logo

ఎట్టకేలకు వైద్య కళాశాల నిర్మాణ పనులు

బాపట్ల వైద్య కళాశాల, ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. భవనాల పిల్లర్లకు గుంతలు తీసే పనులకు ఎమ్మెల్యే కోన రఘుపతి శనివారం పూజలు చేశారు.

Published : 29 Jan 2023 06:03 IST

పూజ చేసి పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోన రఘుపతి దంపతులు

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల వైద్య కళాశాల, ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. భవనాల పిల్లర్లకు గుంతలు తీసే పనులకు ఎమ్మెల్యే కోన రఘుపతి శనివారం పూజలు చేశారు. వైద్య కళాశాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేసిన ఇరవై నెలల తర్వాత భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది డిసెంబరులోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. కళాశాలకు ప్రభుత్వం రూ.510 కోట్లు మంజూరు చేస్తున్నట్లు 2021 ఏప్రిల్‌లో ప్రకటించింది. పట్టణ శివారున జమ్ములపాలెం రోడ్డులో 56 ఎకరాల భూమిని కేటాయించారు. 500 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించారు. అయితే నిధులు విడుదల చేయకపోవటం వల్ల పనులు నత్తనడకన సాగాయి. వైద్య కళాశాలకు కేటాయించిన భూమి చెరువు కావటంతో కొంతమేర మెరక చేసి రోలింగ్‌ చేశారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆసుప్రతి నిర్మాణం పూర్తయి ప్రారంభిస్తేనే వైద్య కళాశాలకు కేంద్రం అనుమతి ఇస్తుంది. జిల్లా కేంద్రం బాపట్లలో సరైన వైద్య సౌకర్యాలు లేవు. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను 60 కి.మీ. దూరంలోని గుంటూరు తరలించాల్సి వస్తోంది. స్థానికంగా ప్రాంతీయ ఆసుపత్రి ఉన్నా ఐసీయూ సేవలు అందుబాటులో లేవు. అత్యవసర వైద్యం అందటం లేదు. బాపట్లలో వైద్య కళాశాల, 300 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించటంతో వైద్య సేవలు మెరుగవుతాయని ప్రజలు భావించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రసవాలు జరగక మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. వైద్యల కొరత తీవ్రంగా ఉంది. వైద్య కళాశాల, ఆసుపత్రికి 2020లో భూసేకరణ చేయగా 2021 మే 31న సీఎం జగన్‌ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభించి ఉంటే ఈ ఏడాది ఆఖరుకు భవనాలు పూర్తయ్యేవి. నిధుల సమస్యతో పనులు చేపట్టలేదు.


నాబార్డు నుంచి నిధులు

ఆసుపత్రి భవనాల నిర్మాణానికి నాబార్డు నుంచి రుణం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నాబార్డు నుంచి ఇటీవల అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో భారీ యంత్రాన్ని తెప్పించి భవనం పునాది నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ల కోసం గుంతలు తీస్తున్నారు. తొలుత ఆసుపత్రి భవనాన్ని పూర్తి చేసిన తర్వాతే వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కనీసం రెండేళ్లలో అయినా 300 పడకల ఆసుపత్రి ప్రారంభం అయితే స్థానిక ప్రజలు కోరుకుంటున్న విధంగా వైద్య సేవలు మెరుగవడానికి అవకాశం ఉంటుంది. బాపట్ల వైద్య కళాశాల, ఆసుపత్రి భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వటానికి నాబార్డు అనుమతి మంజూరు చేసిందని ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. ఏప్రిల్‌లోగా భవనం మొదటి శ్లాబ్‌ వేస్తారు. ఇక నుంచి ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని