logo

ఏళ్లుగా సాగతీత

తెనాలి నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బస్టాండ్‌ నుంచి ఆటో నగర్‌ వరకు 2.3 కిలో మీటర్ల పరిధిలో రోడ్డు విస్తరణ, రెండు వైపులా కాలువల అంచుల వెంబడి గోడలు..

Updated : 03 Feb 2023 05:06 IST

తెనాలి నాలుగు వరుసల రోడ్డు పనుల తీరు

కాలువ అంచుల వెంట సగంలో ఆగిన గోడ నిర్మాణం

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: తెనాలి నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బస్టాండ్‌ నుంచి ఆటో నగర్‌ వరకు 2.3 కిలో మీటర్ల పరిధిలో రోడ్డు విస్తరణ, రెండు వైపులా కాలువల అంచుల వెంబడి గోడలు, కాలి నడక వంతెనలు, విభజన గోడలు వెరసి రెండు విభాగాలుగా రూ.36 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు 2018లో మొదలై నేటికీ పూర్తి కాలేదు. తెనాలి నుంచి మంగళగిరి మీదుగా విజయవాడ వైపు వెళ్లటానికి, ఇటు నందివెలుగు మీదుగా గుంటూరు చేరడానికి ఇదే ప్రధాన మార్గం. పారిశ్రామిక వాడ నుంచి ఉత్పత్తుల రవాణాతో పాటు జనం రాకపోకలకు ఈ మార్గమే కీలకం. సంవత్సరాలుగా పనులు కొనసాగుతూ ఉండడంతో రోడ్డు సరైన విధంగా లేక అనేక ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాపాయాలు కూడా సంభవించాయి. రోడ్ల మీద ఉన్న భారీ గుంతలను అధిగమించడానికి వాహనాలు ఒక్కసారిగా పక్కకు వస్తూ ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు పనులు ఆలస్యం కావడంతో విస్తరణ ప్రాంతాల్లో గడ్డి మొలచి వాటి కోసం పశువులు చేరుతున్నాయి. అసంపూర్తిగా ఉన్న కాలి నడక వంతెనలపై పిచ్చిచెట్లు పైకి రాగా, ఇప్పటి వరకు పనులు జరిగిన వంతెనపై నుంచి టైల్స్‌ అప్పడే కిందకు జారుతున్నాయి. వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ప్రజల వెతలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.

రోడ్డు విస్తరణ చేయాల్సిన ప్రాంతంలో గడ్డి తింటున్న పశువులు


త్వరలో పూర్తి చేయిస్తాం
- నాగేశ్వరరావు, రోడ్లు, భవనాల శాఖ, డీఈ

రోడ్డు పనులు కొంత ఆలస్యం అయిన విషయం వాస్తవమే. త్వరలోనే పనులు చేపట్టి పూర్తి చేస్తాం. ఇప్పటికే ఈ విషయంపై గుత్తేదారులతో మాట్లాడాం. రూ.36 కోట్ల పనుల్లో ఇప్పటి వరకు సుమారు రూ.20 కోట్ల పనులు జరిగాయి. మిగిలినవి కూడా అతి త్వరలో పూర్తి చేయిస్తాం. ఫుట్పాత్‌లపై నుంచి టైల్స్‌ జారిపోయిన ప్రాంతాల్లో వాటిని సరి చేయిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని