logo

కర్షకుడికి చేదోడు...

రైతులకు రసాయన ఎరువుల వాడకం ద్వారా పెట్టుబడి వ్యయం పెరిగి గిట్టుబాటు కాకపోవడంతో వాటి వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం పీఎం-ప్రణామ్‌ పథకాన్ని ప్రకటించింది.

Updated : 02 Feb 2023 05:44 IST

బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలతో సాగుకు మేలంటున్న  నిపుణులు

ఈనాడు-అమరావతి: రైతులకు రసాయన ఎరువుల వాడకం ద్వారా పెట్టుబడి వ్యయం పెరిగి గిట్టుబాటు కాకపోవడంతో వాటి వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం పీఎం-ప్రణామ్‌ పథకాన్ని ప్రకటించింది. ఇందులో ప్రకృతి సాగు ప్రోత్సహించడంలో భాగంగా కోటిమంది రైతులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రకృతి సాగు చేపట్టేవారికి ఇది ప్రయోజకరం. బయో ఇన్‌పుట్‌ రీసోర్స్‌ సెంటర్ల ఏర్పాటు వల్ల ప్రకృతి సాగుకు ఉత్పాదకాల లభ్యత పెరిగి సేంద్రీయసాగు పుంజుకోనుంది. సాగు పద్ధతులను ఆధునికీకరించే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించారు. దీంతో సాగు కొత్తపుంతలు తొక్కనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 48వేల మంది రైతులు ప్రకృతి సాగులో ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో 2లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతున్నందున రైతులకు ప్రయోజనకరం. మూడు జిల్లాల్లో ఉద్యానపంటల సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మనిర్భర్‌ హార్టికల్చర్‌ క్లీన్‌ ప్లాంట్‌ పథకం ద్వారా నాణ్యమైన మొక్కల లభ్యత పెరుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 164 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటిని కంప్యూటరైజ్డ్‌ చేయడానికి కేంద్రం నిధులు కేటాయించింది.


తిరుపతికి రైలు

రైల్వే బడ్జెట్‌కు నిధులను పెంచడంతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. వందేభారత్‌ రైలును సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడుపుతామని ప్రకటించిన నేపథ్యంలో ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ రైలు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల గుండా ప్రయాణిస్తుండటంతో మూడు జిల్లాల పరిధిలో ట్రాక్‌ అభివృద్ధి చేయడంతోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు రూ.6835 కోట్లు కేటాయించారు. మన జిల్లాలో మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్‌కు నిధులు రానున్నాయి. ఇప్పటికే ఇక్కడ వైద్యసేవలు అందుతుండగా మరిన్ని మెరుగైన సౌకర్యాల అభివృధ్ధికి నిధులు వెచ్చించనున్నారు.


యువతకు తోడ్పాటు  

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పురుషులతో పోల్చితే మహిళల జనాభా ఎక్కువ. కేంద్ర బడ్జెట్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో రూ.2లక్షల వరకు డిపాజిట్‌ చేసుకునే అవకాశం ఉండటం అతివలకు కలిసి వస్తోంది. యువత కోసం నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల నాణ్యమైన పుస్తకాల లభ్యత పెరిగి యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు, సాగులో స్టార్టప్‌లకు పెద్దపీట వేయడం, యువత నైపుణ్యాల వృద్ధికి నిధుల కేటాయింపు ద్వారా యువతకు ప్రోత్సాహం అందించనున్నారు. మూలధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు కేటాయించడంతో ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి.


మూలధన వ్యయానికి నిధులతో ఉపాధి

బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదులైన అవస్థాపనా సౌకర్యాల కల్పనకు మూలధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు కేటాయించడం వల్ల మౌలిక వసతులు కల్పన, రక్షణ రంగం బలోపేతమవుతుంది. తద్వారా ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేసినట్లయింది. ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్‌ వంటి వృత్తి విద్యాకోర్సులు నేర్చుకున్న యువత అనేకమంది ఉన్నారు. మరోవైపు సామాజిక సేవారంగాలను కూడా బడ్జెట్‌ విస్మరించలేదు. పల్నాడు జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో తీవ్రంగా ప్రబలి ఉన్న రక్తహీనతను తొలగించడానికి పథకాన్ని ప్రకటించారు. ఇంటర్మీడియట్‌ దాటి ఉన్నత చదువులు చదవలేని యువతులు నేడు నర్సింగ్‌ వంటి కోర్సుల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఇటువంటి వారికోసం వైద్యకళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలు స్థాపించ తలపెట్టడం వీరికి ఎంతో ప్రయోజనకరం.

బైరిశెట్టి మల్లికార్జునరావు, డైరెక్టర్‌, మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌


మధ్యతరగతికి వెసులుబాటు

మధ్యతరగతి ఆదాయం ఉన్నవారికి కొత్త పన్ను విధానం ఉపయోగకరంగా ఉంటుంది. పన్ను రిబేటు రూ.5 లక్షల నుంచి రూ.7లక్షలకు పెంచడం వల్ల చాలామంది పన్ను నుంచి మినహాయింపు తీసుకునే వెసులుబాటు లభించింది. రూ.2.5 లక్షలు మించితే పన్ను స్లాబులోకి వచ్చేవారు. కనీస ఆదాయపన్ను పరిమితి రూ.3 లక్షలకు పెంచడం చాలామందికి ఊరట కలిగించింది. రాబోయే రోజుల్లో ఆదాయం ఉన్న వారందరూ కొత్త పన్ను విధానంలోకి వచ్చే దిశగా అడుగులు వేశారు. ఆదాయపు పన్ను మదింపు కాలాన్ని 30 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించారు. దీని వల్ల పత్రాలన్నీ సక్రమంగా సమర్పించి మనకు సొమ్ము రావాల్సి ఉంటే 16 రోజుల్లో మన ఖాతాకు జమవుతుంది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10లక్షల కోట్లు కేటాయించడం వల్ల ప్రగతికి బాటలు పడతాయి. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు, వంతెనలు, ఇతర సౌకర్యాల కల్పనకు పెద్దఎత్తున ఇనుము, సిమెంట్‌, నిర్మాణ సామగ్రి వినియోగం పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. బడ్జెట్‌లో డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేశారు. ముఖాముఖి లేకుండా ఆన్‌లైన్‌లోనే సేవలు పొందే అవకాశాలు మెరుగుపడ్డాయి.

కె.వి.బ్రహ్మం, ఆడిటర్‌, గుంటూరు


కేటాయింపులు సరే..   పంపిణీ ఏదీ?

వ్యవసాయ రుణాలను బడ్జెట్‌లో రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడంతో రైతులకు కేటాయించిన రుణాలను కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కాగితాలపై కేటాయింపులు ఉన్నా ఆచరణలో ఆయా వర్గాలకు అందడం లేదు. రైతులకు తనఖా లేకుండా ఇచ్చే రుణాన్ని  రూ.1 లక్ష నుంచి రూ.1.60 లక్షలకు పెంచారు. అయితే బ్యాంకులు తనఖా లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణకు రూ.2516 కోట్లు కేటాయించినా ఆచరణలో ఉపయోగపడేలా నిధులను వెచ్చించినప్పుడే ప్రయోజనం కలుగుతుంది.  మొత్తం మీద కేంద్ర బడ్జెట్‌లో స్పష్టత లోపించింది. కేటాయింపులు కిందిస్థాయి చేరేలా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు లేకపోవడం దురదృష్టకరం.

యలమంచిలి శివాజీ, రాజ్యసభ మాజీ సభ్యుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని