logo

కఠోర శ్రమే విజయానికి పునాది

విజయానికి దగ్గర దారులు లేవని, కేవలం కఠోర శ్రమతోనే దాన్ని సాధించవచ్చని ఏపీ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య కె.రామమోహనరావు తెలిపారు.

Updated : 04 Feb 2023 07:09 IST

ఏపీ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య రామమోహనరావు
జేసీ న్యాయ కళాశాలలో మూట్‌ కోర్టు పోటీలు

నవభారత్‌నగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే: విజయానికి దగ్గర దారులు లేవని, కేవలం కఠోర శ్రమతోనే దాన్ని సాధించవచ్చని ఏపీ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య కె.రామమోహనరావు తెలిపారు. గుంటూరు జాగర్లమూడి చంద్రమౌళి న్యాయ కళాశాల మూట్‌ కోర్టు సొసైటీ అధ్యర్యంలో రెండురోజుల రెండో జాతీయ స్థాయి మూట్‌ కోర్టు పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే మూట్‌కోర్టు వంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నైపుణ్యాలు అలవడతాయన్నారు. అభివృద్ధి, వ్యక్తిత్వం ఒక్క రోజులో సాధ్యం కాదని, అది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. న్యాయవాది ప్రతి చిన్న విషయాన్ని సైతం పరిశీలించాలని, పలు భాషల్లో నైపుణ్యం వృత్తికి ఉపయోగపతాయన్నారు. నాగార్జున ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కళాశాలలో ఈ ఏడాది బీబీఏ బీఎల్‌ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. కళాశాల కార్యదర్శి వేమన కుప్పుస్వామి మాట్లాడుతూ కళాశాలలో చక్కని గ్రంథాలయంతో పాటు ప్రతి వారం మూట్‌కోర్టు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చిట్టినేని సుధాకర్‌బాబు మాట్లాడుతూ 2020లో మొదటిసారిగా జాతీయ స్థాయి పోటీలు ప్రారంభించామని, ఈ ఏడాది 13 రాష్ట్రాల నుంచి 30 జట్లు పోటీలకు వచ్చాయని వెల్లడించారు. మొదటిరోజు 6 కోర్టుల్లో ఐదు రౌండ్ల పాటు జరిగిన పోటీల్లో జట్లు పాల్గొన్నాయని, క్వార్టర్‌ఫైనల్స్‌, సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ పోటీలు శనివారం జరుగుతాయన్నారు. విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంంలో బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఏపీ సభ్యుడు ఎ.రామిరెడ్డి హాజరౌతున్నట్లు ప్రిన్సిపల్‌ సీహెచ్‌.సుధాకర్‌బాబు చెప్పారు. అనంతరం ఆచార్య కె.రామమోహనరావును కళాశాల పాలకవర్గం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో జేకేసీ కళాశాల కార్యదర్శి జాగర్లమూడి మురళీమోహన్‌, కేఎల్‌పీ పాఠశాల కార్యదర్శి డాక్టర్‌ కొండబోలు కృష్ణప్రసాద్‌, ఆర్వీఆర్‌ విద్యా కళాశాల కార్యదర్శి గద్దె మంగయ్య, జేసీ న్యాయ కళాశాల సంయుక్త కార్యదర్శి భైరపనేని నరేష్‌, విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు బ్రహ్మానందరెడ్డి, బ్రహ్మారెడ్డి, తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని