logo

అదృశ్య గ్రామాల అన్వేషకుడు.. శివశంకర్‌

ప్రాథమిక విద్యకే పరిమితమైనా అపరిమితమైన ఆసక్తితో నిరంతర అన్వేషణతో ఉనికిలో లేని, పాడుబడిన, అదృశ్యమైన, మనుగడలో లేని గ్రామాలను గుర్తించి వాటికి రికార్డుల్లో ఉన్న ఆధారాలను సేకరించి ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా అదృశ్యగ్రామాల సమాహారాన్ని పుస్తకరూపంలో తీసుకువచ్చారు.

Updated : 27 Jan 2023 05:48 IST

500 పల్లెల వివరాలతో పుస్తకం
ఈనాడు, అమరావతి

ప్రాథమిక విద్యకే పరిమితమైనా అపరిమితమైన ఆసక్తితో నిరంతర అన్వేషణతో ఉనికిలో లేని, పాడుబడిన, అదృశ్యమైన, మనుగడలో లేని గ్రామాలను గుర్తించి వాటికి రికార్డుల్లో ఉన్న ఆధారాలను సేకరించి ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా అదృశ్యగ్రామాల సమాహారాన్ని పుస్తకరూపంలో తీసుకువచ్చారు గుంటూరుకు చెందిన మణిమేల శివశంకర్‌. అతను ఓ సాధారణ ముఠా కూలీ. మూటలు మోయడం అతని వృత్తి. కానీ గత చరిత్రపై అన్వేషణ చేయడం ప్రవృత్తి.  
చదివింది ఐదో తరగతే... అయినా శాసనాలను పరిశీలించడం, అందులోని విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాలగర్భంలో కలిసిపోయిన 500 గ్రామాల చరిత్రను వెలికితీశారు. ఎలాంటి డిగ్రీలు లేకపోయినా పరిశోధకుల కంటే మిన్నగా శ్రమించి అదృశ్య గ్రామాల చరిత్రను అక్షరబద్ధం చేశారు.

శివశంకర్‌ రాసిన పుస్తకం ఇదే

ఆసక్తిని అన్వేషణగా మార్చుకుని...

ఓవైపు బస్తాలు మోస్తూ ముఠాకూలీగా పనిచేస్తూనే విరామ సమయంలో అన్వేషణ సాగించారు. ఆరంభంలో ఆలయాలు తిరిగి చరిత్ర తెలుసుకునేవారు. అక్కడి శాసనాలపై ఆరా తీసేవారు. ఈక్రమంలో ఆలయాలకు దానంగా ఇచ్చిన గ్రామాల పేర్లు చాలావరకు ప్రస్తుతం మనుగడలో లేవని గుర్తించారు. అలాంటి మరుగన పడిన అదృశ్య గ్రామాల అన్వేషణ మొదలెట్టారు. 2018 నుంచి పరిశోధిస్తూ అనేక గ్రామాలు కలియతిరిగారు. గ్రంథాలయాల్లో అనేక వివరాలు సేకరించారు. శాసనాలు, కైఫియత్తుల నుంచి వివరాలు సేకరించారు. అనేక చారిత్రక పుస్తకాలను సమకూర్చుకున్నారు. ఈక్రమంలో కరోనా రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఈసమయంలో తాను అన్వేషించిన గ్రామాల వివరాలు అన్నీ అక్షరబద్ధం చేశారు. అదృశ్య గ్రామాల చరిత్ర, వాటికి ఆధారాలు ఇలా వివరాలన్నీ పొందుపరిచారు. వీటిని అదృశ్య గ్రామాలు పేరుతో 2022లో పుస్తకం తీసుకువచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామం. చిన్నతనంలో అమ్మమ్మ గారి ఊరైన బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఐదోతరగతి తర్వాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు ఆపేశారు. జీవనోపాధి కోసం గుంటూరు వచ్చి ముఠా కార్మికుడిగా స్థిరపడ్డారు. దైవదర్శనం కోసం ఆలయాలకు వెళ్లే మణిశంకర్‌ అక్కడి స్థలపురాణం, చరిత్ర గురించి ఆరా తీసే అలవాటుగా మార్చుకున్నారు. తన పని పూర్తవగానే శాసనాల అన్వేషణ కోసం తిరుగుతుంటారు. అమ్మమ్మ గారి ఊరైన భర్తిపూడిలో ఉన్నప్పుడు ఒకప్పుడు పేరుగాంచిన వెలిచర్ల, నేరేడుపల్లి, ములకపాడు గ్రామాల అదృశ్యంపై గ్రామంలోనే చర్చించుకునేవారు. చిన్నతనంలో శివశంకర్‌ మనసులో ఇది బలంగా నాటుకుంది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అనే ఆలోచన చరిత్ర అన్వేషణకు పురికొల్పింది. శివశంకర్‌ గుంటూరు జిల్లాలోని ఎన్నో అదృశ్యమైన గ్రామాలకు వెళ్లారు. అందుబాటులో ఉన్న రికార్డులను తిరగేశారు. ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 500 అదృశ్యమైన గ్రామాల పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, సంస్కృతి వివరాలను సేకరించగలిగారు. మండలాల వారీగా అదృశ్య గ్రామాల వివరాలను (గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు) పేరుతో గ్రంథస్థం చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పూర్వీకుల గ్రామమైన పింగళి గురించి కూడా పుస్తకంలో పొందుపర్చారు. తెనాలి రామలింగకవి స్వస్థలం గార్లపాడు తెనాలి మండల గ్రామం కొలకలూరుకు సమీపంలోని అదృశ్యగ్రామమని తేల్చారు.

శాసనాల ఆధారంగా సేకరణ

శివశంకర్‌ పరిశోధనకు ప్రధాన ఆధారం శాసనాలు. పాత తెలుగు శాసనాలను చదివి అర్థం చేసుకోవడంలో పట్టు సాధించారు. సంస్కృతంలో శాసనాలు అర్థం కాకపోవడంతో తెలిసిన మిత్రుల సాయంతో అందులోని అంశాలను తెలుసుకున్నారు. పాత సాహిత్యం, కైఫియత్తులు, గెజిట్లలోని సమాచారం ఆధారంగా అదృశ్యగ్రామాల సంగతుల్ని గుర్తించారు. పుస్తకంలో అదృశ్యగ్రామాలు, విలీన గ్రామాలు, జంటగ్రామాలు, ప్రతినామ గ్రామాలు ఇలా ప్రత్యేక విభాగాలున్నాయి. పట్టణీకరణలో భాగంగా చాలా గ్రామాలు సమీపంలోని పట్టణాలు, నగరాల్లో కలిసిపోయాయి. అలాంటి గ్రామాల వివరాల్ని కూడా ఆయన పొందుపర్చారు. సమాచార సేకరణకు సమీకరించిన పుస్తకాలు మినీగ్రంథాలయాన్ని తలపిస్తున్నాయి.
వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నం...
తన స్ఫూర్తితో చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొందరు ఔత్సాహికులు అదృశ్య గ్రామాలపై పరిశోధన చేస్తున్నట్లు శివశంకర్‌ తెలిపారు. కొలకలూరు శాసనాలు, వినుకొండ సీమ కరణికరపట్టిక పుస్తకాలు తీసుకు రావడానికి అధ్యయనం చేస్తున్నానన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1000 వరకు అదృశ్య గ్రామాలు ఉన్నాయని వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని