logo

‘పల్నాడును ఫ్యాక్షన్‌ రాజకీయాలకు అడ్డాగా మార్చేశారు’

తెదేపా హయాంలో ప్రశాంతంగా ఉన్న పల్నాడును వైకాపా ప్రభుత్వం ఫ్యాక్షన్‌ రాజకీయాలకు అడ్డాగా మార్చేసిందని, తుపాకీ సంప్రదాయం తీసుకువచ్చిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ విమర్శించారు.

Published : 03 Feb 2023 04:43 IST

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: తెదేపా హయాంలో ప్రశాంతంగా ఉన్న పల్నాడును వైకాపా ప్రభుత్వం ఫ్యాక్షన్‌ రాజకీయాలకు అడ్డాగా మార్చేసిందని, తుపాకీ సంప్రదాయం తీసుకువచ్చిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఇంట్లో నిద్ర పోతున్న నరసరావుపేట తెదేపా నాయకుడు వెన్నా బాలకోటిరెడ్డిపై వైకాపా నాయకులు కాల్పులు జరిపారంటే రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఎంతగా క్షీణించాయో అర్థమవుతుంది. పోలీసులు ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు తప్ప అనాగరిక చర్యలకు పాల్పడుతున్న వైకాపా నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్‌ ప్రభుత్వం పల్నాడును ఫ్యాక్షన్‌ రాజకీయాలకు అడ్డాగా మారుస్తుంది. బాలకోటిరెడ్డిని ఇంట్లో నుంచి బయటకు లాగి కాల్పులు జరిపారంటే వైకాపా గూండాలు ఎంతగా బరితెగించారో తెలుస్తుంది. గతంలో కత్తులతో దాడి జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. అందుకే ఇప్పుడు ఏకంగా కాల్పులు జరిపారు. పల్నాడులో జరుగుతున్న ప్రతి హత్య వెనుక వైకాపా నేతలకు జిల్లా ఎస్పీ అండదండలు ఉన్నాయి. బాలకోటిరెడ్డిపై జరిగిన కాల్పులకు జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలి. జగన్‌ పాలనలో హోం శాఖ ప్రజల కోసం పని చేయడం లేదు. వైకాపా నేతల చెప్పు చేతల్లోకి వెళ్లిపోయింది. ఎస్పీ కనుసన్నల్లోనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి’.. అని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని