logo

తవ్వుకో.. సొమ్ము చేసుకో..!

మట్టికి ఉన్న డిమాండ్‌ వారికి కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వభూములు, చెరువు పొరంబోకు భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. చెరువు భూములతోపాటు సమీపంలోని పట్టాభూముల్లో మట్టి తవ్వకాలకు యజమానులతో ఒప్పందాలు చేసుకుని మట్టి తరలిస్తున్నారు.

Published : 29 Jan 2023 06:24 IST

అనుమతి లేకుండా మట్టి తరలింపు
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-ఫిరంగిపురం

పాత చెరువులో మట్టి తీసిన ప్రదేశం

ట్టికి ఉన్న డిమాండ్‌ వారికి కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వభూములు, చెరువు పొరంబోకు భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. చెరువు భూములతోపాటు సమీపంలోని పట్టాభూముల్లో మట్టి తవ్వకాలకు యజమానులతో ఒప్పందాలు చేసుకుని మట్టి తరలిస్తున్నారు. ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలో గుంటూరు-నరసరావుపేట రహదారి పక్కనే అక్రమంగా తవ్వకాలు చేస్తున్నా అధికారపార్టీ నేతలు కావడంతో యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఇదే అదనుగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది నిత్యకృత్యంగా మారింది. మట్టి మాఫియా ఆగడాలు భరించలేక కొందరు గ్రామస్థులు అక్కడక్కడ అడ్డుకుంటున్నా రాజకీయ నేతల అండతో నెట్టుకొస్తున్నారు.

డిమాండ్‌ ఆసరాగా..

ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలోని సర్వే నెంబర్‌ 491లో చెరువు పోరంబోకు స్థలం 6.65 ఎకరాలు ఉంది. ఇందులో 1.35ఎకరాలు గతంలో గ్రామానికి చెందిన మాజీ సైనికుడు ఒకరికి డీకే పట్టా మంజూరుచేశారు. గతేడాది చెరువును తాగునీటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని మట్టి మొత్తం విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఏడాది కిందట మట్టి తవ్వి తరలించినా ఇప్పటికీ తాగునీటి అవసరాలకు నీరు నిలిపి ఉపయోగించుకోలేదు. మట్టి తవ్వకాల తర్వాత వదిలేశారు. దీనిపక్కనే డీకే పట్టా భూమి ఉన్న రైతుతో ఒప్పందం చేసుకుని మట్టి తవ్వకాలు వారం కిందట ప్రారంభించారు. స్థానికంగా ఉన్న ఇద్దరు గ్రామస్థాయి అధికారపార్టీ నేతలు పొక్లయిన్లు పెట్టి మట్టి తవ్వి టిప్పర్ల ద్వారా నరసరావుపేట, బోయపాలెం, ఫిరంగిపురం తదితర ప్రాంతాలకు ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. నుదురుపాడు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మట్టి అవసరమున్నా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఒక్కో టిప్పరు మట్టిని దూరాన్ని బట్టి రూ.5వేల నుంచి రూ.6వేలకు అమ్ముతున్నారు. ఇప్పటికే వందల టిప్పర్ల మట్టిని తరలించారు. క్షేత్రస్థాయి రెవెన్యూఅధికారులు అడ్డుకున్నప్పుడు మాత్రం తవ్వకాలు ఆపేసి తర్వాత యథావిధిగా తవ్వకాలు చేస్తున్నారు. ప్రైవేటు వెంచర్లకు మట్టికి డిమాండ్‌ ఉండటం అక్రమార్కులకు కలసివస్తోంది. నిబంధనలకు నీళ్లొదిలి పొలాల మధ్య 8 అడుగులకుపైగా లోతుతో తవ్వకాలు చేస్తున్నారు. మట్టి కావాలని ఆర్డర్లు రావడమే ఆలస్యం ప్రభుత్వభూముల్లో రాత్రికి రాత్రే భారీ యంత్రాలు పెట్టి తవ్వకాలు చేసి మట్టి తరలిస్తున్నారు. నుదురుపాడు చెరువు ప్రధాన రహదారి పక్కనే ఉన్నా పగటివేళ కూడా తవ్వకాలు చేయడం గమనార్హం.


గనుల శాఖ ఆదాయానికి గండి

ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మట్టి తవ్వి తరలించాలంటే గనులశాఖకు క్యూబిక్‌మీటరుకు రూ.124లు రాయల్టీ చెల్లించాలి. గనులశాఖ నుంచి అనుమతి తీసుకుని పర్మిట్లు పొందకపోవడంతో రాయల్టీ చెల్లించకుండానే మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీంతో వేల క్యూబిక్‌మీటర్ల మట్టి అక్రమంగా తరలించడంతో గనులశాఖ రూ.లక్షల సొమ్ము పన్నుల రూపంలో ఆదాయాన్ని కోల్పోతోంది. దీనికితోడు రెవెన్యూ అధికారుల నుంచి కూడా అనుమతి లేదు. అనుమతులు తీసుకుంటే నిబంధనల ప్రకారం తవ్వకాలు చేయడంతోపాటు ప్రతి క్యూబిక్‌మీటరుకు పన్నులు చెల్లించాలి. అనుమతులు తీసుకోకుంటే పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించే సొమ్ము సైతం అక్రమార్కులు జేబులోకి వెళుతోంది. ఈవిషయమై గనుల శాఖ సహాయ సంచాలకులు రంగకుమార్‌ను వివరణ కోరగా నుదురుపాడులో మట్టి తవ్వకాలకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. క్షేత్రస్థాయిలో తవ్వకాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని