logo

ఎమ్మెల్యే కోనపై అసమ్మతి గళం

బాపట్ల నియోజకవర్గంలోని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సాక్షిగా అధికార వైకాపాలో లుకలుకలు బయటపడ్డాయి.

Published : 24 Jan 2023 04:42 IST

మాజీ మంత్రి గాదె, మాజీ ఎమ్మెల్యే చీరాలతో సమావేశమైన ప్రాంతీయ

సమన్వయకర్తలు భూమన కరుణాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు

బాపట్ల, న్యూస్‌టుడే:  బాపట్ల నియోజకవర్గంలోని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సాక్షిగా అధికార వైకాపాలో లుకలుకలు బయటపడ్డాయి. ప్రాంతీయ సమన్వయకర్తలు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, నియోజకవర్గ పరిశీలకుడు గజ్జల బ్రహ్మారెడ్డి సమక్షంలో అధికార పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలు స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతిపై తమ అసంతృప్తి, ఆగ్రహాన్ని వెళ్లగక్కినట్లు సమాచారం. స్థానిక రైస్‌మిల్లర్ల సంఘం కార్యాలయంలో నియోజకవర్గంలో ఎంపిక చేసిన 120 మంది స్థానిక నేతలను సమన్వయకర్తలు విడివిడిగా కలిసి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యవహారశైలి, పనితీరుపై ఐప్యాక్‌ బృందం సమక్షంలో అభిప్రాయాలు సేకరించారు.

రెడ్డి సామాజికవర్గ నేతల ఆగ్రహం

తొలుత బాపట్ల పట్టణంలోని పటేల్‌నగర్‌కు సమన్వయకర్తలు భూమన, బీదా, పరిశీలకుడు బ్రహ్మారెడ్డి వెళ్లి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డిని ఆయన గృహంలో కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోనాను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మోదుగుల బసవపున్నారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు కళ్లం హరనాథరెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం తెలియజేయటం లేదని, అందరినీ కలుపుకొని వెళ్లకుండా రఘుపతి ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారని సమన్వయకర్తలకు వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కొందరిని చేరదీసి పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని దూరంగా పెట్టారని చెప్పుకొచ్చారు. కోన వ్యవహారశైలితో బాపట్లలో వైకాపా బలహీనపడుతోందని చెప్పినట్లు సమాచారం. తమకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానిస్తున్నా పార్టీ కోసం మిన్నకుండిపోయినట్లు తెలిపారు. బయటపడి రోడ్డుకెక్కితే పార్టీ పరువుపోతుందని, సీఎం జగన్‌ మీద అభిమానంతో అమమానాలన్నింటిని మౌనంగా భరిస్తున్నామని పేర్కొన్నట్లు తెలిసింది. సమన్వయకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి తమను ఎవరినీ పిలవలేదని, పార్టీని భజనపరులతో నింపుతూ వైకాపా కోసం కష్టపడుతున్న నేతలు, కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికారుల పోస్టింగుల్లోనూ ఓ వర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ మిగతావారందరినీ పక్కన పెట్టటం వల్ల వైకాపాకు చెడ్డపేరు వచ్చిందని చెప్పారు.

వాపోయిన నాయకులు  : అనంతరం రైస్‌మిల్లర్ల సంఘం కార్యాలయంలో వైకాపా జిల్లా కన్వీనర్‌ మోపిదేవి వెంకటరమణారావుతో కలిసి పట్టణం, మూడు మండలాల పరిధిలోని పార్టీ నేతలతో సమన్వయకర్తలు సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించారు. ఓ ప్రజాప్రతినిధి తనను ఎమ్మెల్యే కోన, ఆయన వర్గీయులు, అధికారుల ద్వారా అవమానించిన తీరును సమన్వయకర్తలకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ అవమానాలు కొనసాగుతున్నాయని చెప్పి వాపోయారు. ఐప్యాక్‌ సిబ్బందితో కలిసి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అర్హులై ఉండి ఎవరికైనా ఇళ్ల స్థలాలు, నవరత్న పథకాలను ఎమ్మెల్యే ఆపించారా అని పలువురు నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. ఓ నేత మాట్లాడుతూ ఎమ్మెల్యే తనకు కావాల్సిన ఇద్దరు, ముగ్గురికే పెద్ద పీట చేస్తూ మిగతావారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోన సమావేశ హాలు బయటే ఉండిపోయారు.సమావేశానికి వైకాపా పట్టణాధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్‌కు ఆహ్వానం ఉన్నా గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని