logo

బీఈడీ కళాశాలలకు పంపిన తాఖీదుల్లో తప్పులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని పలు బీఈడీ కళాశాలలకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో జీరో అడ్మిషన్ల కింద కౌన్సెలింగ్‌ నిలిపివేస్తూ 25న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో తప్పులు దొర్లటంతో వర్సిటీ అభాసుపాలయింది.

Published : 29 Jan 2023 06:03 IST

ఆలస్యంగా గుర్తించిన ఏఎన్‌యూ అధికారులు

ఈనాడు-అమరావతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని పలు బీఈడీ కళాశాలలకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో జీరో అడ్మిషన్ల కింద కౌన్సెలింగ్‌ నిలిపివేస్తూ 25న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో తప్పులు దొర్లటంతో వర్సిటీ అభాసుపాలయింది.  13.1.2013న నిర్వహించిన వర్సిటీ పాలకమండలి(ఈసీ మీటింగ్‌) సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కళాశాలల్లో అధ్యాపకుల లేమి తదితర కారణాలతో కౌన్సెలింగ్‌ నిలిపివేశారు. తేదీ తేడా ఉండటంతో అంతా కంగుతిన్నారు. 40కు పైగా కళాశాలకు అనుమతులు నిలిపేసినట్లు తెలిసింది. ఒకే అధ్యాపకుడు ఒకటికి మించి రెండు, మూడు కళాశాలల్లో పనిచేయటం, వారు ఆధార్‌ నంబర్లను మార్చడం వంటి లోపాలను వర్సిటీ తనిఖీ కమిటీలు, ఉన్నత విద్యామండలి కమిటీల పరిశీలనలో బయటపడ్డాయి. తమ కళాశాలల్లో కౌన్సెలింగ్‌ నిలిపివేయటాన్ని సవాల్‌ చేస్తూ కొన్ని కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. న్యాయవాది అందులో తప్పులు గుర్తించటంతో వర్సిటీ దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు తమ తప్పులను సరిదిద్దుకుని తిరిగి  ప్రొసీడింగ్స్‌ ఈనెల 13న జరిగిన ఈసీ మీటింగ్‌ నిర్ణయాన్ని అనుసరించి అని మార్పు చేసి మరోసారి శనివారం తాకీదులు పంపారు. దీనిపై సీడీసీ డీన్‌ ఆచార్య మధుబాబును వివరణ కోరగా ఈనెల 13న ఈసీ మీటింగ్‌ జరిగిందని ఆ సమావేశంలోనే లోపాలు ఉన్న కళాశాలలకు అనుమతులు నిలుపుదల చేయాలని నిర్ణయించారు. తప్పులను సరిచేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని