logo

నేర వార్తలు

సత్తెనపల్లి మండలం గోరంట్లలో రోజు వ్యవధిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలు కాగా బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Published : 24 Jan 2023 04:42 IST

మద్యం రేపిన కల్లోలం
రోజు వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

సోదరుడు నాగఅభిమన్యుతో నందిని

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: సత్తెనపల్లి మండలం గోరంట్లలో రోజు వ్యవధిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలు కాగా బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి. క్రోసూరు మండలం 88తాళ్లూరుకు చెందిన మాగంటి వెంకట సుబ్బారావు (38), అమరావతికి చెందిన శివలక్ష్మి (33) వారి తొలి వివాహాల్లో జీవిత భాగస్వాములు కన్నుమూశారు. ఆరేళ్ల క్రితం ఇరువురి పెద్దలు సుబ్బారావు-శివలక్ష్మికి సంబంధం కుదిర్చి వివాహం చేశారు. రెండేళ్ల నుంచి సత్తెనపల్లి మండలం గోరంట్లలో నివాసం ఉంటున్నారు. ఆయన పొలం కౌలుకు తీసుకుని పంటల సాగు చేపట్టారు. నష్టాలు రావడంతో భవన నిర్మాణ కూలి పనులకు వెళ్లేవారు. ఈ నేపథ్యంలో మద్యం తాగుతూ  సొమ్ము వృథా చేయసాగారు. ఈ విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఆమెపై శనివారం ఆయన చేయి చేసుకున్నారు. మనస్తాపానికి గురైన శివలక్ష్మి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఆదివారం శవమై కనిపించారు. తమ కుమార్తెను అల్లుడే చంపి ఉంటాడని శివలక్ష్మి తల్లి పెద్దిబోయిన ఆదిలక్ష్మి సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా గ్రామీణ ఎస్సై ఆవుల బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో క్రోసూరు సమీపంలోని విద్యుత్తు కేంద్రం వద్ద వెంకట సుబ్బారావు సోమవారం పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. రోజు వ్యవధిలో దంపతులు విగతజీవులుగా మారడంతో ఇరువురి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారివురికి జన్మించిన నాగఅభిమన్యు (4) శివలక్ష్మికి తొలి వివాహంలో కలిగిన నందిని (15) అనాథలయ్యారని ఆవేదన చెందుతున్నారు. బాలిక కట్టమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, బాలుడు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు.


ఉరేసుకొని వివాహిత బలవన్మరణం

పిల్లలు కలగలేదని అత్తింటి వేధింపులు

రాధ (పాతచిత్రం)

కొల్లూరు: అత్తింటి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొల్లూరులోని యాదవపాలెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కృష్ణాజిల్లా నాగాయలంక మండలం పెదకమ్మవారిపాలేనికి చెందిన డొక్కు రాధ (25)కు కొల్లూరుకు చెందిన కోటేశ్వరరావుతో 2018లో వివాహమైంది. వీరికి ఇంతవరకు పిల్లలు కలగకపోవడంతో భర్త, అత్త శివపార్వతి, ఆడపడుచు కొలుసు తిరుపతమ్మ నిత్యం సూటిపోటి మాటలతో వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురైన రాధ ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఆరేవరపు సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శామ్యూల్‌ రాజీవ్‌కుమార్‌ తెలిపారు.


రైలు పట్టాల వద్ద వృద్ధుడి మృతదేహం

చీరాల నేరవిభాగం, న్యూస్‌టుడే: రైలు పట్టాల వద్ద గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెంది ఉన్నాడు. ఈ ఘటన సోమవారం వెలుగుచూసింది. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం... వేటపాలెం-చినగంజాం రైల్వేస్టేషన్‌ల మధ్య ఓ వ్యక్తి(60) మృతదేహం పట్టాల పక్కన పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. జీఆర్పీ ఎస్సై సీహెచ్‌ కొండయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఒంటిపై పసుపు, తెలుగు, ఆకుపచ్చ, ఉదా రంగు పూర్తిచేతుల చొక్కా ధరించి ఉన్నాడన్నారు. అదేవిధంగా ఆకుపచ్చ రంగు లుంగీపై తెలుపు, ఎరుపు, పసుపు పువ్వులు ఉన్నాయని చెప్పారు. మృతదేహాన్ని చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు.


కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

పిడుగురాళ్ల: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన సోమవారం గుంటూరు రోడ్డులో పెట్రోలు బంకు ఎదురుగా చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కరాలపాడు గ్రామానికి చెందిన వడ్లవల్లి ఖాశీం (80) కొండమోడు సమీపంలోని వీరమ్మ కాలనీలో శుభకార్యానికి వచ్చారు. అల్పాహారం కోసం గుంటూరు రోడ్డులోని పెట్రోలు బంకు ఎదురుగా రోడ్డు దాటుతుండగా కొండమోడు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని పట్టణంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుమారుడు జానీ ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.పవన్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

రెంటచింతల, న్యూస్‌టుడే: మండల పరిధి మంచికల్లులో విద్యుదాఘాతానికి గురై ఒక కార్మికుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మాచర్లకు చెందిన తుమ్మల లక్ష్మయ్య (43) ఆదివారం మంచికల్లులో ఇంటి నిర్మాణ పనిలో నిమగ్నమయ్యారు. మిల్లర్‌కు నీరు పెట్టేందుకు మోటారు వేస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆయనను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సమీర్‌ బాషా తెలిపారు. లక్ష్మయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


హత్య కేసులో జీవిత ఖైదు, జరిమానా

గుంటూరు లీగల్‌ న్యూస్‌టుడే : ప్రత్తిపాడు మండలం, తమ్మలపాలెంకు చెందిన కొనంక్కి పవన్‌ కుమార్‌ హత్యకేసులో మంగళగిరి మండలం నవులూరుకు చెందిన తలతోటి సోమశేఖర్‌కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు మూడో అదనపు జిల్లా జడ్జి జి.అర్చన సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. నవులూరుకు చెందిన సోమశేఖర్‌ ఓ సెల్‌ఫోన్‌ కంపెనీలో పనిచేసేవాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. గతంలో తెనాలిలో జరిగిన ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడు. తుమ్మలపాలెంకు చెందిన పవన్‌కుమార్‌ క్రోసూరులో ఉన్న తన పొలాన్ని విక్రయించాడు. ఆ నగదును స్థిరాస్తి వ్యక్తుల ద్వారా తలతోటి సోమశేఖర్‌కు ఇచ్చాడు. నవులూరు రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న ఇంటిని తాకట్టు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. తరువాత తన చెల్లి వివాహ నిమిత్తం డబ్బులు చెల్లించమని పవన్‌కుమార్‌ సోమశేఖర్‌పై ఒత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలో 2016 మే, 16న పథకం ప్రకారం సోమశేఖర్‌ పవన్‌కుమార్‌ను మంగళగిరి పిలిపించాడు. మద్యం తాగించి పవన్‌కుమార్‌ తలపై సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పవన్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందగా సోమశేఖర్‌ తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, శ్రీనివాసరావు నాయనమ్మ అన్నపూర్ణ అతనికి సహకరించారు. పవన్‌కుమార్‌ మృతదేహన్ని సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్దకు తీసుకెళ్లి పెట్రోలు పోసి శవాన్ని దహనం చేశారు. ఈలోగా తన భర్త కనిపించడం లేదని పవన్‌కుమార్‌ భార్య ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరువాత కేసు మంగళగిరి రూరల్‌ పొలీసులకు బదిలీ కాగా కేసు దర్యాప్తు చేశారు. సోమశేఖర్‌తోపాటు అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్‌ నిందితుల్లో సోమశేఖర్‌పై నేరం రుజువు చేయడంతో అతనికి జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ మిగిలిన వారిపై కేసును కొట్టివేస్తూ జడ్జి అర్చన తీర్పు చెప్పారు.


రౌడీషీటర్‌ రెహ్మాన్‌పై పీడీ చట్టం

బాపట్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని ఇస్లాంపేటకు చెందిన రౌడీషీటర్‌ రెహ్మాన్‌పై పీడీ చట్టాన్ని అమలు చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపించినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుండటంతో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అనుమతితో రౌడీషీటర్‌ రెహ్మాన్‌పై పీడీ చట్టాన్ని ప్రయోగించామన్నారు. రౌడీషీటర్లు, మాజీ నేరస్థుల కదలికలపై నిఘా ఉంచినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 16 మందిపై పీడీ చట్టాన్ని అమలు చేశామని, అందులో 13 మంది సారా తయారీదారులు, ముగ్గురు రౌడీషీటర్లు ఉన్నారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని