logo

బోధనేతర విధులే ముద్దు

సమగ్ర శిక్షలో క్లస్టర్‌ రిసోర్సుపర్సన్లు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది ఇలా ఎంతోమంది ఉన్నారు. వారితో చేయించాల్సిన పనులను ఉపాధ్యాయులతో చేయించాలనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Updated : 22 Jan 2023 06:53 IST

15 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు
సీఎం ఆదేశాలు భేఖాతర్‌.. డీఈవో తీరుపై విమర్శలు
ఈనాడు-నరసరావుపేట

సమగ్ర శిక్షలో క్లస్టర్‌ రిసోర్సుపర్సన్లు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది ఇలా ఎంతోమంది ఉన్నారు. వారితో చేయించాల్సిన పనులను ఉపాధ్యాయులతో చేయించాలనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటప్పయ్య ఆ జిల్లా పరిధిలోని 15 మంది ఉపాధ్యాయులను జేవీకే కిట్లలో ఉండే సామగ్రిని కాంపొనెంట్‌ వారీగా పర్యవేక్షించడానికి డిప్యూటేషన్‌పై డీఈవో కార్యాలయంలో విధులు నిర్వహించడానికి తీసుకోవటం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉపాధ్యాయవర్గం, సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసలు పాఠశాలల్లో ఉండి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబితే అందుకు విరుద్ధంగా డీఈవో స్థాయిలోనే టీచర్లకు బోధనేతర పనులు అప్పగించడం ప్రశ్నార్థకమవుతోంది. ఈ డిప్యూటేషన్లు ప్రస్తుతం జిల్లా ఉపాధ్యాయుల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అసలు ఇప్పటికే చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. దాన్ని నివారించటానికి గతేడాది అక్టోబరులో పదోన్నతులు ఇచ్చి పోస్టింగ్‌లు ఇవ్వని టీచర్లకు ఇటీవల కౌన్సిలింగ్‌ నిర్వహించి సబ్జెక్టు టీచర్లుగా వారిని ఆయా పాఠాలలకు సర్దుబాటు చేశారు. అయినా ఇంకా ఖాళీలు పేరుకుపోవటంతో సెకండరీ గ్రేడ్‌ టీచర్లలో మంచి విద్యార్హతలు కలిగిన సీనియర్లను గుర్తించి వారికి నెలకు రూ.2500 చొప్పున అలవెన్సులు ఇస్తామని వారిని సబ్జెక్టు టీచర్లుగా తీసుకోవడానికి ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు మొత్తానికి కలిపి గుంటూరులోని డీఈవో కార్యాలయంలో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఒకవైపు టీచర్ల కొరత అంటుంటే అదేం పరిగణనలోకి తీసుకోకుండా పల్నాడు డీఈవో ఏరికోరి టీచర్లకు బోధనేతర పనులు అప్పగించడం విమర్శలకు దారితీసింది.

గతంలో 11 తాజాగా 15 మంది..

సీఎం కాదు కదా.. ఎవరు ఏం చెప్పినా.. తమ బాణీ తమదేననేలా విద్యాశాఖ అధికారుల తీరు ఉందనే అభిప్రాయం ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతోంది. గతంలోనే ఒకసారి 11 మంది ఉపాధ్యాయులను కలెక్టర్‌ అనుమతితో డిప్యూటేషన్‌పై నరసరావుపేటలోని డీఈవో కార్యాలయానికి తీసుకోగా దీనిపై ఉన్నతాధికారులు, సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే వారి డిప్యూటేషన్లు రద్దు చేసి పాఠశాలలకు వెనక్కు పంపారు. అది జరిగి నెల రోజులు కూడా కాలేదు. తిరిగి మరోసారి 15 మంది ఉపాధ్యాయులను తీసుకోవడం గమనార్హం. అసలు ఈ డిప్యూటేషన్లకు కమిషనర్‌ అనుమతి లేదు. టీచర్ల డిప్యూటేషన్లకు కచ్చితంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ అనుమతి పొందాలని స్పష్టమైన సర్క్యులర్‌ ఉంది. అది ఏ మాత్రం పట్టించుకోకుండా జిల్లా స్థాయిలోనే డిప్యూటేషన్లు వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం 15 మంది రావటంతో కొన్ని స్కూళ్లలో ఏకోపాధ్యాయులే ఉన్నారని వారికి ఏదైనా అత్యవసరం వచ్చి సెలవు పెడితే ఆ రోజు పాఠశాల మూసివేయాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఉపాధ్యాయవర్గం గుర్తు చేస్తోంది. గతంలో వేసిన 11 మందిలో తాజాగా ఈసారి వేసిన డిప్యూటేషన్లలో కూడా ఆరుగురు ఉన్నారని తెలిసింది. వీరంతా నిత్యం నరసరావుపేట నుంచి ఆయా పాఠశాలలకు రాకపోకలు సాగిస్తున్నారని తెలుస్తోంది. నిత్యం ఆయా ప్రాంతాలకు వెళ్లి రావడం ఇబ్బందికరంగా ఉంటోందని చెప్పి వారే డిప్యూటేషన్లపై తీసుకునేలా లాబీయింగ్‌ చేశారని ప్రచారం లేకపోలేదు.  ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వాడుకోవద్దని ఉత్తర్వులున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా పల్నాడు డీఈవో టీచర్లను బోధనేతర విధులు పర్యవేక్షించేలా డిప్యూటేషన్లు వేయటం సరైన విధానం కాదని ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షుడు బసవ లింగారావు, మక్కెన శ్రీనివాసరావు అన్నారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు