logo

ప్రాణాలు పోతున్నా.. పాఠాలు నేర్వరా

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో చోటుచేసుకున్న విద్యుత్తు ప్రమాదంలో దర్శిత్‌ అనే బాలుడు మృతి చెందగా, నకరికల్లు మండల కేంద్రంలో ఎనిమిదేళ్ల గౌతమ్‌ విద్యుత్తు నియంత్రికను తాకి ప్రాణాలు పొగొట్టుకున్నాడు.

Published : 02 Feb 2023 05:07 IST

నకరికల్లులో గౌతమ్‌ని బలిగొన్న విద్యుత్తు  నియంత్రిక ఇదే..

నకరికల్లు, న్యూస్‌టుడే: ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో చోటుచేసుకున్న విద్యుత్తు ప్రమాదంలో దర్శిత్‌ అనే బాలుడు మృతి చెందగా, నకరికల్లు మండల కేంద్రంలో ఎనిమిదేళ్ల గౌతమ్‌ విద్యుత్తు నియంత్రికను తాకి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. అధికారుల నిర్లక్ష్యానికి ఈ సంఘటనలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. కరెంటు తీగలు చిన్నారులను బలి తీసుకుంటున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల బాలుడు ఎంత ఎత్తు ఉంటాడు.. ఆ బాలుడినే తాకేంత ఎత్తులో తీగలు ఉన్నాయంటే ప్రమాదమే కదా.. నకరికల్లులో ఎన్నెస్పీ కాలనీలో ప్రాథమిక పాఠశాలకు అనుకునే ఉన్న విద్యుత్తు నియంత్రిక గౌతమ్‌ పాలిట యమపాశమైంది. సదరు నియంత్రికను తొలగించాలని ఏళ్ల తరపడి విన్నవించినా పట్టించుకోలేదు. అప్పుడే స్పందించి ఉంటే చిన్నారి గౌతమ్‌ దూరమయ్యేవాడు కాదు.. బిడ్డతో పాటు తమ జీవితాలూ తలకిందులయ్యాయని ఆ దంపతులు రోదిస్తున్న తీరు హృదయాన్ని ద్రవింపజేస్తోంది. విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పొయిన గౌతమ్‌ 13 రోజులు పాటు మృత్యువుతో పోరాడినా ప్రాణం దక్కలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. పాఠశాలలో విద్యుత్తు నియంత్రిక తక్కువ ఎత్తులో ఉండటంతో పాటు నేలను తాకుతూ ఫ్యూజ్‌ బాక్సులు ఉన్నాయి. తాజాగా నియంత్రిక ఒక పక్కకు వరిగిపోయి ఉంది. ప్రాణాలు పోతున్నా గుణపాఠం నేర్వడం లేదని, విద్యుత్తు అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. నియంత్రికను తొలగించాలని స్థానికులు, ఉపాధ్యాయుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గౌతమ్‌ మృతి చెందాడంటూ నకరికల్లు రాష్ట్రీయ రహదారిపై భౌతికకాయంతో ధర్నా చేపట్టిన విషయం విదితమే. తాజాగా నియంత్రిక పక్క నుంచే పాఠశాలకు రోజూ వెళ్లి వచ్చే క్రమంలో పిల్లలు భయంభయంగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరో ప్రమాదం తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆసుపత్రిలో గౌతమ్‌(పాత చిత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని