logo

లంక గ్రామాల్లో వెలుగులు నిలిచేనా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది కరకట్ట లోపల ఉన్న గ్రామాల్లో నదికి వరద సమయంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు, ఉపకేంద్రాలు ముంపునకు గురవుతున్నాయి.

Published : 25 Jan 2023 05:41 IST

ప్రతిపాదనలకే పరిమితమైన ప్రణాళికలు
ఈనాడు-అమరావతి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది కరకట్ట లోపల ఉన్న గ్రామాల్లో నదికి వరద సమయంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు, ఉపకేంద్రాలు ముంపునకు గురవుతున్నాయి. నదికి 6లక్షల క్యూసెక్కుల నీరు వస్తే లంకగ్రామాలకు సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నారు. దీంతో ఒకవైపు వర్షం.. మరోవైపు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో రాత్రివేళ లంకగ్రామాల ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతం. వరదల సమయంలో పర్యటించే నేతలు ఎప్పటికప్పుడు హామీలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. దీంతో వరదల సమయంలో ఏటా లంకల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఈనేపథ్యంలో రెండేళ్ల కిందట లంక గ్రామాల్లో 6లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు సుమారు రూ.10కోట్ల నిధులు అవసరమని అంచనాలు వేశారు. అప్పటినుంచి పలు సాంకేతిక కారణాలతో ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం లభించలేదు. కృష్ణానది కరకట్ట లోపలివైపు విద్యుత్తు సరఫరాకు సంబంధించిన పనులు చేయడానికి జనవరి నుంచి మే వరకు అనుకూల సమయం. ఈనేపథ్యంలో ఈసారైనా పనులు చేపట్టాలని లంకల ప్రజలు కోరుతున్నారు.

దిమ్మెల ఎత్తు పెంచేలా ప్రణాళిక

కృష్ణానది కరకట్ట లోపల ఉన్న విద్యుత్తు నియంత్రికలు(ట్రాన్స్‌ఫార్మర్లు) నదికి 6లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తే ముంపునకు గురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో ఉన్న 430 నియంత్రికల దిమ్మెల ఎత్తు పెంచాలని నిర్ణయించారు. అదేవిధంగా నియంత్రికలు అమర్చిన 400 విద్యుత్తు స్తంభాలను కూడా 9.1 మీటర్లు ఉండేలా చూస్తారు. దీంతోపాటు 1000 జంక్షన్‌ స్తంభాలను కూడా మార్చనున్నారు. జువ్వలపాలెం, ఈపూరులంక గ్రామాల పరిధిలో ఉన్న మూడు విద్యుత్తు ఉపకేంద్రాల ఎత్తును పెంచుతారు. వరద సమయంలో ఇవి ముంపునకు గురికావడంతోపాటు సిబ్బంది యార్డులోకి వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉపకేంద్రం ఎత్తు పెంచడంతోపాటు ఎంత వరద వచ్చినా యార్డులోకి వెళ్లే విధంగా ర్యాంపు కూడా ఏర్పాటుచేస్తారు. లంక గ్రామాల వెంబడి అవసరమైనచోట 12 మీటర్ల స్తంభాలు వేస్తారు. అదేవిధంగా దశాబ్దాల కింద వేసిన తీగలు కావడంతో మొత్తం మార్చి కొత్త లైన్లు వేయాలన్న ప్రతిపాదనలు కూడా చేశారు. వీటన్నిటికి కలిపి రూ.10కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. రెండేళ్ల కిందట పంపిన ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లభించలేదు.

ఇబ్బందులు ఎన్నెన్నో..

కృష్ణానది కరకట్ట లోపల పదుల సంఖ్యలో లంక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత సారవంతమైన భూములు కావడంతో వాణిజ్యపంటలు పండుతున్నాయి. పసుపు, కంద, అరటి, బొప్పాయి వంటి పంటలు విస్తారంగా పండిస్తారు. ఇక్కడి వ్యవసాయం అంతా బోరుబావులపై ఆధారపడి ఉంటుంది. దీంతో లంక గ్రామాల్లోనే విద్యుత్తు ఉపకేంద్రాలు ఉన్నాయి. స్థానికంగా వర్షాలు లేకపోయినా కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడి నదికి వరదలు వస్తాయి. కృష్ణానదికి 6లక్షల క్యూసెక్కుల నీరు వస్తే విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తారు. ఈసమయంలో నాలుగైదు రోజుల పాటు సరఫరాకు అంతరాయం కలిగితే స్థానికంగా పంటలకు నీటితడులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. నదిలోచుట్టూ నీరున్నా పొలాలకు మాత్రం నీరందని పరిస్థితి. మరోవైపు విద్యుత్తు సరఫరా లేకపోతే తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పవు. నదికి వరద సమయంలో గ్రామం చుట్టూ వరదనీరు ప్రవహిస్తుండటంతో నదిలో ఉన్న పాములు, విషపురుగులు ఒడ్డుకు చేరే క్రమంలో గ్రామం పరిసరాల్లోకి చేరుకుంటాయి. రాత్రివేళ విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. వరద ఆగిన తర్వాత కూడా విద్యుత్తు పరికరాలు అన్నీ పరీక్షించి సరఫరాకు ఇబ్బంది లేదని గుర్తించిన తర్వాతే పునరుద్ధరిస్తున్నారు. ఇందుకు కొంత సమయం పడుతోంది. వీటన్నిటికి పరిష్కారం చూపాలని కొన్నేళ్లుగా లంక వాసులు కోరుతూనే ఉన్నారు. వేసవికాలంలో నదిలో నీరు తగ్గిపోతున్నందున విద్యుత్తు పరికరాల రవాణా, అమరికకు సౌకర్యంగా ఉంటుంది.

ప్రతిపాదనలు పంపాం

కృష్ణానదికి 6లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా కరకట్ట లోపల గ్రామాలకు విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. గతంలో పంపిన ప్రతిపాదనలకు రూ.10కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. తాజాగా కొన్ని మార్పులు చేసి లైన్లు మార్చే అవసరం లేకుండా దిమ్మెలు ఎత్తుచేయడం, స్తంభాలు మార్చడం ద్వారా సరఫరాకు ఇబ్బంది లేకుండా చేసేలా కసరత్తు చేసి పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడుతాం.

మురళీకృష్ణయాదవ్‌, పర్యవేక్షక ఇంజినీరు, విద్యుత్తుశాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని