logo

తొలగని భయం

సత్తెనపల్లి మండల పరిధి రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల బాలికల విద్యాలయంలో బుధవారం తరగతులు జరగలేదు. సోమవారం 206 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవగా, గురుకులంలో మిగిలిన విద్యార్థినుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

Published : 02 Feb 2023 05:23 IST

గురుకులంలో తెరచుకోని తరగతి గదులు

బాలికలను తీసుకురాని తల్లిదండ్రులు

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులతో మాట్లాడుతున్న  మంత్రి అంబటి రాంబాబు

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే : సత్తెనపల్లి మండల పరిధి రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల బాలికల విద్యాలయంలో బుధవారం తరగతులు జరగలేదు. సోమవారం 206 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవగా, గురుకులంలో మిగిలిన విద్యార్థినుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అదే రోజు రాత్రి వారి పిల్లలను ఇంటికి తీసుకుపోయారు. ఈ పరిణామాలతో మంగళవారం గురుకులానికి జిల్లా కలెక్టరు ప్రత్యేక సెలవు ప్రకటించారు. బుధవారం తరగతులకు బాలికలు హాజరు కావాలని సూచించారు. అయితే విద్యార్థినులు గురుకులానికి బుధవారం చేరుకోలేదు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత బాలికలను గురుకులానికి పంపాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో బుధవారం గురుకులంలో తరగతి, వసతి గదులు వెలవెలబోయాయి. ఇదిలా ఉండగా అధికారుల సూచనల మేరకు ఆవరణలో పారిశుద్ధ్య చర్యలు మొదలయ్యాయి. పనికిరాని మొక్కలు, ముళ్లకంప తొలగింపు చర్యలను చేపట్టారు. మురుగునీటి పారుదల పనులు జరుగుతున్నాయి. భోజనశాలలోని తాగు నీటి శుద్ధి యంత్రం మరమ్మతులకు నిధులు లేకపోవడంతో ఉపాధ్యాయినులు సొంత నగదుతో మరమ్మతులు చేయించేందుకు సిద్ధమవుతున్నారు.

కొనసాగుతున్న వైద్య సేవలు

బాలికల్లో 32 మంది మూడ్రోజులుగా వైద్య చికిత్స పొందుతున్నారు. గుంటూరులోని సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న ఏడుగురు బాలికల్లో ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరో 25 మంది సత్తెనపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకట్రావు తెలిపారు. వారిలో ముగ్గురికి స్వల్పంగా జ్వరం ఉందన్నారు. వాంతులు, విరేచనాల వల్ల నీరసించిన కొందరిలో వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల వేగంగా కోలుకోలేకపోతున్నారని అన్నారు. అందరి ఆరోగ్యాన్ని పిల్లల వైద్యులు, సాధారణ వైద్యులు 24 గంటలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. గురువారం సాయంత్రానికి అందరినీ డిశ్ఛార్జి చేసే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

సిలబస్‌ పూర్తిపై దృష్టి

రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ డిప్యూటీ కార్యదర్శి సంజీవరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా సమన్వయకర్త శాంతి విశాల గురుకులాన్ని సందర్శించారు. ప్రిన్సిపల్‌ స్వర్ణకుమారి, ఉపాధ్యాయ బృందంతో సమావేశం నిర్వహించారు. బాలికలు ఇళ్లకు వెళ్లిన నేపథ్యంలో తరగతులు జరగడం లేదని, సిలబస్‌ పూర్తికి ఆటంకం ఏర్పడుతోందని గుర్తించారు. తిరిగి తరగతులు పున:ప్రారంభం కాగానే ప్రత్యేక చొరవతో సిలబస్‌ పూర్తిపై దృష్టి సారించాలని సూచించారు.


బాలికలకు పరామర్శ

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాలికలను బుధవారం రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని విద్యార్థినులను ఆరా తీశారు. సంపూర్ణ ఆరోగ్యంతోనే ఇంటికి వెళ్లాలని అప్పటివరకు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందుకోవాలని వారికి సూచించారు. ఏపీవీపీ డీసీ డాక్టర్‌ బీవీ రంగారావు ఆసుపత్రిని సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న వైద్య సేవల్ని పర్యవేక్షించారు. విద్యార్థినులందరూ పూర్తిగా కోలుకున్నారని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని