logo

ఉక్కిరిబిక్కిరి..!

ఒకవైపు టీచర్ల బదిలీల నిర్వహణకు కావాల్సిన సమాచారం...మరోవైపు పాఠశాలల వారీగా ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు...ఇంకోవైపు మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన వివరాలు.

Published : 27 Jan 2023 04:47 IST

రోజుకో సమాచారం అడుగుతున్న అధికారులు  
బోధనకు ఆటంకం కలుగుతుందని హెచ్‌ఎంల ఆందోళన
ఈనాడు-అమరావతి

కవైపు టీచర్ల బదిలీల నిర్వహణకు కావాల్సిన సమాచారం...మరోవైపు పాఠశాలల వారీగా ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు...ఇంకోవైపు మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన వివరాలు..ఇలా ఒకదాని వెంట మరొకటి రోజుకో నమూనా ఇచ్చి ఆ సమాచారం వెంటనే పంపాలని విద్యాశాఖ అధికారుల నుంచి వచ్చి పడుతున్న ఆదేశాలు ప్రధానోపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఆ సమాచారం ఇవ్వడానికి తగు సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో సిలబస్‌ పూర్తి చేసుకుని విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన తరుణంలో అకడమిక్‌తో సంబంధం లేని రకరకాల సమాచారం అడగడం...అది అత్యవసరమని హడావుడి చేయడంతో వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం యూ-డైస్‌, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక (స్కూల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌) వివరాలు ఇవ్వాలని కోరడమే అందుకు నిదర్శనం. కమిషరేట్‌ నుంచి రోజుకో రకమైన వివరాలు కోరుతూ వస్తున్న ఆదేశాలు తమకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయని ప్రధానోపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.

ఉపాధ్యాయులపై ఆధారపడాల్సిందేగా..

ఉన్నతాధికారులు ఏ సమాచారం కోరినా దాన్ని సహచర ఉపాధ్యాయుల నుంచి సేకరించి ఇవ్వాల్సిందే తప్ప హెచ్‌ఎం ఒక్కరే వాటిని సిద్ధం చేయలేరు. దీంతో డేటా సేకరణలో ఉపాధ్యాయులు కూడా భాగస్వాములు కావడంతో కొన్ని స్కూళ్లలో బోధనకు ఆటంకం ఏర్పడుతోందని, రెగ్యులర్‌గా క్లాసులు చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. గడచిన వారం రోజుల నుంచి యూ-డైస్‌, స్కూల్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళికల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటపడుతున్నారు. ఈ వివరాలు పంపడాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని గుంటూరు, పల్నాడు, బాపట్ల మూడు జిల్లాల డీఈవోలు పదేపదే చెబుతుండటంతో...హెచ్‌ఎంలు సహచర ఉపాధ్యాయులను పిలిచి ఈ వివరాలు ఇచ్చాకే బోధన చేయాలని ఆదేశిస్తున్నారు. రెండురోజుల్లో స్కూల్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళిక పూర్తి సమాచారం ఇవ్వాలని కోరుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని కొందరు హెచ్‌ఎంలు చెబుతున్నారు.

కోరిన సమాచారమిదీ..

పాఠశాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హేబిటేషన్‌ డెవలప్‌మెంట్‌, కాంప్లెక్సు డెవలప్‌మెంట్‌, మండల డెవలప్‌మెంట్‌ ప్రణాళికలు కోరారు. ఒక హేబిటేషన్‌ పరిధిలో 2-3 స్కూళ్లు ఉంటాయి. వాటి అభివృద్ధికి ఏం చేయాలి? కాంప్లెక్స్‌ పరిధిలో 12-13 పాఠశాలలు, మండల పరిధిలో 5-6 కాంప్లెక్సుల దాకా ఉంటాయి. ఇవి తయారు చేసి సమగ్రశిక్ష అధికారులకు అందజేస్తే జిల్లా స్థాయిలో రానున్న విద్యా సంవత్సరానికి ఎంత బడ్జెట్‌ అవసరమో ప్రతిపాదించి ఆమేరకు నిధులు కోరవచ్చు. అయితే ఈ సమాచారాన్ని సమగ్రశిక్షలో ఉండే సీఆర్‌పీలు, ఇంజినీరింగ్‌ అధికారులు, అకడమిక్‌ మోనటరింగ్‌ అధికారులు సేకరించి తుదిగా హెచ్‌ఎంలతో సమావేశమై చర్చిస్తే సరిపోతుందని...వారిని వదిలేసి అన్ని రకాల సమాచారాలు పాఠశాలల హెచ్‌ఎంలే ఇవ్వాలనడంతో బోధనపై అది ప్రభావం చూపుతోందని సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడొకరు చెప్పారు. ఈ వివరాలు ఏటా నవంబరులోనే సేకరించేవారు. అలాంటిది ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇటీవల అడగడాన్ని తప్పుబడుతున్నారు. ప్రతి హేబిటేషన్‌ పరిధిలో 0-15 ఏళ్ల పిల్లల్లో ఎంతమంది అంగన్‌వాడీల్లో చేరారు..ఎంతమంది ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నారు...వారిలో దివ్యాంగులు ఎందరు...ఇతర ఊళ్ల నుంచి వచ్చే పిల్లలు ఎంతమంది..వారికి ఎస్కార్టు అలవెన్స్‌ ఇస్తున్నారా వంటి సమాచారం కోరారు. అదేవిధంగా ఆ ఊళ్లో అక్షరాస్యత శాతం..పిల్లల వయస్సుకు తగ్గట్లే వారు ఆయా క్లాసుల్లో ఉన్నారా...ఏమైనా ఓవర్‌ ఏజ్‌ ఉందా? బాల, బాలికల వారీగా వారి కులాలు, ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులు..వాటి గ్రేడ్లు, పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గదుల సంఖ్య, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా టీచర్లు ఉన్నారా లేరా? క్రీడా వసతులు...సరిపడా బెంచీలు ఉన్నాయా, లేవా? లేబరేటరీ ఎక్విప్‌మెంట్‌, గ్రంథాలయాల్లో పుస్తకాల లభ్యత, కంప్యూటర్లు వివరాలు క్రోడీకరించి ఇవ్వాల్సి ఉండడంతో ఆ సమాచారం ఇవ్వడానికి కనీసం వారం, పది రోజులు పడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని