logo

ఎవరి దారి వారిదే..!

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని వైకాపాలో విభేదాలు ఘాట్‌ రోడ్డు ప్రారంభం సందర్భంగా బయటపడ్డాయి. మేడికొండూరు మండలంలోని పేరేచర్లలో గంగా పార్వతీ సమేత కైలాసనాథేశ్వర స్వామి (కైలాసగిరి క్షేత్రం) కొండపై నూతనంగా నిర్మించిన ఘాట్‌ రోడ్డును శనివారం ప్రారంభించారు.

Published : 29 Jan 2023 06:03 IST

ఘాట్‌ రోడ్డు ప్రారంభంలో బయటపడిన విభేదాలు

పేరేచర్ల కైలాసగిరి క్షేత్రం ఘాట్‌ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, సమన్వయకర్త సురేష్‌కుమార్‌

మేడికొండూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని వైకాపాలో విభేదాలు ఘాట్‌ రోడ్డు ప్రారంభం సందర్భంగా బయటపడ్డాయి. మేడికొండూరు మండలంలోని పేరేచర్లలో గంగా పార్వతీ సమేత కైలాసనాథేశ్వర స్వామి (కైలాసగిరి క్షేత్రం) కొండపై నూతనంగా నిర్మించిన ఘాట్‌ రోడ్డును శనివారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త కత్తెర సురేష్‌కుమార్‌ హాజరైనా.. వేర్వేరుగా వచ్చి వేర్వేరుగా కార్యక్రమాలు చేయడం గమనార్హం. ఒకరు ముందుగా వచ్చి గణపతి పూజ చేసి వెళ్లిపోగా.. మరొకరు శిలాఫలకం ఆవిష్కరించారు. ఇంకొకరు  రిబ్బన్‌ కత్తిరించి రోడ్డును ప్రారంభించడం విశేషం. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్‌, స్థానిక జడ్పీటీసీ కందుల సిద్ధయ్య, ఎంపీపీ మన్నవ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ఘాట్‌ రోడ్డు వద్ద పూజలు చేస్తున్న ఎమ్మెల్యే శ్రీదేవి

అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వేర్వేరుగా..

కైలాసరిగి క్షేత్రం కొండపై ఘాట్‌ రోడ్డు ప్రారంభంలో పాల్గొనేందుకు ముందుగా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వచ్చారు. రోడ్డు ప్రారంభంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం వద్ద గణపతి పూజ చేశారు. అనంతరం కొండపైకి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అదే సమయంలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, ఆమె భర్త కత్తెర సురేష్‌కుమార్‌ అక్కడకు వచ్చారు. స్థానికులతో కలిసి క్రిస్టినా, సురేష్‌ పూజలో పాల్గొన్నారు. ఆ సమయంలో శ్రీదేవి కొండ దిగి వెళ్లిపోయారు. మరికొద్దిసేపటికి క్రిస్టినా, సురేష్‌ ఇద్దరూ కలిసి ఘాట్‌ రోడ్డు ప్రారంభం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాసేపటికి వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఘాట్‌ రోడ్డు శిలాఫలకం వద్దకు వచ్చారు. మాణిక్యవరప్రసాద్‌, క్రిస్టినా, సురేష్‌కుమార్‌ ముగ్గురు కలిసి రిబ్బన్‌ కత్తిరించి ఘాట్‌ రోడ్డును ప్రారంభించారు. అనంతరం స్వామిని దర్శించుకుని ఆలయంలో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* దీనికి ముందు తెదేపాకు చెందిన గ్రామ సర్పంచి దేవరకొండ రాజ్‌కుమార్‌ అక్కడకు వచ్చారు. గ్రామ ప్రథమ పౌరుడిగా ఉన్న తన పేరు ఘాట్‌ రోడ్డుకు చెందిన శిలాఫలకంపై ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. కైలాసగిరి క్షేత్రం కొండ చుట్టూ విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసే విషయంలో ఎంతో కృషి చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని