logo

వ్యాస ధర్మక్షేత్ర ప్రతిష్ఠ ఉత్సవాలకు అంకురార్పణ

క్రౌంచగిరి పర్వతాల సమీపంలో వ్యాసాయ వ్యాసరూపాయ నమః అని భక్తులు పలికే నామాల మధ్య పంచాహ్నికా దీక్ష తీసుకున్న యాజ్ఞిక రుత్వికులు ఉచ్ఛరించే వేద మంత్రాలతో వ్యాస ధర్మక్షేత్ర ప్రతిష్ఠ ఉత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది.

Published : 29 Jan 2023 05:55 IST

అమరావతి, న్యూస్‌టుడే: క్రౌంచగిరి పర్వతాల సమీపంలో వ్యాసాయ వ్యాసరూపాయ నమః అని భక్తులు పలికే నామాల మధ్య పంచాహ్నికా దీక్ష తీసుకున్న యాజ్ఞిక రుత్వికులు ఉచ్ఛరించే వేద మంత్రాలతో వ్యాస ధర్మక్షేత్ర ప్రతిష్ఠ ఉత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్నీ ఆరామం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న భగవాన్‌ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్ర ఐదు రోజుల ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆరామంలో ఉన్న వ్యాస మహర్షి విగ్రహాన్ని, ప్రతిష్ఠ యంత్రాలను పల్లకీలో ఊరేగింపుగా ధర్మక్షేత్రంలోని ఆలయంలోకి తెచ్చారు. మంగళ వాయిద్యాలతో మొదలై వ్యాస మహర్షికి, చండీమాతకు యాజ్ఞిక బ్రహ్మ బాలాజీ గురుకుల్‌ ఆధ్వర్యంలో దీక్షా కంకణ బద్దులైన భవఘ్నీ గురు దంపతుల పూజా క్రతువులను నిర్వహించారు. పుణ్యాహచనము, పంచగవ్యప్రాసన, గంగా పూజ, వాస్తు పూజ, ధ్యాన పూజ, మృత్యుంగ్రహణ, యాగశాల ప్రవేశవు ఇత్యాది పూజా కైంకర్యాలు నిర్వహించారు. యాగశాల వద్ద గంగా, గాయత్రీ గోవులను గురు దంపతులు భక్తిశ్రద్ధలతో పూజించారు.

భగవంతునికి ప్రతి రూపం వ్యాసభగవానుడు: భగవంతుని ప్రతిరూపంగా ప్రపంచ మానవాళికి జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన చిరంజీవులు వ్యాస భగవానులని భవఘ్నీ గురుదేవులు ఉపదేశించారు. తొలిరోజు ప్రతిష్ఠోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ వ్యాస భగవానుని గురించి చాలా మందికి తెలియదన్నారు. భాగవతం, అష్టాదశ పురాణాలు, నాలుగు వేదాలు ప్రపంచానికి ఇచ్చిన భగవద్‌ స్వరూపునికి దేవాలయం కట్టి స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని