logo

మళ్లీ పురివిప్పిన బియ్యం మాఫియా

పొన్నూరులో రేషన్‌ బియ్యం మాఫియా మళ్లీ పురి విప్పింది. స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో వారు మరలా రెచ్చిపోతున్నారు. మాఫియాలో ఆదిపత్య పోరు కోసం గత ఏడాది అక్టోబరులో జరిగిన బియ్యం వ్యాపారి అంజి బర్నబాస్‌ కిరాయి హత్య అనంతరం కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నారు.

Published : 04 Feb 2023 06:51 IST

ప్రజా ప్రతినిధుల అండతో రెచ్చిపోతున్న వ్యాపారులు
పొన్నూరు, న్యూస్‌టుడే

పొన్నూరులో రేషన్‌ బియ్యం మాఫియా మళ్లీ పురి విప్పింది. స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో వారు మరలా రెచ్చిపోతున్నారు. మాఫియాలో ఆదిపత్య పోరు కోసం గత ఏడాది అక్టోబరులో జరిగిన బియ్యం వ్యాపారి అంజి బర్నబాస్‌ కిరాయి హత్య అనంతరం కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నారు. అధికారులు హడావుడి చేయడంతో రేషన్‌ బియ్యం కొనుగోళ్లు నిలిపివేశారు. అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు అండ కోసం ప్రతినెల లక్షలాది రూపాయలు ఓ ప్రజా ప్రతినిధికి ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ముడుపులు తీసుకుంటున్న ఆయన మద్దతుతో మళ్ళీ రహాస్యంగా బియ్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తున్నారని సమాచారం.  

కేజీ రూ.8లకే..

స్థానిక పరిసర ప్రాంతాల్లో రేషన్‌ బియ్యంను గతంలో కార్డు దారుల నుంచి కేజీ రూ.10కి కొనుగోలు చేశారు. ఇప్పుడు బియ్యం కొనుగోలు ప్రక్రియను మాఫియా నిలిపివేయడం, వ్యాపారులకు ఖర్చులు పెరగడంతో ప్రస్తుతం కార్డు దారుల నుంచి కేజీ రూ.8లకే కొనుగోలు చేసి రేపల్లె నియోజక వర్గంలోని ఓ ప్రాంతానికి తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్కడ ఆ బియ్యాన్ని రీసైకిలింగ్‌ నిర్వహించి కాకినాడ పోర్టుకు తరలించే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. బర్నబాస్‌హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యాపారి మరలా అధికార పార్టీ నేతల అండతో మళ్లీ బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బియ్యం సేకరణలో రేషన్‌ డీలర్ల పాత్ర..

పొన్నూరు మండల, పట్టణ పరిధిలో 68 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. రేషన్‌ బియ్యం మాఫియాలో ఇద్దరు డీలర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ బియ్యంను కొనుగోలు చేసి రహాస్య ప్రాంతానికి తరలిస్తున్నారు. వారి దుకాణాలపై ఎటువంటి దాడులు జరగకుండా ఉండేందుకు ప్రతి డీలర్‌ నుంచి రూ.800 చొప్పున వసూలు చేసే బాధ్యతను రెవెన్యూ శాఖలో పనిచేసి పదవి విరమణ పొందిన ఓ ఉద్యోగికి ఆ బాధ్యతలు అప్పగించారు. అతను దుకాణాల వద్దకు వెళ్ళి మామూళ్ళు వసూలు చేసే ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.  

* ఈ విషయమై పొన్నూరు పౌర సరఫరాలశాఖ అధికారిణి భవనేశ్వరిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పౌరసరఫరాల శాఖ అధికారిణిగా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పొన్నూరు పరిసర ప్రాంతాల్లో రేషన్‌ బియ్యం కొనుగోలు చేయడం లేదని ఆమె చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని