logo

అధిక ధరకు యూరియా అమ్మకాలపై తనిఖీలు

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో శనివారం వ్యవసాయాధికారులు యూరియా అధిక ధరకు విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు.

Published : 05 Feb 2023 04:32 IST

పొన్నూరులో తనిఖీలు చేస్తున్న ఏడీఏ తిరుమలదేవి

ఈనాడు-నరసరావుపేట, న్యూస్‌టుడే-నకరికల్లు  : గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో శనివారం వ్యవసాయాధికారులు యూరియా అధిక ధరకు విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారులు అధిక ధరకు అమ్ముతున్న వైనంపై ‘ఈనాడు’లో శనివారం ‘యూరియా... ఏదయా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బాపట్ల జిల్లాలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాయి. చీరాల మండలంలో ఏడీఏ లక్ష్మీ ఆధ్వర్యంలో ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో శనివారం తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో వ్యవసాయాధికారి దుకాణాలను తనిఖీ చేసి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. మండలంలోని నాలుగు ఆర్బీకేలకు శనివారం 60 టన్నుల యూరియాను సరఫరా చేశారు. దీంతో స్థానికంగా రైతులకు యూరియా అందుబాటులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోనూ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆకస్మిక దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటున్నారు. పొన్నూరు పట్టణంలో ఏడీఏ తిరుమలదేవి ఆధ్వర్యంలో అధికారులు దుకాణాల్లో యూరియా నిల్వలపై తనిఖీలు చేశారు. దుగ్గిరాల మండలంలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. జిల్లాలోని పలు మండలాల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు