logo

జూనియర్‌ సివిల్‌ జడ్జి నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా...

గుంటూరు నుంచి పదేళ్ల తరువాత జిల్లా జడ్జి హోదాలో ఉన్న వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

Published : 26 Jan 2023 04:41 IST

పదేళ్ల తరువాత గుంటూరు నుంచి గోపాలకృష్ణారావుకు అవకాశం

జడ్జి గోపాలకృష్ణారావును అభినందిస్తున్న కోర్టు సిబ్బంది

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: గుంటూరు నుంచి పదేళ్ల తరువాత జిల్లా జడ్జి హోదాలో ఉన్న వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 28 ఏళ్ల కిందట జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులైన గోపాలకృష్ణారావు అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం గుంటూరు 1వ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనను రాష్ట్ర హైకోర్టు జడ్జిగా నియమిస్తూ రాష్ట్రపతి మంగళవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్‌ సత్యనారాయణమూర్తి నేరుగా హైకోర్టు జడ్జిగా నియమితులు కాగా, ఆతరువాత గోపాలకృష్ణారావుకే ఆ అవకాశం లభించింది. జూనియర్‌ సివిల్‌ జడ్జితో మొదలై హైకోర్టు జడ్జిగా గుంటూరు జిల్లా నుంచి నియమితులైన తొలి వ్యక్తి కావడం విశేషం. కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన గోపాలకృష్ణారావు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగులో గ్రామీణ పాఠశాలలోనే సాగింది. వరంగల్‌లో తొలి పోస్టింగ్‌ పొందిన ఆయన 2007లో పదోన్నతి పొంది రాజమండ్రిలో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమితులయ్యారు. 2016లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందిన ఆయన శ్రీకాకుళం, తిరుపతిలో విధులు నిర్వహించి గత ఎడాది ఏప్రిల్‌లో గుంటూరుకు బదిలీ అయ్యారు. ఆయన కుమారుడు జూనియర్‌ సివిల్‌ జడ్జి కాగా, కుమార్తె న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. ఇరువురూ ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించిన అనంతరం తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. కేసుల పరిష్కారంలో మంచి చొరవ చూపడంతోపాటు కక్షిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గోపాలకృష్ణారావు కృషి చేశారు. న్యాయవాదులతో సౌమ్యంగా మెలిగి కేసుల పరిష్కారంతోపాటు ఉన్నత న్యాయస్థానాల తీర్పులను వారికి తెలియజేసేవారు. హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జడ్జి గోపాలకృష్ణారావును గుంటూరు బార్‌ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కలిసి బుధవారం అభినందనలు తెలిపారు. వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని