logo

పత్తి అధారిత పరిశ్రమ కుదేలు

పత్తి పండించిన రైతులు జనవరి నెలాఖరుకు వచ్చినా అమ్మకానికి మొగ్గుచూపడం లేదు. మెరుగైన ధర కోసం వేచిచూస్తూనే ఉన్నారు. సుమారు 40 శాతం వరకు పత్తి ఇంకా రైతు గడప దాటలేదని మార్కెట్‌ వర్గాల అంచనా.

Updated : 29 Jan 2023 06:24 IST

ఇళ్లలోనే పేరుకుపోతున్న పంట ఉత్పత్తులు
ఈనాడు, నరసరావుపేట

త్తి పండించిన రైతులు జనవరి నెలాఖరుకు వచ్చినా అమ్మకానికి మొగ్గుచూపడం లేదు. మెరుగైన ధర కోసం వేచిచూస్తూనే ఉన్నారు. సుమారు 40 శాతం వరకు పత్తి ఇంకా రైతు గడప దాటలేదని మార్కెట్‌ వర్గాల అంచనా. దీంతో జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌, ఆయిల్‌ మిల్లులకు ముడిసరకు లభ్యత తగ్గింది. ఈ పరిస్థితి జౌళి పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అందోళన అందరిలో నెలకొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పత్తి పండించే రైతు నుంచి వస్త్రం తయారు చేసే టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ వరకు వరుసగా అన్నీ ఇబ్బందుల్లో కొనసాగుతున్నాయి.

సాధారణంగా పత్తి సీజన్‌ అక్టోబరుతో మొదలై జనవరి నాటికి దాదాపు 70శాతంపైగా మార్కెట్‌కు వస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఏడాది దిగుబడులు 3.30 కోట్ల బేళ్లు అంచనా కాగా, ఇప్పటివరకు మార్కెట్‌కు సుమారు 1.06 కోట్ల బేళ్లు మాత్రమే వచ్చాయి. మూడోవంతు పత్తి మాత్రమే మార్కెట్‌కు వచ్చింది. పత్తి రైతులు మెరుగైన ధరకు వేచిచూస్తున్నారు. నిల్వదారులు కూడా ఈ రంగంలోకి ప్రవేశించి రైతుల నుంచి కొనుగోలు చేసి మార్కెట్‌కు తరలించకుండా నిల్వచేశారు. దిగుబడులు కొంత తగ్గినా రైతులు, నిల్వదారులు వద్ద ఉన్న పత్తి పరిమాణం ఎక్కువగా ఉండటం గమనార్హం. పత్తి ధర సీజన్‌ ప్రారంభంలో క్వింటా రూ.10వేలకుపైగా ధర పలికింది. క్రమంగా ధర తగ్గుతూ ప్రస్తుతం క్వింటా సగటున రూ.7-8 వేల మధ్య నడుస్తోంది. ఈధరకు పత్తిని అమ్మడానికి రైతులు, నిల్వదారులు ఆసక్తి చూపడం లేదు. వేచిచూస్తే ధర పెరుగుతుందన్న భావనతో నిల్వ చేసుకుంటున్నారు.

ఎగుమతులు లేక  విలవిల

భారతదేశం నుంచి చైనాకు పత్తి, దారం ఎక్కువగా ఎగుమతి అవుతుంది. చైనాలో కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి మిల్లులు మూతపడి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మనదేశం నుంచి పత్తి, దారం దిగుమతి చేసుకోవడం లేదు. మనదేశం నుంచి అక్టోబరు నుంచి డిసెంబరు వరకు కేవలం 2లక్షల బేళ్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో మనదేశం ప్రత్యేక రకాలకు చెందిన పత్తి 4 లక్షల బేళ్లు దిగుమతి చేసుకుంది. లక్షల బేళ్లు ఎగుమతి కావాల్సిన సమయంలో నామమాత్రంగా కూడా ఎగుమతులు లేకపోవడం పత్తి ఆధారిత పరిశ్రమలకు శాపంగా మారింది. మరోవైపు అంతర్జాతీయంగా కూడా పత్తి ధరలు తగ్గుముఖం పట్టడం ఆందోళనకర పరిణామం. దేశీయంగా దారం నిల్వలు పేరుకుపోవడంతో లభ్యత పెరిగింది. అదే సమయంలో టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ తయారుచేస్తున్న వస్త్రానికి కూడా ఆశించినస్థాయిలో డిమాండ్‌ లేక దారం ధరలు తగ్గాయి. పత్తి ధర ఎక్కువగా ఉండటం, దారం ఎగుమతులు లేకపోవడంతో నూలు మిల్లులు పూర్తి స్థామర్థ్యంతో పనిచేయకుండా మూడు విడతల స్థానంలో ఒక విడత పనిచేస్తూ ఉత్పత్తి తగ్గించుకున్నాయి. కొన్ని మిల్లులు పూర్తిగా కొన్నాళ్లపాటు మూసేశారు. దేశీయంగా నూలు పరిశ్రమలు నెలకు 25వేల నుంచి 30లక్షల బేళ్ల వరకు దూది అవసరం. మిల్లులు పూర్తిస్థాయిలో పని చేయనందున వినియోగం తగ్గింది. మరోవైపు జిన్నింగ్‌ మిల్లుల యజమానులు క్యాండీ దూది ధర రూ.72వేలు ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా పత్తి కొనుగోలు చేసి బేళ్లు తయారు చేసి నిల్వలు పెట్టుకున్నారు.


అనూహ్యంగా క్యాండీ ధర రూ.62 వేలకు పతనం కావడంతో జిన్నింగ్‌ పరిశ్రమ కుదేలయింది. క్యాండీకి రూ.10వేల వరకు జిన్నర్లు నష్టాలు చవిచూశారు. దీంతో జిన్నర్లు పత్తి ధర తగ్గించడంతో రైతులు అమ్మకాలకు ఆసక్తి చూపడం లేదు. పత్తి నుంచి వస్త్రం వరకు అన్నింటికి డిమాండ్‌ పడిపోవడంతో ఎక్కడికక్కడ పత్తి ఆధారిత పరిశ్రమల్లో స్తబ్దత నెలకొంది. రైతు నుంచి వస్త్రం తయారీదారు వరకు అందరూ ఎన్నడూ లేని సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. ఎగుమతులు పుంజుకోకపోతే పత్తి ధరలు పెరిగే అవకాశం లేదని నూలు మిల్లు యజమాని ఒకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని