logo

మహిళా కూలీల ఆటో బోల్తా

మహిళా కూలీలతో వెళుతున్న ఆటో గ్రామ ఆరంభంలో ప్రమాదానికి గురై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలయ్యాయి.

Published : 27 Jan 2023 04:47 IST

ఒకరి మృతి.. 16 మందికి గాయాలు
అద్దంకి, ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స

ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడిన కూలీలు

జాగర్లమూడివారిపాలెం(జే పంగులూరు), న్యూస్‌టుడే: మహిళా కూలీలతో వెళుతున్న ఆటో గ్రామ ఆరంభంలో ప్రమాదానికి గురై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరు మృతిచెందగా ఏడుగురికి తీవ్రంగానూ, మిగిలిన వారు స్వల్ప గాయాలతోనూ బయటపడ్డారు. వీరిని అద్దంకి, ఒంగోలు ఆసుపత్రులకు తరలించారు. వీరంతా జే పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలేనికి చెందిన కూలీలు. మిరప కోతకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరిగింది. రేణింగవరం పోలీసులు అందించిన సమాచారం మేరకు.. జాగర్లమూడివారిపాలేనికి చెందిన కూలీలు అదే గ్రామానికి చెందిన డి.సునీల్‌ ఆటోలో ముండ్లమూరు మండలం అగ్రహారం, తమ్మలూరు మిరప కోతలకు వెళ్లారు. కూలీ పనుల అనంతరం అదే ఆటోలో స్వగ్రామానికి వస్తున్నారు. రెండు నిమిషాల్లో ఇళ్లకు చేరుకునే క్రమంలో ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న ఆటో వెనుక టైరు పేలింది. దీంతో అదుపు తప్పి బోల్తాపడింది. కూలీలు ఒకరిపై మరొకరు పడటంతో ఊపిరాడక గాయాలపాలయ్యారు. వాహన చోదకుడు సునీల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం విషయమై స్పందించిన స్థానికులు గాయపడిన కూలీలకు సపర్యలు చేశారు. జాతీయ రహదారి అంబులెన్స్‌ వాహనంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఒంగోలు తరలించారు. ఇందులో నంబూరి రంగమ్మ మృతిచెందారు. మిగిలిన 14మంది క్షతగాత్రులను సంతమాగులూరు, కొరిశపాడు, అద్దంకి 108 వాహనాల్లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఐదుగురు క్షతగాత్రులను మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తరలించారు. సంఘటనా స్థలాన్ని రేణింగవరం ఎస్సై కె.కె.తిరుపతిరావు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.

అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

కూలీలు వీరే

1.జాగర్లమూడి అరుణకుమారి 2. చింతా నాగమణి 3.గంగా సీతమ్మ 4.ఎస్‌కె.నాగూర్‌బీ 5.ఎన్‌.శోభారాణి 6.పొన్నూరి పోలేరమ్మ 7.ధూళిపాళ్ల నాగేంద్రం 8.దేవతోటి ప్రియాంక 9.ధూళిపాళ్ల శోభారాణి, 10.ధూళిపాళ్ల అంజమ్మ 11.మల్లెల రమాదేవి 12.ఉదరగుడి శిరీష 13.జరుగుల స్వాతి 14.ధూళిపాళ్ల రత్నకుమారి 15.కల్లూరి నాగమణి 16.పొన్నూరి రామతీర్థం 17.నంబూరి రంగమ్మ(మృతి)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని