్దిన మహిళ

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే

గది పక్కన ఖాళీ జాగాలో మొక్కల పెంపకం

ఆకుపచ్చని లోకంలో అందాల హరివిల్లులా ఇల్లు కళకళలాడుతూ ఉండాలని ఎవరు కోరుకోరు. కాంక్రీటు అడవుల్లాంటి అపార్ట్‌మెంట్లలో ఉంటున్నందున చుట్టూ ఎటు చూసినా గుప్పెడు మట్టి కూడా కనిపించదు. మరి ఆకు పచ్చని లోకం ఎలా సాధ్యం అనే సామాన్యుల ప్రశ్నకి ఆర్‌.ధర్మవతి ఓ పరిష్కారం చూపిస్తున్నారు. గుంటూరు బ్రాడీపేట 18వ అడ్డరోడ్డులోని సూర్యోదయ అపార్ట్‌మెంట్లో నివాసం ఉంటారు ధర్మవతీరాము. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రేమ. నగర వాతావరణంలో అపార్ట్‌మెంట్‌లోనే ఉండాల్సి వచ్చింది. కానీ ఆమె నిరుత్సాహ పడలేదు. మొక్కలపై తనకున్న ప్రేమ, పరిజ్ఞానాలను మేళవించి ఇండోర్‌ ప్లాంట్ల పెంపకంపై దృష్టి సారించారు. 1,750 చదరపు అడుగుల పరిధిలో వరండా మొదలు, చుట్టూ బాల్కనీలో లివింగ్‌, డ్రాయింగ్‌ రూంలలో ఎలాంటి మొక్కలు పెడితే అటు పర్యావరణానికి, ఇటు ఆరోగ్యానికి మంచిదో బాగా ఆరా తీసి, సేకరించి చక్కగా అలంకరించారు. అంతూరియం, ఎడినియం, జెడ్‌ జెడ్‌ ప్లాంట్‌, పీస్‌ లిల్లీ, పోతాస్‌, తమలపాకు, ఫెర్న్‌, కాక్టస్‌, ఎరికా పామ్‌, వికీపీడియా, మందార, అలోవెరా, గ్రీన్‌ రోజా, చామంతి, జెడ్‌ ప్లాంట్‌, స్పైడర్‌ ప్లాంట్‌, స్నేక్‌ ప్లాంట్‌, డిఫెన్స్‌ బెకియా, మల్లె, నీటి తామర ఇలా ఓ 150 రకాల మొక్కలు ఆ ఇంటిలోనూ, ఇంటి చూట్టూ కనిపిస్తాయి. అన్నీ రోజూ చిగురిస్తూ.. పూత పూస్తూ.. కాయలు కాస్తుంటాయి. ఆ పచ్చని ఆకులపై నుంచి పైరగాలిలా వీచే చల్లని గాలి కాంక్రీటు జనారణ్యాన్ని కనువిందుగా ఉండే నందనవనంలా మారుస్తుంటే ఆనందం ఆ ఇంటి వారికే కాక పొరుగు వారి సొంతం కూడా అవుతోంది.

పెంచుతున్న మొక్కలతో ధర్మవతి

ఆలోచిస్తే ఆనందం  మన సొంతం

అపార్ట్‌మెంట్లలో ఉంటున్నామని, మొక్కలు పెంచే వీలే లేదని ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదు. దానికి నేనే ఉదాహరణ. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం. అపార్ట్‌మెంటే కొనుక్కోవలిసి వచ్చింది. అందులోనూ మూడో ఫ్లోర్‌లో. మనసుంటే మార్గం లేకపోదని మన వాళ్లంటారు కదా. అది నిజం. నా అభిరుచిని భర్త రాము కూడా ప్రోత్సహించారు. అప్పుడు జాగ్రత్తగా ఎక్కడ ఏ మొక్క అమర్చితే బాగుంటుందని ఆలోచించి కళాత్మకంగా ఉండేలా మధ్యమధ్యలో చక్కటి బొమ్మలను కూడా అమర్చుతూ మొక్కలను తీర్చిదిద్దాను. చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ స్ఫూర్తిని కూడా పొందుతున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా ముందుగా నా కళ్లు కొత్త మొక్కల కోసం వెతుకుతుంటాయి. నేను ఎప్పుడూ మొక్కలు కొనుగోలు చేసే నర్సరీల యజమానులు కూడా ఆశ్చర్యపోతుంటారు. అంత చిన్న జాగాలో ఇన్ని మొక్కలు ఎలా పెడుతుంటారని. అన్నిటికీ సమాధానం ఒక్కటే ఆసక్తి ఉండాలంతే. అప్పుడు మొక్కలన్నీ మన పాపల్లానే నవ్వుతూ చిగురాకుల చేతులూపుతూ కనిపిస్తాయి. అలా ఉన్న ఇల్లు నందనవనమేగా మరి అంటున్నారు ధర్మవతి.


 

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని