logo

రూ.వెయ్యితో ఏం చేయాలి?

మాచర్ల-నల్గొండ రైలు మార్గం నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.వెయ్యి కేటాయించడం పల్నాడు ప్రజల్ని విస్తుబోయేలా చేసింది. 92 కిలోమీటర్లు దూరం ఉన్న ఈ మార్గం నిర్మాణానికి 20 ఏళ్ల నుంచి ప్రతిపాదనలున్నాయి.

Published : 05 Feb 2023 04:32 IST

మాచర్ల-నల్గొండ రైలు మార్గం నిర్మాణం బడ్జెట్‌లో నిధులివీ..
కీలకమైన రైల్వే ప్రాజెక్టు అటకెక్కించడంపై విమర్శల వెల్లువ
మాచర్ల, న్యూస్‌టుడే

మాచర్ల రైల్వేస్టేషన్‌లో నిర్మించిన పరిపాలన భవనం ఇదే..

మాచర్ల-నల్గొండ రైలు మార్గం నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.వెయ్యి కేటాయించడం పల్నాడు ప్రజల్ని విస్తుబోయేలా చేసింది. 92 కిలోమీటర్లు దూరం ఉన్న ఈ మార్గం నిర్మాణానికి 20 ఏళ్ల నుంచి ప్రతిపాదనలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఏపీ-తెలంగాణ మధ్య ఈ రైలు మార్గానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే కేటాయింపులు రూ.1.50 కోట్లు లోపలనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో కేవలం ఈ మార్గానికి రూ.1000 కేటాయించడం గమనించాల్సిన అంశం. ఈ ప్రాజెక్టు దస్త్రం పూర్తిగా మూసేయకుండా జీవం పోసేందుకు ఈ నామమాత్రపు కేటాయింపులు చేస్తున్నట్లు అర్థమవుతుంది.

ఇరవై సంవత్సరాల నుంచి మాచర్ల-నల్గొండ రైలు మార్గం తెర మీదకు వచ్చింది. ఈ మార్గం కోసం నరసరావుపేట, నల్గొండ ఎంపీలు పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించారు. పారిశ్రామికంగా, వ్యవసాయ వాణిజ్యపరంగా ఈ మార్గం మేలు చేస్తుందని పార్లమెంటులోనూ పేర్కొన్నారు. ప్రస్తుతం నల్గొండ-మాచర్ల మధ్య రైలు ప్రయాణం చేయాలంటే నడికూడి జంక్షన్‌ వరకు వెళ్లి ప్రయాణం చేయాల్సిందే. మాచర్ల-నల్గొండ మార్గం వలన దూరం తగ్గడంతోపాటు, సమయం కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ప్రపంచ పర్యాటక ప్రాంతం నాగార్జునసాగర్‌ మీదుగానే ఈ మార్గం వెళ్తుంది. దీని వలన దూరప్రాంతాల వాళ్లు రైలు మార్గం ద్వారా సాగర్‌ వచ్చేందుకు వెసులుబాటు ఉంటుందని గతంలో అధికారులు పేర్కొన్నారు. 2009లో అధికంగా రూ.కోటి కేటాయించారు. మార్గం కోసం సర్వే చేయడంతో పాటు మాచర్ల రైల్వేస్టేషన్‌లో పరిపాలన భవనం నిర్మించారు. తరువాత నామమాత్రపు నిధులు కేటాయింపులు నేపథ్యంలో ఈ మార్గం దస్త్రం అటకెక్కింది. మాచర్ల స్టేషన్‌లోని భవనాన్ని ప్రత్యామ్నాయంగా మరో అవసరానికి రైల్వేశాఖ వినియోగిస్తుంది. తాజాగా కేటాయించిన రూ.వెయ్యితో ఏం చేయాలో మరి రైల్వేశాఖ నిర్ణయించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని