logo

నిందితుల అరెస్టు కోరుతూ ఆందోళన

మండలంలో పెదలంక పరిధిలోని కృష్ణానదిలో అరవింద వారధికి సమీపంలోని ఇసుక మేటల్లో వారం రోజులుగా చింతల్లంకకు చెందిన దళితులు చేపట్టిన చెట్లు, తుప్పల తొలగింపు కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.

Published : 02 Feb 2023 05:07 IST

కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన చింతల్లంక దళితులు

కొల్లూరు, న్యూస్‌టుడే: మండలంలో పెదలంక పరిధిలోని కృష్ణానదిలో అరవింద వారధికి సమీపంలోని ఇసుక మేటల్లో వారం రోజులుగా చింతల్లంకకు చెందిన దళితులు చేపట్టిన చెట్లు, తుప్పల తొలగింపు కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ముగ్గురు దళితులకు స్వల్ప గాయాలయ్యాయి. తమపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ బుధవారం చింతల్లంకకు చెందిన దళితులు కొల్లూరులోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సుమారు గంట సేపు గడిచినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో టెంట్‌, వంట పాత్రలు అక్కడకు చేర్చి తమ డిమాండ్లు నెరవేరే వరకూ కదిలేది లేదంటూ భీష్మించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి, వారిపై  ఎస్సీ, ఎస్టీ వేధింపులు, హత్యాయత్నం సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని నినాదాలు చేస్తుండగా తహసీల్దార్‌ శ్రీనివాసరావుతో పాటు చుండూరు సీఐ కల్యాణరాజు అక్కడకు చేరుకున్నారు. దాడి చేసిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని డీఎస్పీ విచారించాల్సి ఉందని, ఎటువంటి ఆందోళనలు చేపట్టవద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కు తగ్గలేదు. తహసీల్దార్‌తో చర్చల అనంతరం సీఐ వారితో మాట్లాడారు. సీఐ బాధితులకు పూర్తి భద్రత కల్పించేందుకు పోలీసు పికెట్ల సంఖ్య పెంచుతామని, భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్‌ మాట్లాడుతూ దళితులు కోరుకుంటున్న భూములను నదీపరిరక్షణ శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా పరిశీలించి చట్ట ప్రకారం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య ఆందోళన కారులనుద్దేశించి మాట్లాడుతూ ఆందోళన విరమించాల్సిందిగా కోరారు. దీంతో బైఠాయింపు ముగిసింది. ఈ ఆందోళనకు వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తురుమెళ్ల కృష్ణమోహన్‌, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్‌, రైతు సంఘం నాయకుడు వేములపల్లి వెంకట్రామయ్య, ప్రజాసంఘాల నాయకులు బొనిగల సుబ్బారావు, శరత్‌, సుధాకర్‌, స్థానికులు ఇస్సాకు, లాజరు, చంటి నేతృత్వం వహించారు. ఎస్సై శామ్యూల్‌ రాజీవ్‌ కుమార్‌ తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.

అట్రాసిటీ కేసు నమోదు

కృష్ణానదిలో నదీపరిరక్షణ శాఖకు చెందిన భూములను సాగుకు అనుకూలంగా బాగు చేసుకునేందుకు వెళుతుండగా పెదలంకకు చెందిన ఉప్పు కృష్ణారావు, తోట సాంబశివరావుతో పాటు మరి కొంత మంది దాడి చేసి తోడేటి రవి, తోడేటి రాజేష్‌తో పాటు తననూ గాయపరిచారని చింతల్లంకకు చెందిన గుంటూరు ఏసోబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శామ్యూల్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. అడ్డగించిన వారిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా అకారణంగా తమను కొట్టారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

దాడిలో గాయపడి, తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న తోడేటి రాజేష్‌, తోడేటి రవి, గుంటూరు ఏసోబు నివాసాలకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర నాయకురాలు ధూళిపాళ్ల రమాదేవి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని