logo

పూర్తిగా కోలుకున్నాకే డిశ్ఛార్జికి ఆదేశం

కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైన బాలికల ఆరోగ్యం పూర్తిగా తగ్గుముఖం పట్టాకే వారిని ఇంటికి పంపాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కలపాల రత్నకుమార్‌ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

Published : 03 Feb 2023 05:03 IST

విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న న్యాయసేవాధికార

సంస్థ సీనియర్‌ సివిల్‌ జడ్జి రత్నకుమార్‌, చిత్రంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తదితరులు

ఈనాడు-అమరావతి: కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైన బాలికల ఆరోగ్యం పూర్తిగా తగ్గుముఖం పట్టాకే వారిని ఇంటికి పంపాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కలపాల రత్నకుమార్‌ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆస్పత్రిలో రోగుల రద్దీ ఉందని తొందరపడి డిశ్ఛార్జి చేయరాదని స్పష్టం చేశారు. గతనెల 30న సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో వంద మందికి పైగా బాలికలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఏడుగురి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వారిని జీజీహెచ్‌కు తరలించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఆ బాలికలకు అందుతున్న వైద్యసేవలు, అసలు సమస్యకు కారణాలేమిటో తెలుసుకునేందుకు గురువారం ఆయన జీజీహెచ్‌కు వచ్చారు. నేరుగా పిల్లలు చికిత్స  పొందుతున్న వార్డుకు వెళ్లి బాధిత విద్యార్థినులతో మాట్లాడారు. బాలికల నుంచి నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. వసతిగృహాల్లో చదివే పేద పిల్లలే కదా అని వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. వారికి అత్యాధునికమైన వైద్యం అందించి త్వరితంగా కుదుటపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలకు అందించిన వైద్యం వివరాలు ప్రతిదీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు తెలియజేస్తానని అధికారులకు స్పష్టం చేశారు. వైద్యసేవలు లోపించాయని భావిస్తే తమ దృష్టికి తీసుకురావాలని తల్లిదండ్రులను కోరారు. అనంతరం సత్తెనపల్లి ఆస్పత్రి, బాలికలు చదివే గురుకుల విద్యాలయాన్ని సందర్శించి పిల్లలు అనారోగ్యం పాలవటానికి కారణాలను సేకరించారు. జడ్జి వెంట ప్యానల్‌ అడ్వకేట్‌, పీపీ కట్టా కాళిదాస్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని