logo

Andhra News: ‘ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావ్‌’

‘రేయిబవంళ్లు పార్టీ అభివృద్ధి కోసం శ్రమించి, ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించిన మమ్మల్ని కాదని, బయటి వ్యక్తులకు పెత్తనం అప్పగిస్తావా.. ఓట్లు కోసం తిరిగి ఏ ముఖం పెట్టుకొని వస్తావో చూస్తాం..’ అంటూ రాష్ట్ర జల వనరులశాఖ...

Updated : 28 Jan 2023 09:44 IST

గణతంత్ర దినోత్సవంలో హెచ్‌ఎం వనజకుమారిపై ఆగ్రహిస్తున్న ఎంపీటీసీ సభ్యురాలు విజయకుమారి

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే : ‘రేయిబవంళ్లు పార్టీ అభివృద్ధి కోసం శ్రమించి, ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించిన మమ్మల్ని కాదని, బయటి వ్యక్తులకు పెత్తనం అప్పగిస్తావా.. ఓట్లు కోసం తిరిగి ఏ ముఖం పెట్టుకొని వస్తావో చూస్తాం..’ అంటూ రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నుద్దేశించి సత్తెనపల్లి మండలం పెదమక్కెన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు వేంపాటి విజయకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదమక్కెనలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. పాఠశాలలో వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు పాల్గొన్నారు. ఇటీవల పాఠశాలలో జరిగిన ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి ఎందుకు పిలవలేదని హెచ్‌ఎం వనజకుమారిని ఆమె నిలదీశారు. గ్రామంలోని ప్రజాప్రతినిధికి ఆహ్వానం లేకుండా పురుషోత్తం, విజయభాస్కర్‌రెడ్డి (మంత్రి రాంబాబు ప్రధాన అనుచరులు)ను పిలిచి పంపిణీ చేయడమేంటని ఆగ్రహించారు. ఆ కుక్కలు ఎవరు.. ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడానికి అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఇద్దరే ఆయన్ను గెలిపిస్తారులే.. అంటూ మంత్రి రాంబాబు నుద్దేశించి అన్నారు. ఆనాడు మా ఇళ్ల చుట్టూ తిరిగిన వారికి అధికారం రాగానే మేం కనబడటం లేదా.. అంటూ మంత్రి రాంబాబు, ఇద్దరు నాయకులనుద్దేశించి ఎంపీటీసీ సభ్యురాలి భర్త కోటిరెడ్డి అన్నారు. బంగారం తాకట్టు పెట్టి పార్టీ కోసం ఖర్చు చేశాం.. పిల్లల్ని చదివించుకోడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాం.. అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు చేతుల్లో నరాలు కరిగేలా కుండల కొద్దీ ఆ కుక్కలకు వండి పెట్టానండీ.. ఆ విశ్వాసం లేదు అంటూ దూషించారు. ఉపాధ్యాయులు సముదాయించడంతో అనంతరం ఆమె బహుమతులు అందజేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని