logo

మారువేషం కట్టి.. గంజాయి విక్రేతను పట్టి...

గంజాయి విక్రయ ముఠాను పట్టుకోవడానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (సెబ్‌) పోలీసులు మారువేషం కట్టారు.

Published : 02 Feb 2023 05:07 IST

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ సుప్రజ, చిత్రంలో ఈఎస్‌ అన్నపూర్ణ,

ఏఈఎస్‌ మణికంఠ, సీఐలు నారాయణస్వామి, రమేష్‌

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : గంజాయి విక్రయ ముఠాను పట్టుకోవడానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (సెబ్‌) పోలీసులు మారువేషం కట్టారు. మాసిన దుస్తులు, చింపిరి జుత్తుతో తిరుగుతూ ముఠాలోని ఇద్దరిని గుర్తించి పట్టుకునే క్రమంలో ఒకరు దొరకగా, మరొకరు పరారయ్యాడు. నిందితుడి నుంచి రూ.నాలుగు లక్షల విలువ చేసే 676 గ్రాముల గంజాయి ద్రవం డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు 2 పోలీసుస్టేషన్‌లో బుధవారం నిందితుల వివరాలను ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.అన్నపూర్ణతో కలిసి సెబ్‌ జిల్లా ఇన్‌ఛార్జి ఏఎస్పీ కె.సుప్రజ తెలిపారు. గుంటూరులో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని సెబ్‌ బృందం సీఐ టీపీ నారాయణస్వామి సమాచారం సేకరించారు. దీంతో నారాయణస్వామితోపాటు సెబ్‌-2 ఇన్‌ఛార్జి సీఐ రమేష్‌లు తమ బృందంతో నగరంలో తనిఖీలు చేపట్టారు. పోలీసుల రాక పసిగడుతున్న నిందితులు ప్రతిరోజూ మకాం మారుస్తున్నారు. దీంతో సెబ్‌ పోలీసులు గంజాయి తాగే వారిలా, మాసిన దుస్తులు వేసుకొని మారువేషంలో గుంటూరులోని పలకలూరిరోడ్డులో కొంత నగదు ఇచ్చి నిందితుల వద్ద గంజాయి కొనుగోలు చేశారు. మరో బృందాన్ని పంపించి ఆ ముఠాను పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితుల్లో ఒకరు పరారయ్యాడు. మరొకరిని పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన తాజుద్దీన్‌ అలియాస్‌ రోలెక్స్‌ ఆ ముఠాకు కీలకమని గుర్తించారు. 19 ఏళ్ల వయసులో అతను ఇటీవల విడుదలైన సినిమాల్లోని హీరోల పేరును నిక్‌నేమ్‌గా పెట్టుకొని గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఇంటర్‌ చదువు మధ్యలో ఆపేసి, చెడు స్నేహాలతో గంజాయి తాగడానికి అలవాటు పడి క్రమేణా వైజాగ్‌, అరకు నుంచి లిక్విడ్‌ గంజాయి తెచ్చి గుంటూరులో విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. తాజుద్దీన్‌తో కలిసి గంజాయి విక్రయిస్తున్న వెంకటేశ్వర్లును పట్టుకున్నారు. తాజుద్దీన్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని