logo

వేడుక ఇంట విషాదం

వైభవంగా నిశ్చితార్థ వేడుకులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్క నిశ్చితార్థానికి కేకు తీసుకొచ్చేందుకు వరుసకు తమ్ముడు, మరో బంధువు కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

Published : 03 Feb 2023 05:03 IST

కేకు తెచ్చేందుకెళ్తూ ఒకరి దుర్మరణం

వినయ్‌ (పాతచిత్రం)

మేడికొండూరు, న్యూస్‌టుడే: వైభవంగా నిశ్చితార్థ వేడుకులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్క నిశ్చితార్థానికి కేకు తీసుకొచ్చేందుకు వరుసకు తమ్ముడు, మరో బంధువు కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. దారిలో వెళ్తుండుగా మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తమ్ముడు మృతి చెందగా మరో యువకుడుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన మేడికొండూరు మండలంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని పొట్లపాడుకు చెందిన వినీలకు వివాహం కుదిరింది. గురువారం ఉదయం నిశ్చితార్థ వేడుక నిర్వహించేందుకు అందరూ సిద్ధమయ్యారు. వినీల బాబాయ్‌ కుమారుడు వినయ్‌ చేబ్రోల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. వారి బంధువు సత్తెనపల్లి పట్టణానికి చెందిన జెట్టి శివభధ్రినాథ్‌ మేడికొండూరు మండలం ఎన్‌ఆర్‌ఐఐటీ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిశ్చితార్థం సందర్భంగా కేకు తెచ్చేందుకు వినయ్‌, శివభద్రినాథ్‌ ఇద్దరూ కలిసి పొట్లపాడు నుంచి ద్విచక్ర వాహనంపై పేరేచర్ల బయలుదేరారు. అదే సమయంలో గ్రామంలోని జగనన్న కాలనీ లేఔట్‌కు మట్టి తీసుకెళ్లే టిప్పర్‌ మలుపు తిరుగుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ కింద పడ్డారు. వినయ్‌పై టిప్పర్‌ వెనుక చక్రాలు ఎక్కాయి. శరీర అవయవాలు దెబ్బతినడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివభధ్రినాథ్‌ తలకు తీవ్ర గాయమైంది. అదే సమయలో అటుగా వస్తున్న మేడికొండూరు సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌ ప్రమాదాన్ని చూశారు. చికిత్స నిమిత్తం శివభద్రినాథ్‌ను సిబ్బంది సాయంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


కారు, ఆటో ఢీకొని 15 మందికి గాయాలు

అమృతలూరు: ఇంటూరు లాకుల కూడలిలో గురువారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్న ఘటనలో 15మందికి గాయాలయ్యాయి. పిట్టలవానిపాలెం మండలం అలకావారిపాలెం గ్రామపంచాయతీ శివారు మండేవారిపాలెం గ్రామస్థులు వైద్యశాలలో చికిత్స పొందుతున్న తమ బంధువును పరామర్శించేందుకు ఆటోలో పొన్నూరు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లాకు కూడలి సమీపంలోకి రాగానే చందోలు నుంచి తెనాలి వైపు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు ఆటోలో డ్రైవర్‌ నాంచారయ్యతో సహా 13మందికి గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణికులను కొండ్రు మరియమ్మ, రజని, లలితకుమారి, మేకల సుజాత, కమలమ్మ, జోగి స్వరూపరాణి, మార్పు మేరిమ్మ, గద్దె స్వరూపరాణి, జూపూడి రమేష్‌, సారమ్మ, ప్రియాంక, పార్లి జయమ్మకు రక్తగాయాలయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు