logo

సౌరవిద్యుత్తుకు ని‘బంధనాలు’!

సంప్రదాయేతర ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుని విద్యుత్తు తయారీకి కేంద్రం ప్రోత్సాహం అందిస్తున్నా విద్యుత్తు సంస్థల నుంచి తగినంత సహకారం అందడం లేదు.

Published : 02 Feb 2023 05:25 IST

కేంద్ర రాయితీని ఉపయోగించుకోలేని వైనం

ఇళ్లపై అమర్చిన సౌరఫలకలు

ఈనాడు-అమరావతి: సంప్రదాయేతర ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుని విద్యుత్తు తయారీకి కేంద్రం ప్రోత్సాహం అందిస్తున్నా విద్యుత్తు సంస్థల నుంచి తగినంత సహకారం అందడం లేదు. గృహాలపై సౌరపలకలు అమర్చుకుని విద్యుత్తు ఉత్పత్తికి పలువురు ఆసక్తి చూపుతున్నా దరఖాస్తు నుంచి నెట్‌మీటర్ల ఏర్పాటు వరకు ప్రతిదశలోనూ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఇటీవల సౌరవిద్యుత్తు విధానంలో విద్యుత్తుశాఖ తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులకు ఇబ్బందికరంగా పరిణమించింది. దీంతో గృహాలపై సౌరపలకాలు ఏర్పాటుచేసుకోవడానికి పలువురికి ఆసక్తి ఉన్నా మారిన మార్గదర్శకాలతో వారు ముందుకు రావడం లేదు.

పర్యావరణ హితం... సొమ్ము ఆదా: గృహాల పైకప్పులపై సౌరపలకలు ఏర్పాటుచేసుకోవడం ద్వారా రోజువారీగా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇది పర్యావరణ హితం కావడంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్రం 20 నుంచి 40శాతం వరకు రాయితీ అందిస్తోంది. రోజురోజుకు విద్యుత్తు ఛార్జీల భారం అధికమవుతుండడంతో పలువురు ఇళ్ల పైభాగంలో సౌరఫలకలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని ద్వారా వచ్చే విద్యుత్తును తమ అవసరాలకు వాడుకుని, మిగిలింది గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల ఎంత విద్యుత్తును బయటకు పంపుతున్నారో, ఆమేరకు యూనిట్‌కు నిర్దేశించిన మొత్తాన్ని డిస్కమ్‌ చెల్లిస్తుంది.  ఈ వ్యవస్థ ఏర్పాటుకు తొలుత వ్యయం ఎక్కువ అవుతున్నా.. విద్యుత్తు బిల్లులో నెలవారీగా తగ్గుదల, విద్యుత్తు మిగిలితే రాబడి వస్తుండడంతో నిర్వహణ వ్యయం తగ్గుతోంది. ఒకసారి అమర్చుకుంటే 25ఏళ్లపాటు ప్రయోజనం పొందే వెసులుబాటు ఉన్నందున ధీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు.

నిబంధనల మార్పుతో భారీ తేడా

సౌరఫలకలు ఏర్పాటుచేసుకుని విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేవారికి ఇప్పటివరకు ఒక విధానం అమలుచేశారు. వినియోగించిన విద్యుత్తు, ఉత్పత్తి అయిన సౌరవిద్యుత్తు యూనిట్లు పరిగణనలోకి తీసుకుని ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువ ఉంటే ఆ తేడాకు బిల్లు వసూలుచేసేవారు. ఉత్పత్తికి, వినియోగానికి ఉన్న యూనిట్ల సంఖ్య ఆధారంగా ఆయా స్లాబు మేరకు సొమ్ము వసూలుచేసేవారు. తాజాగా మారిన మార్గదర్శకాల ప్రకారం నెలవారీగా వినియోగించిన యూనిట్ల ఆధారంగా ఏస్లాబు పరిధిలోకి వస్తే ఆస్లాబు యూనిట్‌ ధర ఆధారంగా సొమ్ము నిర్ణయిస్తారు. సౌరవిద్యుత్తు ఉత్పత్తి ఆయిన యూనిట్లకు యూనిట్‌కు రూ.3.70లు చొప్పున లెక్కించి ఆమొత్తాన్ని బిల్లులో తగ్గించి మిగిలిన సొమ్ము వసూలుచేస్తారు.

అడుగడుగునా ఆటంకాలే...

ఇళ్లపై సౌరఫలకలు ఏర్పాటుచేసుకుని విద్యుత్తు తయారీకి ఆన్‌లైన్‌లో విద్యుత్తుశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలన్నా సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. దరఖాస్తులు పూర్తిచేసి అప్‌లోడ్‌ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయి సౌరపలకలు ఏర్పాటుచేసుకున్న తర్వాత ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు, గ్రిడ్‌కు ఎంత మేర వెళ్తోంది అన్నది నెట్‌ మీటరు ద్వారా తెలుస్తుంది. దీని కోసం దరఖాస్తు చేసుకుంటే విద్యుత్తు శాఖ అందజేస్తుంది. ప్రస్తుతం విద్యుత్తుశాఖ వద్ద మీటర్లు అందుబాటులో లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో కొనుక్కోమని అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో మీటరు కొనుగోలు చేయాలంటే విద్యుత్తు అధికారుల అనుమతి అవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని