logo

ధాన్యం రైతుకు ‘చెల్లింపు’కష్టాలు

ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటున్న అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్బీకే యంత్రాంగం తేమశాతం పరిశీలించి బరువు తూచి మిల్లులకు పంపిన తర్వాత కొందరు మిల్లర్లు ధాన్యం దించుకోకుండా షరతులు పెడుతున్నారు.

Published : 05 Feb 2023 04:32 IST

ఈనాడు-అమరావతి

ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటున్న అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్బీకే యంత్రాంగం తేమశాతం పరిశీలించి బరువు తూచి మిల్లులకు పంపిన తర్వాత కొందరు మిల్లర్లు ధాన్యం దించుకోకుండా షరతులు పెడుతున్నారు. తేమశాతం ఎక్కువగా ఉందని, కటింగ్‌ అవుతోందని, బరువు కొంత తగ్గిందని ఇలా పలు సాకులు చూపి తగ్గిన మేర సొమ్ము నిర్ణయించి చెల్లించిన తర్వాతే అన్‌లోడింగ్‌ చేసుకుంటున్నారు. షరతులకు రైతులు అంగీకరించకుండా వాదనకు దిగినా పట్టించుకోవడం లేదు. లారీ, ట్రాక్టర్లు మిల్లుకు వెళ్లిన తర్వాత వెంటనే బస్తాలు దించకపోతే వెయిటింగ్‌ ఛార్జీ కింద అదనంగా వసూలుచేస్తున్నారు. ఎలాగూ మిల్లు వరకు తీసుకువచ్చినందున ఇక తిరిగి వెళ్లలేరని కొందరు మిల్లర్లు పొంతన లేని నిబంధనలు పెట్టి సొమ్ము వసూలుచేస్తున్నారు. రైతులు ధాన్యం బస్తాలకు నింపుకుని తూకం వేసుకుని ఆర్బీకేలో ప్రక్రియ పూర్తిచేసుకుని లారీలు, ట్రాక్టర్లకు లోడ్‌ చేసుకుని మిల్లుకు వెళ్లేసరికి మధ్యాహ్నాం 2గంటలు అవుతోంది. అప్పటినుంచి రైతును వివిధ కారణాలతో సాయంత్రం వరకు వేచిఉండేలా చేస్తున్నారు. సాయంత్రం తర్వాత ఏదో ఒక కొర్రీ వేసి సొమ్ము చెల్లిస్తేనే దించుకుంటామని షరతులు విధిస్తున్నారు. దీంతో రైతు చేసేదిలేక విసిగిపోయి అడిగినంత సొమ్ము ఏదో రకంగా చెల్లించి ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి. మరోవైపు ఆర్బీకే సిబ్బంది సూచించిన వేబ్రిడ్జి వద్ద ట్రాక్టరు లేదా లారీ బరువు తూచి మిల్లుకు తీసుకెళితే అక్కడ వారు సూచించిన వేబ్రిడ్జి యంత్రం వద్ద మళ్లీ బరువు చూస్తున్నారు. ఈక్రమంలో 30కిలోల నుంచి 120 కిలోల వరకు లారీకి తగ్గుదల వస్తోంది. ఇలా తగ్గిన ధాన్యానికి కిలోకు రూ.20లు చొప్పున రైతు మిల్లర్లకు అప్పటికప్పుడే చెల్లించాలి. ఇలా తేడా ఎందుకు వస్తుందని రైతులు అడిగితే వేబ్రిడ్జికి, వేబ్రిడ్జికి తేడా ఉంటోందని, తామేమి చేస్తామని మిల్లర్లు చెబుతున్నారు. ఇలా పలు కారణాలతో రైతులకు బ్యాంకులో మద్దతు ధర మేరకు సొమ్ము జమ అవుతున్నా మిల్లర్లకు చెల్లించే సొమ్ము, ఎత్తుడు, దించుడు కూలీలు, హమాలీ మామూలు అన్నీ కలుపుకుంటే మద్దతు ధర దక్కడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఆర్బీకే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ధాన్యం నాణ్యత, తేమశాతం చూసిన తర్వాతే పంపుతున్నా కొందరు మిల్లర్లు అంగీకరించడం లేదు. మిల్లులో ఉన్న తేమశాతం చూసే యంత్రంలో వచ్చిన శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

* బాపట్ల జిల్లాలో రైతు ఒకరు ధాన్యాన్ని ఆర్బీకేలో మద్దతు ధరకు విక్రయిస్తే కారంచేడు మండలంలోని ఓ మిల్లుకు తరలించాలని సిబ్బంది సూచించారు. ట్రాక్టర్లలో అక్కడికి ధాన్యం మిల్లుకు తీసుకెళితే ధాన్యాన్ని పరిశీలించిన మిల్లు యజమాని ఈ-పంటలో నమోదుచేసిన రకానికి, మిల్లు తెచ్చిన ధాన్యం రకానికి తేడా ఉందని పేచీ పెట్టారు. ఎట్టకేలకు సాయంత్రానికి ధాన్యం తీసుకెళ్లిన రైతు రూ.20వేలు చెల్లిస్తేనే ధాన్యాన్ని రాత్రివేళ దించుకున్నారు. మిల్లరుతో చర్చల్లో విసుగు చెందిన రైతు ఓ దశలో ధాన్యం వెనక్కి తీసుకెళ్లడానికి సిద్ధంకాగా ఒక వాహనంలో తీసుకురావాల్సిన ధాన్యాన్ని రెండు వాహనాల్లో తెచ్చినందున దారిలో పోలీసులు అడ్డుకుంటారని, మరో మిల్లరు కొనుగోలు చేయరని చెప్పి రైతుపై ఒత్తిడి తీసుకురావడం గమనార్హం.

* పౌరసరఫరాలశాఖ పంపిణీ చేసిన తేమ కొలిచే యంత్రాల్లో తేమశాతం కొలిచి నిర్ధారించి మిల్లుకు పంపిన తర్వాత అక్కడ వారి యంత్రాలలో తేమశాతం పరిశీలించినప్పుడు 2 నుంచి 4శాతం వరకు తేడా వస్తోంది. దీంతో మరో ఆర్బీకేలోని తేమ చూసే యంత్రంతో సరిచూసి మిల్లరుకు తెలియజేసిన తర్వాత దించుకుంటున్నారు. సీజన్‌ అయిపోయిన తర్వాత మిల్లుల్లో యంత్రాలను నిరుపయోగంగా ఉంచుతున్నారు. వీటిని క్యాలిబరేషన్‌ చేయించకుండానే ప్రస్తుతం వాడుతున్నందున తేడా వస్తోందని సాంకేతిక సహాయకులు చెబుతున్నారు. దీంతో కొన్నిసార్లు ధాన్యం దించడంలో మిల్లుల వద్ద జాప్యం జరుగుతోంది. పల్నాడు జిల్లాలో ఇలాంటి సమస్య వస్తే వెంటనే పౌరసరఫరాలశాఖ అధికారులు జోక్యం చేసుకుని మిల్లరుతో మాట్లాడి సమస్య పరిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని