logo

నైపుణ్యానికే నీరాజనం

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉపాధి అవకాశాల పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో మాంద్యం సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమను కలవరపెడుతోంది. దిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Updated : 03 Feb 2023 05:51 IST

సాఫ్ట్‌వేర్‌లో 20 శాతం మందికే అవకాశాలు
ప్రతిభకు మరింత సానపడితేనే భవిష్యత్తు అంటున్న నిపుణులు
బాపట్ల, చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉపాధి అవకాశాల పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో మాంద్యం సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమను కలవరపెడుతోంది. దిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు పెద్దసంఖ్యలో రాకపై సందిగ్ధత నెలకొంది. ఈ ప్రభావంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో భారీగా కోత విధించాయి. సాధారణంగా ఇంజినీరింగ్‌ పూర్తవుతుండగా నాలుగో ఏడాదిలోనే యువ ఇంజినీర్లకు కొలువులు దక్కుతాయి. ఈ ఏడాది కేవలం 20 శాతం మందికే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. అత్యున్నత నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో 50 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. బీటెక్‌ పూర్తి చేసి ఏటా ఎనిమిది వేల మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులు బయటకు వస్తున్నారు. వీరిలో పది శాతం ఎంఎస్‌ చదవడానికి విదేశాలకు వెళ్తున్నారు. మరో పది శాతం మంది ఎంటెక్‌, ఎంబీఏ కోర్సుల్లో చేరుతున్నారు. 2021-22లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాయి. బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న ఒక్కో విద్యార్థికి మూడు, నాలుగు కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. కొలువులు లభించాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో ఉండిపోయారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి బీటెక్‌ పట్టా తీసుకుని వెంటనే ఉద్యోగాల్లో చేరతామని యువ ఇంజినీర్లు భావించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలలు వచ్చినా ఉద్యోగాల్లో చేరమని కంపెనీల్లో పిలుపు రాలేదు. కంపెనీల మానవ వనరుల విభాగం(హెచ్‌ఆర్‌) అధికారులను సంప్రదిస్తే ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు లేవని నైపుణ్యాలు పెంచుకుని వేచి ఉండాలని సూచించారు. మూడు జిల్లాల్లో రెండు వేల మంది కొలువుల్లో చేరక ముందే అవకాశాలు కోల్పోయారు.

ఇదే పరిస్థితి ఎప్పుడూ ఉండదు..

ప్రస్తుత గడ్డు పరిసితులను చూసి విద్యారులు ఆందోళన చెందరాదని నిపుణులు అంటున్నారు. కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ భద్రత, ఎథికల్‌ హ్యాకింగ్‌, డేటా సైన్స్‌, డేటా ఎనలటిక్స్‌, జావా, పైథాన్‌, నెట్ వర్కింగ్‌, ఏడబ్ల్యూఎస్‌, పెగా, కోడింగ్‌ వంటి కోర్సుల్లో చేరి శిక్షణ తీసుకుని నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బీటెక్‌ పూర్తి చేస్తే సరిపోదని, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఆధునిక కోర్సుల్లో శిక్షణ తీసుకుని నైపుణ్యాలు పెంచుకోవాలని బీఈసీ ప్రాంగణ నియామకాల అధికారి బి.విజయకృష్ణ పేర్కొన్నారు. సైబర్‌ భద్రత, డేటా సైన్స్‌పై పట్టు సాధిస్తే ఉద్యోగ అవకాశాలు సులువుగా లభిస్తాయన్నారు. ప్రధానంగా అమెరికా, యూరప్‌లో ఆర్థిక మాంద్యం కారణంగా కొత్త ప్రాజెక్టులు రావడం తగ్గిందని సెయింట్‌ ఆన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఉపాధి కల్పన శిక్షణ విభాగాధిపతి ఎన్‌. పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఎప్పుడూ ఉండదన్నారు. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం నుంచే విద్యార్థులు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఇచ్చే సర్టిఫికేషన్‌ కోర్సులు చేసి నైపుణ్యాలు సాధించాలి.


అమెరికాలో మాంద్యం కారణంగానే..

ఇంజినీరింగ్‌ పట్టభద్రులు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వెళ్లి పైథాన్‌, జావా, నెట్ వర్కింగ్‌, డాట్నెట్ కోర్సుల్లో చేరారు. పలు కంపెనీలు గతేడాది ఇచ్చిన నియామక పత్రాలను వెనక్కి తీసుకున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగానికి అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికాలో నవంబరు నుంచే మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయి. డిసెంబరు, జనవరిలో దీని ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపించింది. దిగ్గజ కంపెనీలైన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, మెటా, ఐబీఎం, ట్విట్టర్‌లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. రానున్న మూడు నెలల్లో భారీగా తొలగింపులు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహేంద్ర కొత్తగా కొలువులు ఇచ్చే విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. నూతన నియామకాల్లో 80 నుంచి 90 శాతం కోత విధించాయి. యువ ఇంజినీర్లకు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. కళాశాలల్లో ప్రాంగణ నియామకాల సందడే కనిపించటం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేవలం 20 శాతం మందికి మాత్రమే కొలువులు వచ్చాయి.


సర్టిఫికేషన్‌ కోర్సులు చేస్తున్నా
- చుండూరు వంశీ, బీఈసీ విద్యార్థి

ఈసీఈ నాలుగో సంవత్సరం చదువుతున్నా. బీటెక్‌లో 90 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. టీసీఎస్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌, మౌఖిక పరీక్షల్లో ప్రతిభ చూపి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యా. ఏడాదికి రూ.8 నుంచి 10 లక్షల వేతనం ఇస్తామని చెప్పారు. పోటీ ప్రపంచంలో రాణించడానికి సైబర్‌ భద్రత, డేటా సైన్స్‌, ఏడబ్ల్యూఎస్‌ సర్టిఫికేషన్‌ కోర్సుల్లో శిక్షణ చేసుకుంటున్నా


కృత్రిమ మేధలో శిక్షణ తీసుకుంటా
- యార్లగడ్డ హారిక, బీఈసీ విద్యార్థిని

సీఎస్‌ఈ చివరి సంవత్సరం చదువుతున్నా. బీటెక్‌లో 90 శాతం మార్కులు రావడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహించిన ఆన్‌లైన్‌ రాత, మౌఖిక పరీక్షల్లో పాల్గొనడానికి అవకాశం లభించింది. ప్రతిభ చూపి ఏడాదికి రూ.8 లక్షల వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యా. కొలువు వచ్చిందని ధీమాగా ఉండకుండా కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నా. ఆధునిక కోర్సుల్లో నైపుణ్యం సాధించడం వల్ల మరిన్ని అవకాశాలు లభిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు