logo

మరమ్మతులకూ దిక్కులేదు!

గుంటూరు నగరంలో 40కి పైగా మురికివాడలు, పది విలీన గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు తాగు, వాడక అవసరాలకు ఇప్పటికీ చేతి పంపులపైనే ఆధారపడుతున్నారు.

Published : 02 Feb 2023 05:07 IST

వందల సంఖ్యలో పాడైన చేతిపంపులు
విలీన గ్రామాలు, మురికివాడల్లో జనం అవస్థలు

ఏటుకూరులో పనిచేయని చేతి పంపు

ఈనాడు, అమరావతి: గుంటూరు నగరంలో 40కి పైగా మురికివాడలు, పది విలీన గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు తాగు, వాడక అవసరాలకు ఇప్పటికీ చేతి పంపులపైనే ఆధారపడుతున్నారు. ఈ పంపులు కొన్నిచోట్ల పని చేయడం లేదు. ఏకంగా ఏడెనిమిది నెలల నుంచి అవి పునరుద్ధరణకు నోచుకోకపోయినా యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

విలీన గ్రామాల్లో సమస్యలంటే నగరపాలక యంత్రాంగానికి అన్నింటా చిన్నచూపేనని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ప్రతి విలీన గ్రామంలో చేతి పంపులు చాలా వరకు పనిచేయడం లేదు. నగరంలో పేదలు అధికంగా నివాసం ఉండే కేవీపీకాలనీ, పాతగుంటూరు, నందివెలుగురోడ్‌, పొన్నూరు రోడ్‌, గూండారావుపేట, నగరంపాలెం, నల్లచెరువు, గోరంట్ల, రెడ్డిపాలెం, శారదాకాలనీ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తాము ఈ చేతి పంపు నీటితోనే అన్ని అవసరాలు తీర్చుకుంటామని, వాటికే మరమ్మతులు నిర్వహించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేటర్లు, ఇంజినీరింగ్‌ అధికారులకు విన్నవించుకున్నా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడం తప్ప వాటికి అవసరమైన విడిభాగాలు వేసి వినియోగంలోకి తేవడం లేదు. దీంతో తాము ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసుకుని అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.

మూడేళ్ల క్రితం డమ్మీ చేసి...

మూడేళ్ల క్రితం నగరానికి నీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతి ఒక్కరూ కొళాయి కనెక్షన్‌ తీసుకోవాలని చెప్పి చేతి పంపులను డమ్మీ చేశారు. దీనిపై స్థానికులు, విపక్షాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో అలా డమ్మీ చేసిన పంపులను తిరిగి పునరుద్ధరించారు. అవి ఇప్పుడు కొన్ని రకాల విడిభాగాలు లేక మొరాయించాయి. పాడైన చేతిపంపులు నగరపాలక మొత్తం మీద వందకు పైగా ఉంటాయని అంచనా. పరికరాల కోసం ఇండెంట్లు పంపామని, అవి ఇంకా రాలేదని ఎప్పుడు అడిగినా ఇదే మాట చెబుతున్నారని ఆయా ప్రాంతాల వాసులు అంటున్నారు. ప్రధానంగా విలీన గ్రామాల్లో ప్రజలు నీళ్ల కోసం వ్యవసాయ భూముల్లోని పవర్‌ బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు.
దీనిపై నగరపాలక ఇంజినీరింగ్‌ అధికారులను వివరణ కోరగా ప్రతి డీఈ పరిధిలో చేతి పంపులు ఎక్కడ పాడైనా పునరుద్ధరించుకోవడానికి అవసరమైన సామగ్రి ఉందని, ఏవైనా విడిభాగాలు లేకపోతే వాటిని ఆయా కంపెనీల నుంచి ఇండెంట్‌ పెట్టి సేకరించుకోవాలని సూచించామని ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి. ప్రతి ఏఈ, డీఈ వెంటనే ఈ చేతి పంపులను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశిస్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని