logo

బతుకులు బోల్తా

మహిళా కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో ప్రమాదానికి గురై, 26 మంది గాయపడిన సంఘటన అద్దంకి పట్టణ శివారు కలవకూరు రోడ్డులో బుధవారం  చోటుచేసుకుంది.

Published : 02 Feb 2023 05:07 IST

ట్రాలీ ఆటో ప్రమాదంలో 26 మంది మహిళా కూలీలకు గాయాలు

ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

సంఘటనా స్థలంలో క్షతగాత్రులు, బోల్తాపడిన ఆటో

అద్దంకి, న్యూస్‌టుడే: మహిళా కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో ప్రమాదానికి గురై, 26 మంది గాయపడిన సంఘటన అద్దంకి పట్టణ శివారు కలవకూరు రోడ్డులో బుధవారం  చోటుచేసుకుంది. అద్దంకి సీఐ ఎం.రోశయ్య అందించిన సమాచారం మేరకు.. మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన సుమారు 30 మంది మహిళా కూలీలు ట్రాలీ ఆటోలో ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల మిరపకాయల కోతకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అద్దంకి పట్టణం దాటిన తరువాత వారు ప్రయాణించే ట్రాలీ ఆటో ప్రమాదానికి గురైంది. ట్రాలీ ఆటో, మరో బండితో పోటాపోటీగా నడుపుతున్న కారణంగా ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో వేగం అదుపు కాక రోడ్డు అంచులోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాలీలో, క్యాబిన్‌లో ఉన్న కూలీలు ఒకరిపై మరొకరు పడటం, ట్రాలీ ఆటో పరికరాల కారణంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు 108 వాహనాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా గాయపడిన వల్లెపు నాగమ్మ, గుంజి వెంకాయమ్మలను మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిలోని క్షతగాత్రులను సీఐ ఎం.రోశయ్య, ఎస్సై ఆర్‌.ఆదిలక్ష్మి, సిబ్బంది పరిశీలించారు. టోల్‌గేటు రుసుం చెల్లించకుండా ఉండేందుకే అద్దంకి నుంచి వలపర్ల మీదుగా ద్రోణాదుల వెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమీపంలో అద్దంకి పురపాలక సంఘం మొదటి వార్డు కౌన్సిలర్‌ కొత్తగొర్ల వెంకటసుబ్బారావు(బాలు) ఇటుక బట్టీ ఉంది. తన బట్టీకి ఉన్న నిఘా కెమెరాలో సంఘటన నిక్షిప్తమై ఉంది. ఆ సమయంలో బట్టీ వద్ద ఉన్న ఆయన వెంటనే 108కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన బట్టీలోని యంత్రాలతో ట్రాలీ ఆటో క్యాబిన్‌లో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. 108 వాహనంలో ఎక్కించి వైద్యశాలకు తరలించేందుకు సహకారం అందించారు.

ఆసుపత్రిలో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ రోశయ్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని