logo

ప్రజాసేవ సంకల్పంతోనే తెదేపాను స్థాపించిన ఎన్టీఆర్‌

ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు. తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.

Published : 29 Jan 2023 06:03 IST

శత జయంతి ఉత్సవాల్లో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌

మాట్లాడుతున్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, వేదికపై శ్రావణ్‌కుమార్‌, పెదరత్తయ్య, ప్రభాకర్‌

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు. తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ ‘దిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం మంట కలుస్తుంటే సహించలేక.. తెలుగుజాతి ఖ్యాతిని పెంపొందించడం కోసం ఉద్భవించిందే తెదేపా. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్‌ను మట్టి కరిపించి అధికారాన్ని కైవసం చేసుకుని పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్‌ పాలన సాగించారు. సమాజమే దేవాలయం.. పేద ప్రజలే దేవుళ్లు.. అనే నినాదంతో ప్రజా సంక్షేమ పాలనకు బాటలు వేసి దేశ రాజకీయ చరిత్రలో సంక్షేమ అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. తలలు పండిన రాజకీయ నాయకులకు కూడా రాని ఆలోచనలు ఎన్టీఆర్‌కు వచ్చాయి. పేదరికం లేపి సమాజం కోసం రేషన్‌ కార్డులు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్‌. రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి గొప్ప పథకాలను ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనదే. వైకాపా ప్రభుత్వ అరాచక పాలనను తరిమికొట్టే శక్తి తెదేపా కార్యకర్తలకు ఉంది. తెదేపాను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి’.. అని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ తెలుగుజాతికి జీవం పోసి దేశ రాజకీయాల స్వరూపాన్నే మార్చేశారన్నారు. రాజకీయంగా ఎటువంటి అనుభవం లేకపోయినా ప్రజల సంక్షేమం కోసం చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాలంటే ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు కులం, మతం లేదని, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరన్నారు. తెలుగుజాతికి, తెలుగు భాషకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఈసందర్భంగా సీనియర్‌ నాయకుల్ని సత్కరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కంచర్ల శివరామయ్య, దామచర్ల శ్రీనివాసరావు, నూతలపాటి రామారావు, నాయుడు ఓంకార్‌, కాట్రగడ్డ రామకృష్ణ, ఈరంటి వరప్రసాద్‌, పోతురాజు సమత, మల్లె విజయ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని