logo

పట్టణ ప్రణాళిక ప్రక్షాళన ఎప్పుడో..!

నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షించే ప్రకటనల బోర్డుల అనుమతి, ఛార్జీల వసూలులో ఏళ్ల తరబడి అవినీతి చోటుకోవడంతో ప్రజాధనం కొందరు అధికారులు, ప్రైవేటు ఏజన్సీదారుల జేబుల్లోకి వెళ్లిపోయింది.

Published : 03 Feb 2023 05:25 IST

నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమాలు

కలెక్టరేట్‌ రోడ్డులో డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన బోర్డులు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షించే ప్రకటనల బోర్డుల అనుమతి, ఛార్జీల వసూలులో ఏళ్ల తరబడి అవినీతి చోటుకోవడంతో ప్రజాధనం కొందరు అధికారులు, ప్రైవేటు ఏజన్సీదారుల జేబుల్లోకి వెళ్లిపోయింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలోనే ప్రకటన ఛార్జీల ఆదాయం జీఎంసీకి దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు ఉండేది. తర్వాత ఎన్నో మార్పులు జరిగి గుంటూరు రాష్ట్ర రాజధాని ప్రాంతంలో అంతర్భాగమైనా ప్రకటనల ఆదాయం మాత్రం ఆశించిన మేరకు పెరగ లేదు. కొందరు పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసిన అధికారులు ప్రైవేటు ఏజన్సీల యజమానులకు అనుకూలంగా వ్యవహరించి అనధికారింగా బోర్డులు వేసినా పట్టించుకోకుండా వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి.

నగరంలో డివైడర్ల మధ్య లాలీపప్‌ బోర్డులతోపాటు చాలా ప్రాంతాల్లో ప్రకటన, పోల్‌ బోర్డులు అనధికారికంగా ఏర్పాటు చేసినా పట్టించుకోకుండా వదిలేశారు. అప్పట్లో ఓ సంస్థకు గంపగుత్తగా నగరమంతా అప్పగించి అక్రమాలకు పాల్పడ్డారు. నాడు పనిచేసిన ఇరువురు అధికారులపై ఫిర్యాదులతో విచారణ చేసి అక్రమాలకు పాల్పడినట్లు తేలినా రాష్ట్ర టౌన్‌ కంట్రీ ప్లాన్‌ విభాగానికి సరెండర్‌ చేసి చేతులు దులుపుకున్నారు. సదరు అధికారులు మరో మున్సిపాలిటీలో ఉద్యోగాలు పొంది అక్రమాలు కొనసాగించారు. వారు కొద్దినెలల కొందట జీఎంసీకే వచ్చి ఉద్యోగంలో చేరారు. మళ్లీ అవే అక్రమాలు చాపకింద నీరులా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలపై ఇటీవల నగరపాలకసంస్థ కౌన్సిల్‌ హాల్‌లో పలువురు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో గళం విప్పారు. కమిషనర్‌ కీర్తి చేకూరి జీఎంసీ కమిషనర్‌గా వచ్చాక ప్రకటన బోర్డుల అనుమతులు, ఛార్జీల విషయంలో ప్రత్యేక దృష్టి సారించడంతో ఒకింత అనుమతులు ఇచ్చే క్రమంలోనూ ఛార్జీల వసూలు కొంతమేర మెరుగు పడింది. నూతన గెజిట్‌ ప్రకారం ప్రకటనల ఛార్జీల డిమాండ్‌ను రూ.6.54 కోట్లకు పెంచారు. ఇదే విధంగా ప్రకటనల విధానం.. ఛార్జీల విషయంలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తే ఇప్పుడున్న డిమాండ్లకు భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.


తేల్చని అనధికార బోర్డుల సంగతి

పట్టణ ప్రణాళిక అధికారుల నిర్వాకం వలన ప్రధాన వాణిజ్య ప్రాంతాలున్న డివిజన్లలో సంవత్సరాల తరబడి అనధికార ప్రకటనల బోర్డులు వందలాదిగా ఉన్నాయి. వీటి నియంత్రణకు ఏటా ప్రత్యేక కార్యాచరణ మొక్కుబడిగా చేపట్టడమేగానీ అనధికార బోర్డులు తొలగిస్తున్నది లేదు. అనుమతి లేని బోర్డులు పెడుతున్న ఏజన్సీలతో పలువురు అధికారులకు సంబంధాలు ఉండటం వలన సాధ్యం కావడం లేదు. వార్డు సచివాలయాల వారీగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినా ఉపయోగం ఉండడం లేదు. పలు ఏజెన్సీల యజమానులు వారికి ఇచ్చిన డిమాండ్‌ ప్రకారం పక్కాగా చెల్లింపులు చేస్తుండగా కొందరు మాత్రం బకాయిలు కట్టకుండా వదిలేస్తుండటంతో పేరుకుపోతున్నాయి. బకాయిల వసూలుకు అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది.


నగరం యూనిట్‌గా టెండరు నిర్వహిస్తే మేలు

ప్రకటనల ఆదాయం పక్కదారి పట్టకుండా.. అనధికార బోర్డులు సమస్య పరిష్కరించేందుకు నగరమంతా ఓ యూనిట్‌గా టెండరు నిర్వహిస్తే నిర్దేశించిన మేరకు జీఎంసీకి ఆదాయం సమకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకటనల బోర్డుల నిర్వహణలో అక్రమాలకు తావు లేకుండా పర్యవేక్షించేందుకు వీలుంటుంది. అవినీతి.. అక్రమ వ్యవహారాలు పెచ్చుమీరుతున్నందున ఇకనైనా పక్కా విధానాలు అమలులోకి తేవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరమంతా టెండరు దక్కించుకున్న ఏజన్సీ నుంచి జీఎంసీకి నిర్దేశించిన ఆదాయం రావడంతోపాటు అనధికార బోర్డులు లేకుండా క్యూఆర్‌ కోడ్‌, నూతన సాంకేతికతను పక్కాగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు