logo

కలుషితం కాకుండా కట్టడి ఎలా?

రక్తహీనత, పోషకాహార లోపం దరిచేరకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం ఎంతో కీలకం. ఆహార పదార్థాలు కలుషితమై పిల్లల ప్రాణాలు తోడేయడం ఏదొకచోట ప్రభుత్వ వసతి గృహాల్లో చూస్తున్నాం.

Published : 05 Feb 2023 04:32 IST

వసతి గృహాల్లో నాణ్యతలేని ఆహారంతో ఆసుపత్రి పాలవుతున్న విద్యార్థులు
కొరవడిన యంత్రాంగం పర్యవేక్షణ
సత్తెనపల్లి, న్యూస్‌టుడే

సత్తెనపల్లి ఆసుపత్రిలో రామకృష్ణాపురం గురుకుల పాఠశాల విద్యార్థినులు(పాతచిత్రం)

రక్తహీనత, పోషకాహార లోపం దరిచేరకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం ఎంతో కీలకం. ఆహార పదార్థాలు కలుషితమై పిల్లల ప్రాణాలు తోడేయడం ఏదొకచోట ప్రభుత్వ వసతి గృహాల్లో చూస్తున్నాం. కలుషిత ఆహారం తిని పిల్లలు ఆసుపత్రి పాలుకావడం సాధారణ విషయం అన్నట్లుగా మారింది. యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటంతో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడైనా ఘటన జరిగినప్పుడు అధికార యంత్రాంగం హడావుడి చేయడం తప్పా పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో చోద్యం చూస్తుంది. సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణాపురం గురుకుల బాలికల పాఠశాలలో 206 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతతకు గురయ్యారు. మధ్యాహ్నం.. రాత్రి రెండు పూటలా ఆహారం తిన్న తరువాత విద్యార్థినులు ఇబ్బందిపడటం ఆ పాఠశాలలో పర్యవేక్షణా లోపాన్ని ఎత్తిచూపిస్తుంది. ఈ పాఠశాల నిర్వహణలో లోపాలపై తరచూ ఆరోపణలు వస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడమే ఇప్పుడు పిల్లల అనారోగ్యానికి కారణమైందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.

పల్నాడు జిల్లాలోని 28 మండలాలు, ఆరు పట్టణాలు, రెండు నగర పంచాయతీల పరిధిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 10, జగనన్న గోరుముద్ద అమలయ్యే పాఠశాలలు 1573, కేజీబీవీలు 24, ఏపీ ఆదర్శ పాఠశాలలు 14, బీసీ బాలికల గురుకుల పాఠశాలలు రెండు, ఇతర సంక్షేమ విద్యాలయాలు మరో 20 వరకు ఉన్నాయి. వీటిలో రోజూ సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం ఒక్కపూటే జగనన్న గోరుముద్ద వడ్డిస్తున్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కేజీబీవీల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట విద్యార్థులకు ఆహారం అందజేస్తున్నారు. ఏపీ ఆదర్శ పాఠశాలల వసతిగృహాల్లోనూ ఇదే తీరు ఉంది. పర్యవేక్షణ కొరవడటంతో నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన రామకృష్ణాపురం గురుకుల పాఠశాల బాలికల్ని కదిలిస్తే తాగే నీటి నుంచి తినే ప్రతి ఆహారం నాసిరకంగా ఉంటుందని అధికారుల వద్ద వాపోయారు.  ఉన్నతాధికారులు విద్యాలయాల్ని తనిఖీ చేసి ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీటి  కలుషితంలో బాధ్యతారాహిత్యం ఉంటే చర్యలకు సిఫార్సు చేయాలి. ప్రభుత్వ విద్యాలయాల్లో ఆహారం తయారీకి ఉపయోగించే వస్తువులతోపాటు పిల్లలకు వడ్డించే ఆహారం నాణ్యంగా ఉంటుందో లేదో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలి. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అక్రమాలపై చర్యలు ఉంటాయనే భయం మొదలైతే పిల్లలకు బలవర్థమైన ఆహారం అందే అవకాశం ఉంటుంది.

ఏం చేయాలి..  ఏం చేస్తున్నారు..

ప్రభుత్వ విద్యాలయాల్లో అల్పాహారం, భోజనం వంటావార్పు ఉపాధ్యాయుల కనుసన్నల్లో జరగాలి. పాఠశాలల ఆవరణలోనే ఆహారం తయారీ జరిగేలా చర్యలు తీసుకోవాలి. వంట పూర్తయిన తరువాత ఉపాధ్యాయులు రుచి చూసి పిల్లలకు తగిన జాగ్రత్తలతో వడ్డించేలా చూడాలి. చేతుల శుభ్రత తరువాతే పిల్లలు ఆహారం తినేలా చూడాలి.
* విద్యాలయాల బాధ్యులతో వంట ఏజెన్సీలు మిలాఖత్‌అయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భోజనం, కూరలు, అల్పాహారం తయారీవద్ద పర్యవేక్షకులు ఉండట్లేదు. పిల్లల భోజనం లెక్కల్లోనూ జిమ్మిక్కులు చేస్తున్నారనే ఆరోపణలు చాలాచోట్ల ఉన్నాయి. భోజనం తిన్న తరువాత కడుపులో నొప్పి ఉందని.. వాంతులు, విరేచనాలు అవుతున్నాయని చెబితే పెరుగన్నం తినమని, టాబ్లెట్‌ వేసుకుని నిద్రపోమ్మని సర్ది చెబుతున్నారే.. తప్పించి ఆహారం తయారీలో లోపాలపై దృష్టి సారించట్లేదు

* జగనన్న గోరుముద్ద చూసుకుంటే 1.65 లక్షల మంది విద్యార్థులకుగాను రోజూ 1.12 లక్షల నుంచి 1.25 లక్షల మందే తింటున్నారు. మిగిలిన విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకుంటున్న ఆహారాన్ని తింటున్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పిల్లలకు ఆ అవకాశం లేదు. ఇళ్లకు పదులు, వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుకులాల్లో వారు చదువుకుంటున్నారు. అలాంటి పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సి ఉండగా నాసిరకం ఆహారంతో కొందరు తమ జేబులు నింపుకుంటూ లోకం పోకడ తెలియని విద్యార్థుల్ని ఆసుపత్రుల పాల్జేస్తున్నారు.

పలు సంఘటనల్లో బాధితులు ఇలా..

* నాదెండ్లలోని సాంఘిక సంక్షేమ వసతిగృహంలో కలుషిత ఆహారం తిని 2015లో ఒకరు చనిపోగా, 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 2018 ఏప్రిల్‌లో నాదెండ్ల కేజీబీవీలో కలుషిత ఆహారంతో 18 మంది బాలికలు ఆసుపత్రి పాలయ్యారు.

* గతేడాది జులైలో గురజాల మదర్‌సాలో కలుషిత ఆహారం తిని నకరికల్లు మండలంలోని గుళ్లపల్లికి చెందిన ఒక విద్యార్థి మృతి చెందగా మాచర్ల మండలానికి చెందిన మరో విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

* గతంలో ముప్పాళ్ల మండలంలోని ఇరుకుపాలెం మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితమై 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పల్నాడు జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు