logo

కన్నా మౌనం దేనికి సంకేతం?

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది దేనికి సంకేతం అని పార్టీలోనే చర్చ జరుగుతోంది.

Published : 25 Jan 2023 05:41 IST

మొన్న జాతీయ, తాజాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి గైర్హాజరు
ఈనాడు-అమరావతి

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది దేనికి సంకేతం అని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య దిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశానికి మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో కొనసాగటంపైనా సస్పెన్స్‌ కొనసాగుతోంది. కుటుంబంలో శుభకార్యం ఉండటంతో రాలేకపోయాయని జాతీయ సమావేశానికి రాలేకపోయానని కేంద్ర నాయకత్వానికి తెలియజేశారు. ఆ సమావేశానికి కన్నాను పిలవొద్దని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారని,  చిన్నచూపు చూశారని ఆయన వర్గీయులు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిపై గత కొంతకాలంగా కన్నా తీవ్ర అసంతృప్తితో ఉండటంతోపాటు ఆయన ఏకపక్ష  వైఖరితో పార్టీకి నష్టం జరుగుతుందని పత్రికాముఖంగానే విమర్శించారు. అందరినీ కలుపుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించటం లేదని తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో సోము నాయకత్వాన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి, ఆయన ఉండే వేదికలో పాలుపంచుకోలేకే గైర్హాజరైనట్లు చెబుతున్నారు. ఇటీవల గుంటూరు పర్యటనకు వచ్చిన పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు సోము నాయకత్వంలో పార్టీ దూసుకుపోతోందని పొగడ్తలు కురిపించటం కన్నాను మరింత అసహనానికి, నిరుత్సాహానికి గురయ్యేలా చేశాయని పార్టీవర్గాల సమాచారం. కన్నా హయాంలో నియమించిన ఐదు జిల్లాల అధ్యక్షులను తొలిగించి వారి స్థానంలో సోము తన అనుయుయులను నియమించుకోవటంపైనా కన్నా ఆగ్రహం చెందారు. భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నాయకులను ఆహ్వానిస్తూ ప్రదర్శించిన ఫ్లెక్సీలపై కన్నా చిత్రం లేదని  కీలక నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

పార్టీ పదవులకు రాజీనామాలు చేసిన మద్దతుదారులు

కన్నాతో పాటు ప్రస్తుతం భాజపాలో కొనసాగుతున్న పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు సైదారావు, పెదకూరపాడు నియోజకవర్గ కన్వీనర్‌ గంధం కోటేశ్వరరావు, ఇతర నాయకులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం కన్నా మద్దతుదారులు నరసరావుపేటలోనూ సమావేశం కానున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని