logo

అంతర్‌ జిల్లాల దొంగ అరెస్టు

డిగ్రీ చదివి మద్యానికి బానిసై దొంగగా మారిన అంతర్‌ జిల్లాల నేరస్థుడిని కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు.

Published : 02 Feb 2023 05:07 IST

13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

వివరాలు తెలుపుతున్న డీఎస్పీ సీతారామయ్య, చిత్రంలో సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సైలు మీరజ్‌, శ్రీనివాసరావు, మధుపవన్‌

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే : డిగ్రీ చదివి మద్యానికి బానిసై దొంగగా మారిన అంతర్‌ జిల్లాల నేరస్థుడిని కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు. బుధవారం పోలీసుస్టేషన్‌లో నిందితుడి వివరాలను సీఐ శ్రీనివాసులురెడ్డితో కలిసి తూర్పు డీఎస్పీ సీతారామయ్య తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సర్వేపల్లి అంకమ్మరావు డిగ్రీ చదువుకున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేశాడు. కుటుంబ సభ్యులతో స్పర్థలు రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ద్విచక్ర వాహనాలు చోరీ చేసి, వాటిని అమ్ముకొని జల్సాలు చేయడానికి అలవాటుపడ్డాడు. గత మూడేళ్లుగా చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరులో 20 వాహనాలు తస్కరించిన కేసుల్లో జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద రోగులకు పెడుతున్న ఉచిత భోజనం తింటూ రోడ్లపై జీవిస్తున్నాడు. రోడ్లపై పారేసిన అరిగిపోయిన తాళాలు తీసుకొని వాటితో రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరించేవాడు. పది రోజుల్లో 13 వాహనాలు చోరీ చేశాడు. ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఆదేశాలతో తూర్పు డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై మీరజ్‌ నిందితుడిపై నిఘా పెట్టారు. సీఐ, ఎస్సైలతోపాటు ఏఎస్సై ఆంథోనీ, సిబ్బంది దాసు, సురేష్‌లు బుధవారం మాయబజార్‌లో గాలింపు చేపట్టారు. ఓ వాహనాన్ని తస్కరించి విక్రయించడానికి తీసుకు వెళుతున్న క్రమంలో అంకమ్మరావును అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద రూ.9 లక్షలు విలువ చేసే 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

స్వాధీనం చేసుకున్న వాహనాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని